Honda CB300F Flex Fuel Launched in India: భారతదేశంలో ఇప్పటి వరకు పెట్రోల్, ఎలక్ట్రిక్ బైకులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ ఎట్టకేలకు మొదటిసారి ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్ లాంచ్ అయింది. ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఈ బైక్ విడుదల చేసింది.
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లాంచ్ చేసిన ఈ ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్ పేరు ‘సీబీ300ఎఫ్’ (CB300F). ఇప్పటికే ఈ బైక్ పెట్రోల్ మోడల్ రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉంది. కాగా ఇప్పుడు ఫ్లెక్స్ ఫ్యూయెల్ రూపంలో అధికారికంగా దేశీయ విఫణిలో అడుగుపెట్టింది. ఈ లేటెస్ట్ బైక్ ధర రూ.1.70 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఇది సాధారణ సీబీ300ఎఫ్ ధరతో సమానంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బుకింగ్స్ & డెలివరీలు
కొత్త హోండా సీబీ300ఎఫ్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఆసక్తికలిగిన బైక్ లవర్స్ సంస్థ అధికారిక బిగ్‌వింగ్ షోరూమ్‌లలో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఈ బైక్ రెడ్ మరియు గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే అందుబాటులో ఉంది.
డిజైన్ మరియు ఫీచర్స్
చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా కనిపించే ఈ బైక్ డిజైన్ మరియు ఫీచర్లలో పెద్దగా మార్పు లేదని తెలుస్తోంది. ఇక్కడా కనిపించే ప్రధాన తేడాలు కలర్ ఆప్షన్స్ మరియు ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ డిస్‌ప్లే. ఈ బైకులో మొత్తం ఎల్ఈడీ లైటింగ్ సెటప్ ఉంటుంది. ఇందులోని డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ద్వారా.. స్పీడోమీటర్, ఓడోమీటర్, టాకొమీటర్, ఫ్యూయెల్ గేజ్, ట్విన్ ట్రిప్ మీటర్స్, గేర్ పొజిషన్ ఇండికేటర్ మరియు క్లాక్ వంటి విషయాలను తెలుసుకోవచ్చు. అంతే కాకుండా బైకులు 85 శాతం కంటే ఎక్కువ ఇథనాల్ ఉన్నప్పుడు ఇథనాల్ ఇండికేటర్ వెలుగుతుంది.
ఇంజిన్ వివరాలు
హోండా సీబీ300ఎఫ్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్ పెట్రోల్ మరియు ఇథనాల్ మిశ్రమంతో నడుస్తుంది. ఇది 85 శాతం వరకు ఉంటుంది. మిగిలిన 15 శాతం గ్యాసోలిన్ ఉంటుంది. ఇందులోని 293.52 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ 24.54 హార్స్ పవర్ మరియు 25.9 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ వంటి వాటిని కూడా పొందుతుంది. మొత్తం మీద ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము. ఈ బైక్ తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.
కొత్త హోండా ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్ డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ పొందుతుంది. దీని ముందు భాగంలో 276 మిమీ డిస్క్ బ్రేక్, వెనుకవైపు 220 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. అంతే కాకుండా ఈ బైకులో హోండా టార్క్ కంట్రోల్ సిస్టం కూడా ప్రామాణికంగా లభిస్తుంది. ఈ బైక్ యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే.. గోల్డెన్ అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు ఫైవ్ స్టెప్స్ అడ్జస్టబుల్ రియర్ మోనోషాక్ ఉన్నట్లు సమాచారం.
సీబీ300ఎఫ్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్ లాంచ్ సందర్భంగా, హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ మాట్లాడుతూ.. ఈ బైక్ లేటెస్ట్ టెక్నాలజీని పొందటమే కాకుండా పర్యావరణ హితంగా కూడా ఉంటుందని అన్నారు. ఇది మార్కెట్లోని ప్రీమియం మోటార్‌సైకిల విభాగంలో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని భావిస్తున్నామని అన్నారు.
Don’t Miss: వచ్చేస్తోంది మరో బజాజ్ పల్సర్ బండి: ఫుల్ డీటైల్స్ ఇవే..
భారతదేశంలో ఇంధన దిగుమతులను గణనీయంగా తగ్గించాలని కేంద్ర మంత్రులు చెబుతూనే ఉన్నారు. ఇంధన దిగుమతులు తగ్గించాలంటే.. ఫ్యూయెల్ వాహనాల తయారీ తగ్గించాలి. వీటికి ప్రత్యామ్నాయంగా కంపెనీలు CNG, ఎలక్ట్రిక్ మరియు ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలను లాంచ్ చేయాలి. దీనిని దృష్టిలో ఉంచుకునే హోండా మోటార్‌సైకిల్ కంపెనీ ఇప్పుడు ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్ లాంచ్ చేసింది. అయితే ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుందో తెలుసుకోవడానికి కొంతకాలం వేచి చూడాల్సి ఉంది.