భారీగా పెరిగిన బంగారం ధరలు: ఇక కొనడం సాధ్యమేనా?

భారతదేశంలో బంగారం ధరలు కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతూ.. పసిడి ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఈ రోజు (అక్టోబర్ 8) రూ. 1,20,000 దాటేసింది. దీంతో ఒక్కసారిగా బంగారం కొనడం సాధ్యమేనా అనే ప్రశ్న చాలామందిలో పుట్టింది. ఇదిలాగే కొనసాగితే.. బంగారం రెండు లక్షల రూపాయలకు చేరుకోవడానికి మరెంతో సమయం పట్టదని అర్థమవుతోంది. ఈ కథనంలో గోల్డ్ రేట్లు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

రూ. 12వేలు దాటేసింది గోల్డ్ రేటు

బుధవారం (అక్టోబర్ 8) హైదరాబాద్, విజయవాడలలో.. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు 1150 రూపాయలు పెరిగి, రూ. 1,23,170 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1050 రూపాయలు పెరిగి.. రూ. 1,12,900 వద్ద నిలిచింది. బంగారం అంటే తెలుగు ప్రజలకు వెంటనే గుర్తచ్చే ప్రొద్దుటూరులో కూడా ఇదే ధరలు కొనసాగుతాయి. అంతే కాకుండా బెంగళూరులో కూడా బంగారం ధరలు దాదాపు ఇలాగే ఉంటాయి.

ఇక సమీపంలోని చెన్నై నగరంలో.. బంగారం ధరల విషయానికి వస్తే, ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు 1100 రూపాయలు పెరిగి.. 1,23,280 వద్దకు చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1000 పెరిగి.. 1,13,000 రూపాయలకు చేరింది. గతంలో కొన్ని రోజులు తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే ఇక్కడ (చెన్నై) పసిడి ధరలు కొనసాగాయి. ఇప్పుడు రేట్లలో చిన్న తేడా కనిపిస్తోంది.

దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా బంగారం ధరలు అమాంతం పెరిగాయి. ఇక్కడ 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1250 పెరిగి.. రూ. 1,23,320 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి విషయానికి వస్తే.. దీని ధర రూ. 1050 పెరిగి, రూ. 1,13,050 వద్ద నిలిచింది. మొత్తం మీద భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగా ఉందని స్పష్టమవుతోంది.

సెప్టెంబర్ 2025లో భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. అక్టోబర్ ప్రారంభంలో కొంత తగ్గుముఖం పట్టింది. అయితే ఈ నెల ప్రారంభమైన నేటికీ (ఎనిమిది రోజులకు) పసిడి ధర సుమారు రూ. 5900 పెరిగింది. దీన్ని బట్టి చూస్తే గోల్డ్ రేటు ఎంత వేగంగా పెరుగుతోందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పరిస్థితితులు ఇలాగే కొనసాగితే.. దీపావళికి గోల్డ్ రేటు రూ. 13,000 (10 గ్రామ్స్) దాటేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇదే జరిగితే బంగారం కొనుగోలు తగ్గుతాయా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

వెండి ధరలు ఇలా..

దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగినప్పటికీ.. వెండి మాత్రం కొంత శాంతించిందనే చెప్పాలి. ఎందుకంటే కేజీ రేటు ఇప్పుడు.. నిన్నటి (మంగళవారం కంటే) రూ. 100 మాత్రమే తక్కువ. ఈ రోజు (బుధవారం) కేజీ వెండి రేటు హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు వంటి నగరాల్లో రూ. 1,67,000 వద్ద ఉంది. అయితే ఢిల్లీలో మాత్రం కేజీ వెండి ధర రూ. 1,57,000 వద్ద ఉంది. దీన్నిబట్టి చూస్తే ఢిల్లీలో సిల్వర్ రేటు.. దేశంలోని ఇతర నగరాల్లో కంటే రూ. 10000 తక్కువని స్పష్టమవుతోంది. అయితే త్వరలోనే వెండి రూ. 2 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు కూడా నిపుణుల మాటలను నిజం చేస్తాయా? అన్నట్టు ఉన్నాయి.