బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్న తరుణంలో వెండి ధరలు కూడా దూసుకెళ్తున్నాయి. ఈ ఒక్క రోజే (సెప్టెంబర్ 27) సిల్వర్ రేటు రూ. 6000 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 159000లకు చేరింది. ఇక గోల్డ్ రేటు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమెరికా సుంకాలు విధించినప్పటి నుంచి పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేటు లక్ష రూపాయలు ఎప్పుడో దాటేసింది.
గోల్డ్ రేటు
శనివారం తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల రేటు రూ. 600 పెరిగి రూ. 115480 వద్దకు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 550 పెరిగి.. రూ. 105850 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరులో కూడా కొనసాగుతాయి.
దేశ రాజధాని నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 115630 (రూ. 600 పెరిగింది) వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 106000 (రూ. 550 పెరిగింది) వద్దకు చేరింది. చెన్నైలో కూడా బంగారం ధరలు ఏ మాత్రం తగ్గలేదు. ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 990 పెరిగి రూ. 116080 వద్దకు చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు 900 రూపాయలు పెరిగి రూ. 106400 వద్ద నిలిచింది. ప్రస్తుతం దేశంలో బంగారం ధర ఎక్కువగా ఉన్న నగరంగా చెన్నై రికార్డ్ క్రియేట్ చేస్తోంది.
వెండి ధరలు
రోజుకు రూ. 1000 నుంచి రూ. 2000 పెరిగే వెండి.. ఈ రోజు ఒక్కసారిగా అందరకి షాకిచ్చింది. ఒక కేజీ వెండి రేటు ఏకంగా రూ. 6000 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర ఇప్పుడు రూ. 159000 వద్దకు చేరింది. అంటే ప్రస్తుతం ఒక గ్రామ్ వెండి రేటు 159 రూపాయలన్నమాట. దీన్ని బట్టి చూస్తుంటే వెండి ధరలు రూ. 2 లక్షలకు చేరుకోవడానికి మరెంతో సమయం లేదని అర్థమైపోతోంది.
బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణం
భారతదేశంలో బంగారం, వెండి ధరలు పెరగడానికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో ఇప్పుడు చెప్పుకోదగ్గ ప్రధాన కారణం పండుగ సీజన్. ఓ వైపు దసరా (విజయ దశమి) నవరాత్రులు, మరోవైపు వస్తున్న దీపావళి. ఈ పండుగల సమయంలో చాలామంది బంగారం కొనుగోలు చేయడం శుభమని భావిస్తారు. ఈ కారణంగానే బంగారం కొనేవారి సంఖ్య పెరుగుతోంది. డిమాండ్ పెరుగుండటంతో.. ధరలు అమాంతం పెరుగుతున్నాయి.
ఒకప్పుడు శుభకార్యాలకు మాత్రమే బంగారం కొనేవారు. ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి కూడా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. స్టాక్ మర్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటివాటితో నష్టాలు కూడా చవిచూడాల్సి ఉంటుంది. కానీ బంగారంపై పెట్టె పెట్టుబడి తప్పకుండా లాభాలనే అందిస్తుందని చాలామంది పెట్టుబడిదారులు.. బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. ఇది కూడా గోల్డ్ రేటు పెరగడానికి మరో ప్రధాన కారణం అనే చెప్పాలి.
ఇంకో ముఖ్యమైన కారణం.. అమెరికా విధిస్తున్న ప్రతీకార సుంకాలు. అమెరికా విధిస్తున్న ప్రతీకార సుంకాల కారణంగా.. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు డీలా పడుతున్నాయి. లక్షల కోట్ల నష్టం వస్తోంది. దీంతో ప్రపంచ బ్యాంకులు సైతం పెద్ద ఎత్తున బంగారం కొంటోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం డిమాండ్ పెరిగిపోతోంది. ఈ కారణాల వల్లనే గోల్డ్ రేటు.. అంతకంతకూ పెరుగుతూనే పోతోంది.