అమెరికా హెచ్-1బీ వీసాలపై లక్ష డాలర్లు లేదా సుమారు రూ. 88 లక్షల కొత్త ఫీజును నిర్ణయించింది. దీంతో ఈ వీసా ద్వారా యూఎస్ఏలో పనిచేయాకునేవారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది అమెరికా వెళ్లేవారి సంఖ్యను తప్పకుండా తగ్గించే అవకాశం ఉంది. నిజానికి డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ కూడా ఇదే. తమ దేశంలో నిరుద్యోగాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు టైలుస్తోంది. అమెరికా వద్దనుకుంటే.. ప్రపంచంలో చాలా దేశాలు ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి.
యునైటెడ్ కింగ్‌డమ్
అమెరికాకు ప్రత్యామ్నాయ దేశంగా ‘యునైటెడ్ కింగ్‌డమ్’ను భావిస్తారు. ఈ దేశం నిపుణులకు, నైపుణ్యం కలిగిన కార్మికులకు వీసా అందిస్తుంది. దీంతో ఐదేళ్లు హ్యాపీగా ఈ దేశంలో ఉండవచ్చు, గడువును పొడిగించుకుంటే.. అంతకంటే ఎక్కువ రోజులే ఇక్కడ ఉండవచ్చు. అయితే ఈ దేశంలో ఉండేవారు స్పాన్సర్‌షిప్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఇది యూకేలో మీ ఉద్యోగ పాత్రను తెలియజేస్తుంది. కాగా నర్సులు, డాక్టర్లు లేదా సామజిక సంరక్షకులు హెల్త్ అండ్ కేర్ వర్కర్ వీసా కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో స్టూడెంట్ వీసా కలిగిన అభ్యర్థులు.. గ్రాడ్యుయేట్ రూట్ వీసా కోసం అప్లై చేసుకోవాలి. ఇది అదనంగా రెండేళ్లు ఆ దేశంలో ఉండటానికి అనుమతిస్తుంది. వర్కర్ వీసాతో ఐదేళ్లు ఇక్కడే ఉన్న తరువాత.. శాశ్వత నివాసం కోసం అప్లై చేసుకోవచ్చు.
ఆస్ట్రేలియా
విదేశీ పౌరుల కోసం ఆస్ట్రేలియా కూడా తాత్కాలిక వర్క్ వీసా.. లేదా పర్మినెంట్ వర్క్ వీసా అందిస్తుంది. అయితే కొన్ని షరతులకు లోబడి ఉంటుంది. పర్మినెంట్ వర్క్ వీసా కలిగిన అభ్యర్థులు.. ఆస్ట్రేలియాలో ఎక్కడైనా నివసించవచ్చు, పనిచేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా వివిధ రంగాల వారిని దృష్టిలో ఉంచుకుని వివిధ రకాల వీసాలను ఆస్ట్రేలియా అందిస్తుంది. పర్మినెంట్ వర్క్ వీసాను.. శాశ్వత నివాస వీసాలుగా కూడా మార్చుకోవచ్చు.
కెనడా
ఈ దేశంలో పనిచేయాలనుకునే.. భారతీయులు నిర్దిష్ట వర్క్ పర్మిట్ లేదా ఓపెన్ వర్క్ పర్మిట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ వర్క్ పర్మిట్ ఎనేది కెనడాలో ఏ సంస్థలో పనిచేయడానికైనా అనుమతిస్తుంది. అయితే కొన్ని షరతులను పాటించాల్సి ఉంటుంది. అయితే నిర్దిష్ట వీసాలో ఎక్కడ, ఎంతకాలం పనిచేస్తావు అని వెల్లడించాల్సి ఉంటుంది.
జర్మనీ
ఈ దేశంలో జాబ్ ఆఫర్ పొందిన తరువాత.. జర్మనీ వర్క్ వీసా కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీసాతో ఉద్యోగులు చాలాకాలం పాటు అక్కడే పనిచేయడానికి అనుమతి లభిస్తుంది. ఆ తరువాత పర్మినెంట్ వీసా కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ వీసా కోసం అప్లై చేయాలంటే మాత్రం.. అక్కడ జాబ్ పొందినట్లు చూపించే డాక్యుమెంట్.. ఇతర కొన్ని అర్హత ప్రమాణాలను చూపించాల్సి ఉంటుంది.
ఐర్లాండ్
విదేశీ నిపుణులు, పెయిడ్ ఇంటర్న్‌లు, ఫిషింగ్ ఫ్లీట్‌లోని సిబ్బంది మొదలైనవారికి ఐర్లాండ్ వర్క్ వీసా అందిస్తుంది. నైపుణ్యం కలిగిన కార్మికులు.. ఏదైనా వృత్తిలో అర్హత సాధించినట్లయితే క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయ్‌మెంట్ పర్మిట్ కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే లోకమ్ డాక్టర్, మిడ్‌వైఫరీ నర్స్, పెయిడ్ ఇంటర్న్‌లు, ఫిషింగ్ ఫ్లీట్‌లోని సిబ్బంది.. ఎటిపికల్ పర్మిషన్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఐర్లాండ్ దేశంలో శాశ్వత నివాసం కోడం కూడా ఉపయోగపడుతుంది.
యూకే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, కెనడా దేశాలు.. విదేశీయులకు వర్క్ వీసాలను అందించడమే కాకుండా, మంచి పని పరిస్థితులను, కావలసిన మౌలిక సదుపాయాలను, జీవన శైలిని అందిస్తాయి. అయితే ఈ దేశాల వర్క్ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు.. అధికారిక వెబ్‌సైట్‌లోని అర్హతలను పరిశీలించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నిర్దిష్ట ప్రమాణాలు లేకపోతే.. వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందనే విషయం మర్చిపోకూడదు.