నేనొక చిత్రమైన పాత్ర చేశా!.. కాంత గురించి ముందే చెప్పిన రానా

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ జంటగా నటించిన చిత్రం కాంత. ఈ సినిమా నవంబర్ 14వ తేదీన థియేటర్లలో విడుదల కానున్నది. రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ లు ఇద్దరు కలిసి ఈ సినిమాను వారి నిర్మాణ సంస్థలైన.. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు వేఫెరర్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. సెల్వమని సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు.

దాదాపు 1950ల కాలంలో జరిగే పీరియాడిక్ డ్రామా కథ ఇది. ఆనాడు మద్రాసు (చెన్నై)లో ఉన్న ఏవిఎం స్టూడియోస్ & విజయ వాహిని స్టూడియోస్ లాంటి వాటిలో అప్పుడు నిర్మాతలకు, డైరెక్టర్లకు, సంగీత దర్శకులకు, నటులకు, ఇతరత్ర సాంకేతిక నిపుణులకు వారి వారి మధ్య ఉన్న అహం వలన ఎటువంటి రాజకీయాలు నడిచేవి, ఎవరెవరి జీవితాలు ఎలా తారుమారయ్యేవి అనేది చాలా ఆసక్తిగా ఈ సినిమాలో చూపించనున్నారు.

ఆయన జీవితం ఆధారంగానే..

ఒకప్పటి ప్రఖ్యాత నటుడు మొట్టమొదటి తమిళ సూపర్ స్టార్ ఎం.కె. త్యాగరాజ భాగవతార్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకేక్కింది. ఆయన ఎదుగుదల, ఒడిదుడుకులు మరియు ఆ సమయంలో ఉన్న తమిళ, తెలుగు ముఖ్య కథానాయకులు, దర్శక, నిర్మాతల పాత్రలు కూడా ఇందులో కనిపించునున్నాయి.

ఇప్పుడంటే మీడియాను మించిన సోషల్ మీడియా వచ్చింది. టెక్నాలజీ పెరిగింది. స్టూడియోస్ చాలా వచ్చాయి. అందుకే ఇండస్ట్రీలో ఏం జరిగినా.. క్షణాల్లో బయట ప్రపంచానికి తెలిసిపోతుంది. ఇప్పుడు ఉన్నంత ప్రచారం, సమాచారం, టీవీలు, వార్త పత్రికలు అప్పట్లో అంతగా లేవు. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో చాలామందికి తెలిసేది కాదు, కొద్దిమందికి తప్పా. అందుకే జనాలు కూడా వారు ఏదో చాలా గొప్పవాళ్లుగా ఊహించుకునే వారు. సినిమా వాళ్ల జీవన విధానం, అలవాట్లు, ప్రవర్తన శైలి ఇంకా అనేకం వారి గురించి తెలుసుకోవాలని, వారిని చూడాలనే ఆత్రుత, ఆరాటం కనిపించేవి. మాములుగా ఇతరుల జీవితాల్లో ఏమి జరుగుతుందో, ఏంటో తెలుసుకోవాలని చూసే అలవాటు ఉన్న జనాలే ఎక్కువ కాబట్టి ఈ సినిమా ఆసక్తికరంగానే ఉంటుంది అనిపిస్తుంది.

విచిత్రమైన పాత్రలో రానా

రానా దగ్గుబాటి ఈ సినిమాను నిర్మించడమే కాకుండా ఇందులో పీనిక్స్ అనే ఒక ముఖ్య పాత్రలో నటించడం జరిగింది. ఈ కాంత సినిమా కు సంబందించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా రానా మీడియాతో మాట్లాడుతూ తాను ఒక విచిత్రమైన పాత్ర చేశానని ఆ కాలంలో ఎవరు అంత వైలెంట్‍గా ఉండరని, అయితే ఏ రిఫరెన్స్ లేకుండా చేసిన క్యారెక్టర్‌గా ఆయన చెప్పుకొచ్చారు. ఒక గురు శిష్యుల మధ్య జరిగే డ్రామా అని కూడా తెలిపాడు. చాలా రోజుల తరువాత ఇలా జనాల మధ్యలోకి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా ఎవరిని నొప్పించదని కచ్చితంగా అందరికి నచుతుందని రానా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక సినిమా ఎలా ఉందో తెలుసుకోవడానికి రిలీజ్ వరకూ ఆగాల్సిందే మరి.