బంగారం ధరలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే రూ. 1.20 లక్షలు దాటేసిన గోల్డ్ రేటు.. మరో వారం రోజుల్లో రూ. 1.30 లక్షలు దాటేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వెండి రేటు కూడా ఏ మాత్రం తగ్గకుండా ఏకంగా రూ. 2 లక్షలకు చేరుకుంటోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. పసిడి కొనుగోలు చేయడం చాలా కష్టమవుతుంది. డబ్బున్నవారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుందని స్పష్టంగా అర్థమవుతోంది.
ముందున్న పండుగలు
ఇప్పటికే నవరాత్రులు, విజయదశమి వంటివి ముగిశాయి. ఇక ధనత్రయోదశి, దీపావళి ముందున్నాయి. ధనత్రయోదశి సందర్బంగా చాలామంది బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటారు. ఇది ఒకప్పటి నుంచి ప్రజలలో ఒక సెంటిమెంట్ అయిపోయింది. ఈ రోజు బంగారం కొనుగోలు చేయడం వల్ల లక్ష్మి కటాక్షం లభిస్తుందని గట్టిగా విశ్వసిస్తారు. దీంతో కనీసం ఒక చిన్న బంగారు వస్తువైనా కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు.
ఇక దీపావళి విషయానికి వస్తే.. ఈ పండుగను చాలామంది గౌరీ వ్రతంగా, లక్ష్మీదేవి పూజగా భావిస్తారు. కాబట్టి ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయడం మంచిదని, శుభం జరుగుతుందని నమ్ముతారు. ఇలాంటి నమ్మకాల వల్లనే బంగారం కొనుగోలు చేయడానికి ఎగబడతారు. దీంతో పసిడికి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగిందంటే.. కచ్చితంగా ధరలు పెరుగుతాయి.
బంగారం & వెండి ధరలు
భారతదేశంలో బంగారం ధరలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఒక నెలరోజుల వ్యవధిలోనే గోల్డ్ రేటు ఊహకందని విధంగా పెరిగిపోయింది. దీనికి కారణాలు చాలానే ఉన్నప్పటికీ.. ప్రధాన కారణం మాత్రమే పసిడి కొనుగోలు చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోవడమే అని స్పష్టంగా అర్థమవుతోంది.
హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు ప్రాంతాల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 125000 కంటే ఎక్కువ ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 115000 దాటేసింది. చెన్నై, ఢిల్లీలలో కూడా ఇంచుమించు ఇదే ధరలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2024 అక్టోబర్ నెలలో రూ. 78000 వద్ద ఉన్న గోల్డ్ రేటు.. ఒక్క ఏడాదిలోనే ఇంతలా పెరిగిందంటే, బంగారంకు ఉన్న డిమాండును స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
వెండి ధరలు
బంగారం ధరలు పెరుగుదల చాలా రోజుల నుంచి వింటూనే ఉన్నాం. కానీ వెండి రేటు మాత్రం జీవితకాల గరిష్టాలను తాకింది. రోజుకి రూ. 7000 పెరుగుతూ కొనుగోలుదారుల గుండెల్లో గుబులు పుట్టించింది. అక్టోబర్ 2025 ప్రారంభం నుంచి.. ఇప్పటి వరకు ఒక కేజీ వెండి ధర రూ. 30000 కంటే ఎక్కువ పెరిగిపోయింది. దీంతో సిల్వర్ రేటు రూ. 2 లక్షల వద్దకు చేరింది. ఈ ధరలు ఇలాగే కొనసాగితే.. తప్పకుండా రేటు మరింత పెరుగుతుందని మార్కెట్ నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు.
ధరలు ఇంతలా పెరగడానికి కారణం
బంగారం, వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణం.. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు డిమాండ్ పెరిగిపోవడమే. స్టాక్ మార్కెట్లలో పెట్టే పెట్టుబడులు లాభాలనే కాదు.. ఊహకందని నష్టాలను తెచ్చిపెడతాయి. దీంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో వెండిపై పెట్టె పెట్టుబడులు సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం పెరుగుతున్న ధరల దృష్ట్యా.. బంగారం, వెండి వంటి విలువైన లోహాలపైనా పెట్టుబడి పెడితే.. భవిష్యత్తులో ధనవంతులు అవుతారని రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి చెబుతున్నారు. డబ్బు ఎక్కువగా ఉండి.. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలని అనుకునేవారికి గోల్డ్, సిల్వర్ మంచి ఎంపిక అని సూచిస్తున్నారు.