ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తన చందాదారుల కోసం ఎప్పటికప్పుడు సులభమైన మార్గాలను ప్రవేశపెడుతూనే ఉంది. ఇందులో భాగంగానే.. ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవడానికి కూడా వెసులుబాటు కల్పించడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించినప్పటికీ.. ఎప్పటి నుంచి అమలులోకి రానుందని విషయం తాజాగా వెల్లడైంది.
2026 జనవరి నుంచే..
ఈపీఎఫ్ఓ డబ్బును ఏటీఎం ద్వారా 2026 జనవరి నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చని సమాచారం. అయితే ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) అక్టోబర్ రెండో వారంలో జరగనున్న బోర్డ్ సమావేశంలో.. ఏటీఎం విత్‌డ్రా సౌకర్యానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అయితే ఏటీఎం నుంచి ఎంత మొత్తంలో తీసుకోవచ్చు అనే విషయానికి త్వరలోనే వెల్లడిస్తారు.
ఏటీఎం నుంచి ఈపీఎఫ్ఓ విత్‌డ్రా కల్పించడానికి కారణం
ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓ మొత్తం కార్పస్ రూ. 28 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఉంది. సభ్యుల సంఖ్య ఏకంగా 78 మిలియన్స్. 2014లో కార్పస్ మొత్తం రూ. 7.4 లక్షల కోట్లు కాగా.. సభ్యుల సంఖ్య 33 మిలియన్లుగా ఉంది. దీన్నిబట్టి చూస్తే సభ్యుల సంఖ్య, కార్పస్ మొత్తం ఎంత మొత్తంలో పెరుగుతోందో స్పష్టమవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏటీఎం నుంచి ఈపీఎఫ్ఓ విత్‌డ్రా సదుపాయం కల్పించడానికి పూనుకున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈపీఎఫ్ఓ సబ్యులకు సంబంధించిన కార్పస్‌ను యాక్సెస్ చేసే వెసులుబాటును కల్పిస్తే.. చందాదారులు సులభంగా డబ్బును విత్‌డ్రా చేసుకోగలుతారు. దీనిని అందుబాటులోకి తీసుకురావడానికి.. కార్మిక మంత్రిత్వ శాఖ బ్యాంకులతోపాటు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)తో కూడా మాట్లాడినట్లు సమాచారం. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఈపీఎఫ్ఓ సభ్యులు ఏటీఎం కార్డు వంటి ఓ ప్రత్యేకమైన కార్డును కూడా పొందే అవకాశం ఉంది. అయితే ఈ కార్డులను ఎప్పుడు, ఎలా ఇవ్వనున్నారనే విషయం తెలియాల్సి ఉంది.
ఆలస్యానికి చెక్!
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ప్రారంభంలో ఈపీఎఫ్ఓ చందాదారులకు నిధుల లభ్యతను మరింత సులభతరం చేయడానికి ఆటోమాటిక్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ మొత్తాన్ని రూ. లక్ష నుంచి రూ. ఐదు లక్షలకు పెంచింది. ఈ విధానంలో ఆటోమేటెడ్ సిస్టం క్లెయిమ్ అర్హతను ధ్రువీకరించడానికి డిజిటల్ తనిఖీలు, అల్గారిథమ్ వంటి వాటిని ఉపయోగించడం జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ ఈకేవైసి వివరాలపై ఆధారపడి ఉంటుంది. కాగా ఇప్పుడు త్వరలో అందుబాటులోకి రానున్న ఏటీఎం నుంచి విత్‌డ్రా విధానం.. పేపర్ వర్క్ లేకుండా.. డబ్బు తీసుకోవడంలో ఎలాంటి ఆలస్యం లేకుండా చేస్తుంది. ఇది చందాదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
గత కొన్ని సంవత్సరాలుగా డిజిటలైజేషన్‌లో ఈపీఎఫ్ఓ గణనీయమైన పురోగతిని సాధించినప్పటికీ.. ఏటీఎం విత్‌డ్రా విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంది. ఇందులో ఎటువంటి మోసాలకు తావులేకుండా చేయడానికి బ్యాంకులు లేదా ఇతర చెల్లింపు నెట్‌వర్క్‌లతో సమన్వయం అవసరం. ఇప్పటికే ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో చాలా మార్పులు వచ్చాయి. ఉద్యోగి వివరాలను, బ్యాంక్ అకౌంట్ వంటి వాటిని మార్చుకోవడం ఇప్పుడు చాలా సులభం అయిపోయింది.