ఇది కదా సక్సెస్ అంటే: సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసిన కంపెనీలోని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయ్యాడు!

ప్రతి ఒక్కరి జీవితంలో.. ఏదో ఒక సందర్భంలో కష్టాలు తప్పవు. అయితే నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి.. ఏదో ఒకరోజు ఓ అవకాశం లభిస్తుంది. ఆ అవకాశంతో ఎదిగితే.. ఎంతోమందికి ఆదర్శమవుతారు. అలాంటి సంఘటనే సెక్యూరిటీ గార్డ్ నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వరకు ఎదిగిన ‘అబ్దుల్ అలీమ్‘ స్టోరీ. దీనికి సంబంధించిన పోస్ట్ లింక్డ్ఇన్‌లో వైరల్ అవుతోంది.

రూ. 1000లతో ప్రయాణమై..

2013లో కేవలం 1,000 రూపాయలతో ఇంటి నుంచి బయలుదేరాను, అందులో 800 రూపాయలు ట్రైన్ టికెట్ కోసం ఖర్చు చేసాను. ఉద్యోగం కోసం రెండు నెలలు తిరిగాను.. చివరికి జోహో సంస్థలో సెక్యూరిటీ డెస్క్‌లో ఉద్యోగం దొరికింది. ఒకరోజు.. ఆ కంపెనీలో పనిచేసే.. ఓ సీనియర్ ఉద్యోగి నా పేరు అడిగి.. అలీమ్, మీ కళ్ళలో నాకు ఎదో కనిపిస్తోంది అని అన్నారు. అంతే కాకుండా ఆయన నా చదువు గురించి, కంప్యూటర్ పరిజ్ఞానం గురించి అడిగి అడిగారు. నాకు కొంచెం హెచ్‌టీఎంఎల్ గురించి తెలుసని చెప్పాను. అయితే మీరు ఇందులో.. ఇంకా ఏమైనా నేర్చుకోవాలనుకుంటున్నారా? అని అడిగారు.

రోజుకు 12 గంటలు పనిచేసి, తరువాత..

నేను నాకున్న ఆసక్తితో.. ప్రతి రోజు నా సెక్యూరిటీ డ్యూటీ (12 గంటలు) పూర్తి చేసుకుని, ఆ సీనియర్ ఉద్యోగి దగ్గరకు వెళ్లి కంప్యూటర్ గురించి నేర్చుకున్నాను. అలా ఎనిమిది నెలలు నేర్చుకున్న తరువాత.. నేను ఒక చిన్న యాప్‌ను సృష్టించాను. దానిని ఆ సీనియర్ ఉద్యోగి తన మేనేజర్‌కు చూపించారు. దానిని అందరూ ఇష్టపడ్డారు. అయితే నేను చదివింది కేవలం 10వ తరగతి వరకు మాత్రమే.

జోహోలో ఉద్యోగం కావాలంటే.. డిగ్రీ అవసరం లేదు, నీకున్న నైపుణ్యాలే ప్రధానం అని నన్ను ప్రోత్సహించారు. ఇంటర్వ్యూ కూడా పాస్ అయ్యాను. ఈ రోజు జోహో కంపెనీలో నన్ను నేను నిరూపించుకున్నాను. నేను ఇంతలా ఎదగడానికి కారణమైన శిబు అలెక్సిస్ (సీనియర్ ఉద్యోగి)కి, నన్ను నేను నిరూపించుకోవడానికి అవకాశం కల్పించినందుకు జోహో సంస్థకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను అని అబ్దుల్ అలీమ్ పేర్కొన్నారు.

నెటిజన్ల అభినందనలు

  • సోషల్ మీడియా వేదికగా అబ్దుల్ సాధించిన విజయాన్ని గొప్పగా ప్రశంసిస్తున్నారు. నువ్వు నిజంగా మంచి కంపెనీలో ఉన్నావు సోదరా.. జోహో నీకు జీవితాన్ని ఇచ్చింది, నీ అభిరుచి.. అంకితభావం అన్నీ కూడా నిన్ను గొప్ప స్థానాన్ని పొందేలా చేస్తాయని ఒకరు అన్నారు.
  • ఇది ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఇంకొకరు అన్నారు.
  • ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన విద్యార్థిగా.. మీ కథ నాకు స్ఫూర్తిని ఇవ్వడమే కాకుండా, నాలో ఆశను కూడా కలిగించిందని మరొకరు అన్నారు. ఎక్కడ ప్రారంభించాలో కాదు, ఎంత ఎదగడం ముఖ్యమని నిరూపించారు. 12 గంటలు పనిచేసిన తరువాత, ఎవరైనా నిద్రపోతారు, నువ్వు నేర్చుకున్నావు. నేడు ఎంతోమందికి ఆదర్శమయ్యావని పేర్కొన్నారు.

నిజానికి ఎదగాలనే లక్ష్యంతో ముందుకెళ్లే వ్యక్తిని ఎవ్వరూ ఆపలేరు, ఎందుకంటే అతడు.. తనకు ఎదురయ్యే కష్టాలను కూడా లెక్కచేయకుండా ముందుకు సాగిపోతూ ఉంటాడు. ఇలా అకుంఠిత దీక్ష. పట్టుదలతో ప్రయత్నించినప్పుడే.. ఏదైనా సాధ్యమవుతుందని చెప్పడానికి పైన చెప్పిన అంశమే నిలువెత్తు నిదర్శనం.