Fuel Stations Will Stop Fueling Old Cars And Bikes in Delhi: ఢిల్లీలో కాలుష్యం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అక్కడి ప్రభుత్వం కీలకమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని ప్రోత్సహించడానికి కావలసిన చర్యలు ఓ వైపు తీసుకుంటోంది. మరోవైపు పాత వాహనాలకు (కార్లు, బైకులు) ఫ్యూయల్ నింపవద్దని పెట్రోల్ బ్యాంకుల యాజమాన్యాలకు వెల్లడించింది.
దేశరాజధానిలో 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వాహనాలకు పెట్రోల్ లేదా డీజిల్ నింపకూడదని ప్రభుత్వం యోచిస్తోంది. ఇదే నిజమైతే.. పాత వాహనాలు మూలాన పడాల్సిందే. ఈ విధానాన్ని అమలు చేయడానికి పెట్రోల్ బంకు యాజమాన్యం ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి.. దాని వయసును నిర్దారించాలి. దీనికోసం ప్రత్యేకంగా ‘ఆటోమాటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్’ (ANPR) సిస్టం ఉపయోగించనున్నారు.
15 ఏళ్ల కంటే ఎక్కువ వయసైన వాహనాలు
ఎక్కువ వయసైన వాహనాలు.. ఎక్కువ కాలుష్య కారకాలను విడుదల చేస్తాయి. ఈ కారణంగానే గతంలో బీఎస్4 వాహనాలను బీఎస్6 వాహనాలను రూపొందించాలని ప్రభుత్వం.. వాహన తయారీదారులకు వెల్లడించింది. కాగా ఇప్పుడు 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసైన వాహనాలను పూర్తిగా నిర్మూలించడానికి ఢిల్లీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది.
వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి.. నగరంలో పెట్రోల్ బంకులు పాత వాహనాలను గుర్తించడానికి.. కావలసిన పరికరాలను సంబంధిత శాఖలు ఏర్పాటు చేస్తున్నాయని పర్యావరణ మంత్రి మంజిందర్ సిర్సా పేర్కొన్నారు. ఈ విధానాన్ని.. అమలు చేయడానికి కొత్త కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా? లేదా అనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఇప్పటికే చాలా పెట్రోల్ బంకులలో పొల్యూషన్ సర్టిఫికేట్ చెల్లుబాటును చెక్ చేయడానికి వెహికల్ నెంబర్ ప్లేట్స్ స్కాన్ చేసే కెమరాలు ఉన్నాయి. అయితే పాత వాహనాలను గుర్తించడానికి ఈ కెమెరాలను అప్డేట్ చేసే అవకాశం ఉందని సమాచారం.
ఢిల్లీలో పాత వాహనాల సంఖ్యను తగ్గించడానికి.. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ చురుగ్గా పాల్గొంటోంది. నగరంలో ప్రస్తుతం 500 కంటే ఎక్కువ పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఇందులో సుమారు 80 శాతం బంకులలో ఆటోమాటిక్ నెంబర్ ప్లేట్ రికాగ్నేషన్ సిస్టం ఉంది. కాబట్టి అనుకున్న విధంగానే.. ఢిల్లీలో పాత వాహనాల సంఖ్యను త్వరలోనే తగ్గిస్తారని నిపుణులు కూడా చెబుతున్నారు.
వాయు కాలుష్యంపై ఢిల్లీ పోరాటం
ఢిల్లీలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో కాలుష్యం కూడా ఎక్కువైపోతోంది. పాత వాహనాల వినియోగాన్ని తగ్గిస్తే.. కాలుష్యం తగ్గుతుందని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే.. లక్షల వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. ఇందులో ఎక్కువ భాగం ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. నిజానికి 2021 మార్చిలోనే నిర్ణీత వయసు దాటిన వాహనాలను రద్దు చేసే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Also Read: సంచలన విషయాలు బయటపెట్టిన పూజా హెగ్డే: లక్షలు ఖర్చు పెట్టి తిట్టించారు
నిర్దిష్ట వయసుదాటిన వాహనాలు రోడ్డుపై కనిపిస్తే.. భారీ జరిమానాలు కూడా విధించే వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రస్తుతం వాటిని పూర్తిగా నిషేధించడానికి ప్రభుత్వం నడుం బిగించింది. అనుకున్నవన్నీ సవ్యంగా జరిగితే.. ఢిల్లీలో పాత వాహనాలు కనుమరుగవుతాయి. కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది. మరో విషయం ఏమిటంటే.. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై కొంత ప్రత్యేక రాయితీలను కూడా కల్పించడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది.