భారతదేశంలో రోడ్డుపై వాహనం నడపాలంటే తప్పకుండా.. డ్రైవింగ్ లైసెన్స్ కావాలని అందరికీ తెలుసు. ఈ డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి కొన్ని పరీక్షలు ఉంటాయన్న సంగతి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ పరీక్షలను మరింత కఠినం చేసిన మొదటి రాష్ట్రంగా కేరళ రికార్డ్ క్రియేట్ చేసింది. 2025 అక్టోబర్ 1 నుంచి ఈ కఠిన పరీక్షలు అమలులోకి వచ్చేలా కొన్ని సంస్కరణలు చేస్తున్నట్లు సమాచారం.
పెరిగిన ప్రశ్నలు
దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి కేరళ ప్రభుత్వం దోహదపడుతోంది. ఇందులో భాగంగానే.. ఆచరణాత్మక డ్రైవింగ్ టెస్ట్ మరింత కఠినతరం చేస్తోంది. లెర్నర్స్ లైసెన్స్ టెస్టులో ప్రశ్నలు 20 నుంచి 30కి పెరిగాయి. ఇందులో 60 శాతం ఉత్తీర్ణత లేదా స్కోర్ సాధించాలి. సమాధానం ఇచ్చే సమయంలో కూడా మార్పులు చేసినట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కే.బీ. గణేష్ కుమార్ పేర్కొన్నారు. మొత్తం మీద డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి 83 శాతం అర్హత సాధించాలని పేర్కొన్నారు.
నెగటివ్ మార్కులు
డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి నిర్వహించే టెస్టులో నెగటివ్ మార్కులు కూడా ఉన్నాయి. సమాధానం తెలియని ప్రశ్నలకు వదిలిపెట్టే అవకాశం కూడా కల్పిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 పాయింట్లు తీసేస్తారు. బహుశా ఇలాంటి విధానం దేశంలోనే ఎక్కడా లేదు. టెస్టుకు సిద్దమవ్వడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్ కూడా ప్రారంభించింది. ఇందులో సిలబస్, ప్రాక్టీస్ సెట్, మాక్ టెస్ట్ వంటివి ఉన్నాయి.
పబ్లిక్ రోడ్డుపై టెస్టింగ్
ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ కూడా ప్రత్యేకంగా రూపొందించారు. ఇందులో పాల్గొనే అభ్యర్థులు యాంగ్యులర్, సమాంతర పార్కింగ్, గ్రేడియంట్ డ్రైవింగ్, జిగ్-జాగ్ విన్యాసాలను చూపించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా వాస్తవ ప్రపంచ పరిస్థితులను అనుకరించే విధంగా నిర్మించబడి ఉంటాయి. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. పబ్లిక్ రోడ్ టెస్టింగ్. అభ్యర్థులు క్లోజ్డ్ ట్రాక్‌లలో కాకుండా.. నిజమైన ట్రాఫిక్‌లో వాహనం నడపాల్సి ఉంటుంది.
టెక్నాలజీ సాయం
కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ కొత్త విధానం.. ఎక్కువగా టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. టెస్టింగ్ వాహనాలకు డాష్‌బోర్డ్ కెమెరాలు, జీపీఎస్ ట్రాకర్స్ మొదలైనవి ఉంటాయి. ఇవి ఎప్పటికప్పుడు అభ్యర్థుల పనితీరును రికార్డ్ చేస్తాయి. ఈ రికార్డ్ మొత్తం దాదాపు మూడు నెలలు ఉంటుంది. ఏదైనా వివాదాలు తలెత్తితే.. దానికి ఇవే పరిష్కారం చూపిస్తాయి. అంతే కాకుండా 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసైనా కార్లను టెస్ట్ కోసం ఉపయోగించడం నిషేధం.
రోజుకు కొంతమందే!
కఠినమైన విధానాలు డ్రైవింగ్ లైసెన్స్ కోసం వేచి ఉండే సమయాన్ని పెంచింది. మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ ప్రతిరోజూ నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే డ్రైవింగ్ టెస్టుకు అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. దీంతో చాలా మంది అప్లై చేసుకున్న వారు కూడా వారి తేదీ వచ్చే వరకు వేసి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రాసెసింగ్ నెమ్మదిగా ఉన్నప్పటికీ.. పరీక్షలు మాత్రం విజయవంతంగా నిర్వహిస్తోంది. దీంతో డ్రైవింగ్ లైసెన్స్ టెస్టులో పాస్ అయ్యేవారి సంఖ్య తగ్గిపోతోంది. దీనిపై ప్రస్తుతం కొంత వ్యతిరేకత కూడా మొదలైంది.