తండ్రి ప్రపంచ కుబేరుడు.. ఆర్థిక ఇబ్బందులతో అద్దింట్లో కూతురు

తండ్రి ధనవంతుడైతే.. పిల్లలు కూడా ధనవంతులుగానే విలాసవంతమైన జీవితం గడుపుతారు. అయితే ఎలాన్ మస్క్ కుమార్తె వివియన్ విల్సన్ మాత్రం అందుకు భిన్నం. ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటూ.. ఒక అపార్ట్‌మెంట్‌లో మరో ముగ్గురితో కలిసి నివసిస్తోంది. న్యూయార్క్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను ఆమె వెల్లడించారు.

నా దగ్గర లక్షల డాలర్లు లేవు!

ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ సంపద సుమారు రూ. 42,778 కోట్ల కంటే ఎక్కువ. అంతటి సంపన్నుడి కుమార్తె వివియన్ విల్సన్ మాత్రం ఎప్పుడూ.. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉండటం గమనార్హం. ఆర్ధిక సమస్యల కారణంగానే లాస్ ఏంజిల్స్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ముగ్గురు రూమ్‌మేట్‌తో కలిసి నివసిస్తోంది. నా దగ్గర చాలా డబ్బు ఉంటుందని అనుకుంటారు. కానీ అదంతా నిజం కాదు. నాకు ఇప్పుడు ఆర్ధిక స్వాతంత్య్రం ఉంది. నా దగ్గర లక్షల డాలర్లు లేవు అని ఇంటర్వ్యూలో 21ఏళ్ల వివియన్ విల్సన్ పేర్కొన్నారు.

తన తల్లిదండ్రుల ఆర్ధిక ప్రపంచాల మధ్య చాలా వ్యత్యాసం ఉందని కూడా ఇంటర్వ్యూలో వివియన్ విల్సన్ అన్నారు. తన తల్లి జస్టిస్ విల్సన్ కొంత సంపదను మాత్రమే కలిగి ఉండగా.. తండ్రి ఎలాన్ మస్క్ మాత్రం ప్రపంచ కుబేరుడు, ఈయన దగ్గర ఊహకందనంత డబ్బు ఉంది. అయితే వీరి ఇద్దరి డబ్బు మీద నేను ఆధారపడను. నేనే సొంతంగా జీవిస్తూ.. ఆహారం, రూమ్ రెంట్, నిత్యావసరాలు మొదలైనవాటికి సంపాదించుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చింది.

తండిపై కోపంతో ట్రాన్స్‌జెండర్‌గా!

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ 2000వ సంవత్సరంలో జస్టిస్ విల్సన్ను పెళ్లి చేసుకున్నారు. ఈమె ఒక రచయిత్రి. అయితే వీరు 2008లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ జంటకు పుట్టిన పిల్లల్లో ఒకరు జేవియర్ అలెగ్జాండర్ మస్క్. తల్లి దండ్రులు విడిపోయిన తరువాత .. తన తండ్రి వారసత్వాన్ని వద్దనుకుని 16ఏళ్ల వయసులో ట్రాన్స్‌జెండర్‌గా (వివియన్ విల్సన్) మారిపోయాడు. దీనికి కావలసిన హక్కులను ఇతడు కోర్టు నుంచి పొందాడు. తండ్రి వారసత్వాన్ని మాత్రమే కాదు, తండ్రి ఆస్తిలో కూడా ఏమీ ఆశించకపోవడం గమనించదగ్గ విషయం.

చిన్నప్పటి నుంచి మానసిక వేదనకు గురైన.. జేవియర్ అలెగ్జాండర్ మస్క్, తల్లిదండ్రులు విడిపోయిన తరువాత.. తాను కూడా తండ్రితో ఎటువంటి సంబంధాలు ఉండకూడదని నిర్ణయించుకున్నారు. తనకు స్వతంత్య్రమైన గుర్తింపు ఉండాలని భావించి.. ట్రాన్స్‌జెండర్‌గా మారి తల్లిపేరు వచ్చేలా వివియన్ విల్సన్‌గా మారిపోయారు. ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారు.

వివియన్ విల్సన్ గురించి

ఎలాన్ మస్క్ 14 మంది సంతానంలో ఒకరైన వివియన్ విల్సన్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, మోడల్‌గా గుర్తింపు పొందింది. ఈమె జపాన్‌లోని టోక్యోలో టెంపుల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో చదువుకుంది. ఆ తరువాత 2025లో మోడలింగ్ కోసం లాస్ ఏంజిల్స్‌కు తిరిగి వచ్చింది. ప్రస్తుతం ఈమె ఫ్రెంచ్, స్పానిష్, జపనీస్ భాషలను చదువుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమెకు మొత్తం నలుగురు (గ్రిఫిన్, కై, సాక్సన్, డామియన్) సొంత తోబుట్టువులు ఉన్నారు. వీరు కాకుండా ఇంకా కొందరు తమ్ముళ్లు, చెల్లెల్లు ఉన్నారు.