ఆటో ఇండస్ట్రీ మొత్తం ఈ 14 కంపెనీల కిందే! మీకు నచ్చిన కారు ఎక్కడుందో చూసుకోండి

Entire Auto Industry in These Companies: కార్లు, బైకులు అంటే ఎవరి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు.. మధ్య తరగతి కుటుంబం నుంచి ధనికుల వరకు అందరికీ వాహనాలంటే ఇష్టమే. మరికొందరికైతే వెహికల్స్ అంటే ఫ్యాషన్ లేదా పిచ్చి అనే చెప్పాలి. అయితే ఎవరినైనా కార్లు గురించి లేదా కార్ బ్రాండ్స్ గురించి చెప్పమంటే.. ఇండియాలో టాటా మోటార్స్, మహీంద్రా వంటి పేర్లు. అన్యదేశ్య బ్రాండ్స్ అయితే బెంజ్, ఆడి, పోర్స్చే వంటి పేర్లు చెబుతారు.

ఎంతమంది ఎన్ని కార్ల పేర్లు చెప్పినా.. ఎన్ని బ్రాండ్స్ పేర్లు చెప్పినా.. అవన్నీ కూడా కేవలం 14 సంస్థల ఆధీనంలో ఉన్న విషయం బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న కార్లు ఏంటి? కేవలం 14 సంస్థల అధీనంలో ఉండటం ఏంటనే కొంత ఆశ్చర్యంగానే అనిపించవచ్చు. కానీ ఇది నమ్మలేని నిజం.

14 కంపెనీల కింద ఉన్న కార్ బ్రాండ్స్..

ఆటోమొబైల్ రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. కొత్త వాహనాలు పుడుతూనే ఉన్నాయి. అయితే మార్కెట్లో అమ్ముడవుతున్న దాదాపు 54 ప్రముఖ బ్రాండ్ కార్లు కేవలం 14 సంస్థల అధీనంలో ఉండటం గమనార్హం. ఇందులో అత్యధికంగా జీఎమ్ మోటార్స్ (జనరల్ మోటార్స్) ఏకంగా 9 బ్రాండ్స్ తన అధీనంలో ఉంచుకున్నట్లు సమాచారం. ఆ తరువాత ఫోక్స్​వ్యాగన్ 8 బ్రాండ్లను తన అధీనంలో ఉంచుకుంది.

పూర్తి వివరాలు

టాటా: టాటా కింద టాటా మోటార్స్, జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు మార్కెట్లో టాటా నెక్సాన్, టియాగో, హారియార్, సఫారీ, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, జాగ్వార్ ఎక్స్ఈ, ఎఫ్-టైప్ మొదలైన కార్లను విక్రయిస్తున్నాయి.

హ్యుందాయ్: హ్యుందాయ్ కింద హ్యుందాయ్ మరియు కియా కంపెనీలు ఉన్నాయి. కియా ఏంటి? హ్యుందాయ్ కింద ఉండటం ఏంటి అని చాలామందికి అనుమానం రావొచ్చు. కానీ ఇది నిజం.. కియా హ్యుందాయ్ కింద ఉన్న ఓ కంపెనీ. ఇది మార్కెట్లో కియా సెల్టోస్, కారెన్స్, కార్నివాల్ మొదలైన కార్లను విక్రయిస్తోంది. ఇక హ్యుందాయ్ కంపెనీ క్రెటా, ఐ20, టక్సన్, వెర్నా, ఐయోనిక్ 5 మొదలైన కార్లను విక్రయిస్తోంది.

బీఎండబ్ల్యూ: బీఎండబ్ల్యూ కింద రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యూ మరియు మినీ కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ అత్యంత ఖరీదైన అన్యదేశ్య బ్రాండ్స్. భారతదేశంలో కూడా ఎక్కవమంది ఈ బ్రాండ్ కార్లకు అభిమానులు ఉన్నారు. ఈ కారణంగానే ఈ సంస్థలు ఎప్పటికప్పుడు మార్కెట్లో కార్లను లాంచ్ చేస్తున్నాయి.

హోండా: భారతదేశంలో ఎక్కువమంది ఇష్టపడే బ్రాండ్లలో ఒకటి హోండా. దీని కింద అక్యూరా మరియు హోండా అనే రెండు బ్రాండ్స్ ఉన్నాయి. అక్యురా అనే పేరు చాలామందికి పెద్దగా పరిచయం లేకపోయినా.. హోండా మాత్రమే సుపరిచయమే. ఈ కంపెనీ సిటీ, ఎలివేట్ మొదలైన కార్లను విక్రయిస్తోంది.

ఫోక్స్​వ్యాగన్: చెక్ రిపబ్లిక్ బ్రాండ్ అయిన ఫోక్స్​వ్యాగన్ కింద ఏకంగా ఎనిమిది సంస్థలు ఉన్నాయి. అవి ఆడి, స్కోడా, లంబోర్ఘిని, పోర్స్చే, బెంట్లీ, బుగాటీ, సీట్ మరియు ఫోక్స్​వ్యాగన్ ఉన్నాయి. ఈ కంపెనీలో ఒక్కొక్కటి ఎన్ని కార్లను మార్కెట్లో లాంచ్ చేసి విక్రయిస్తున్నాయో దాదాపు అందరికి తెలుసు.

జనరల్ మోటార్స్: ‘జీఎం’గా పిలువబడే జనరల్ మోటార్ కింద ఏకంగా 9 కంపెనీలు ఉన్నాయి. అవి క్యాడిలాక్, వూలింగ్ మోటార్స్, బావోజున్, బ్యూయిక్, జీఎంసీ, ఒపెల్, వాక్స్ వాల్, హోల్డెన్ మరియు షెవర్లే. బహుశా ఈ కంపెనీలు ఇండియాలోని ప్రజలలో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఇది అమెరికన్ మార్కెట్లోని అగ్రగామి కార్ల తయారీ సంస్థల్లో ఒకటిగా ఉంది.

టయోటా: టయోటా కింద లెక్సస్, డాయ్ హత్సు మరియు టయోటా కంపెనీలు ఉన్నాయి. ఇందులో లెక్సస్ మరియు టయోటా కంపెనీలు విరివిగా మార్కెట్లో కార్లను లాంచ్ చేస్తూ.. విపరీతమైన అమ్మకాలను పొందుతున్నాయి. అంతే కాకుండా ఇవి వాటి ప్రత్యర్థులకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి.

ఎఫ్‌సీఏ (ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్): దీనికి కింద ఫియట్, క్రిస్లెర్ ఉన్నాయి. ఈ కంపెనీల కింద అంటే ఫియట్ కింద.. మాసెరటీ, లాంసియా, అల్పా రోమియో మరియు క్రిస్లెర్ కింద ర్యామ్, డాడ్జ్ మరియు జీప్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇందులో ఫియట్ మరియు జీప్ బ్రాండ్స్ అధిక ప్రజాదరణ పొందాయి.

రెనో: రెనో లేదా రెనాల్ట్, శాంసంగ్, డాసియా అనే మూడు బ్రాండ్స్ దీని కింద ఉన్నాయి. ఇందులో రెనో.. కైగర్, క్విడ్ మొదలైన కార్లను విక్రయిస్తూ ముందుకు సాగుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని కార్లను మార్కెట్లో విక్రయించడానికి ఈ సంస్థ సన్నద్ధమవుతోంది.

డైమ్లర్: మెర్సిడెస్ బెంజ్, స్మార్ట్ వంటి రెండు బ్రాండ్స్ ఈ డైమ్లర్ కింద ఉన్నాయి. స్మార్ట్ గురించి పెద్దగా తెలియకపోయినా.. బెంజ్ గురించి పరిచయమే అవసరం లేదు. ఎదుకంటే ఈ కంపెనీ కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇందులో ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి.

ఫోర్డ్: అమెరికాకు చెందిన దీని కింద ఫోర్డ్ మరియు ద లింకన్ మోటార్స్ కంపెనీ రెండు ఉన్నాయి. ఫోర్డ్ ప్రస్తుతం భారతదేశంలో తన కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే మళ్ళీ ఈ కంపెనీ సరికొత్త ఉత్పత్తితో మార్కెట్లో అడుగుపెట్టే సూచనలు ఉన్నట్లు సమాచారం.

నిస్సాన్: ఇన్ఫినిటీ, నిస్సాన్ మరియు డాట్సన్ అనే మూడు కంపెనీలు దీని కింద ఉన్నాయి. నిస్సాన్ కంపెనీ ప్రస్తుతం మాగ్నైట్ కారును మాత్రమే దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది. ఇక డాట్సన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం దీనికున్న ఆదరణ భ్రాతదేశంలో బాగా తగ్గిపోయింది.

గిలీ: బహుశా ఈ పేరు ఎవరికీ తెలియకపోవచ్చు. అయితే ప్రముఖ కంపెనీ వోల్వో దీని కింద ఉంది. ఇది మాత్రమే కాకుండా ది లండన్ ట్యాక్సీ కంపెనీ మరియు గిలీ అనే రెండు సంస్థలు ఉన్నాయి. వోల్వో కంపెనీ ఎప్పటికప్పుడు మార్కెట్లో లేటెస్ట్ కార్లు లాంచ్ చేస్తూ మంచి ఆదరణ పొందుతోంది.

పీఎస్ఏ: చివరగా మన జాబితాలో చెప్పుకోదగ్గ పేరు పీఎస్ఏ. దీనికి డీఎస్ ఆటోమొబైల్స్, సిట్రోయెన్ మరియు ఫూజియోట్ ఉన్నాయి. సిట్రోయెన్ కంపెనీ భారతదేశంలో ప్రస్తుతం అధిక ప్రజాదరణ పొందుతున్న సంస్థ. పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసిన ఈ కంపెనీ మరో కొత్త కారును వచ్చే నెలలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది.

గమనిక:- నిజానికి పైన చెప్పుకున్నవి ప్రధానమైన బ్రాండ్స్. ఇవి కాకుండా మరిన్ని వాహన తయారీ సంస్థలు, స్టార్టప్ కంపెనీలు లెక్కకు మించి ఉన్నాయి. కాబట్టి పాఠకులు ఈ విషయాన్ని గమనించాలి. అంతర్జాలంలో లభించిన కొన్ని ఆధారాల ద్వారా మాత్రమే ఈ కథనం రూపొందించబడింది. కాబట్టి దేశీయ మార్కెట్లో, గ్లోబల్ మార్కెట్లో మరిన్ని కంపెనీలు ఉండవచ్చు.