ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జ్ఞాని, భారతదేశ మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజకీయ నాయకుడు, ఆర్థిక నిపుణుడు, న్యాయవాది, విద్యావేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, భారత ప్రజల జీవితాల స్థితిగతులను పూర్తిగా మార్చివేసిన భారత రాజ్యాంగ రూపకర్త డా.బీ.ఆర్. అంబేద్కర్. భారత అత్యున్నత పురస్కారం.. భారతరత్న గ్రహీత అయిన ఈయన.. ఈ విశ్వాన్ని వీడివెళ్లి దాదాపు 69 సంవత్సరాలు పూర్తి అవుతున్నది. ఈ సందర్బంగా వారు ఆ ముందు రోజు ఎలా గడిపారు అనేది తెలుసుకోవాలనే ఆసక్తిగా చాలా మందికి ఉండచ్చు. అలాంటిని వారికోసం ఈ ప్రత్యేక కథనం..
ఉదయం నుంచే..
ఆ రోజు పొద్దున (1956, డిసెంబర్ 5వ తేదీన) మామూలుగా నిద్ర లేచేదానికంటే కాస్త ఆలస్యంగా.. 7 గంటల ప్రాంతంలో అలా మెలుకువ తెచ్చుకున్నారు. అయితే ఎందుకో ఆయనకు శరీరం అంతా కొంచం బరువుగా ఉన్నట్టు, నొప్పిగా ఉన్నట్టు కూడా అనిపించింది. ఆ తర్వాత తన భార్య సవితా అంబేద్కర్ను పిలిచి.. ఆవిడ సాయంతో లేచిన దగ్గరనే కూర్చొని ఉండి శరీరానికి ఒక ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకున్నారు. సవితా అంబేద్కర్.. డాక్టర్ కాబట్టి అతనికి కావాల్సిన ఆరోగ్య సంబంధిత విషయాలకు మందులు అన్నీ ఇచ్చేవారు. మళ్లీ ఎనిమిది గంటలు సమయంలో.. ఒక్క కాఫీ తాగారు, అది కూడా చక్కెర లేకుండా. ఎందుకు అంటే అప్పటికే ఆయనకు షుగర్ వ్యాధి ఉంది.
సమాజం కోసం ఆలోచిస్తూ..
రాజ్యాంగం మాత్రమే కాకుండా.. సమాజాన్నీ పట్టిపీడిస్తున్న(సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక) అనేక సమస్యలు, వాటికి పరిష్కారాలు అలోచించి.. కూర్చొని రాయడం, చదవడం, సమయాన్ని మొత్తం సమాజం కోసమే ధారపోయడం వల్ల సరైన సమయానికి, సరైన తిండి తినకపోవడం, సరైన వ్యాయామం కొరవడటం వీటన్నిటి కారణంగా అంబేద్కర్ ఆరోగ్యం మెల్లమెల్లగా క్షిణించింది. కాఫీ తర్వాత కొద్దిగా టిఫిన్ తీసుకున్నారు. మాములుగా పొద్దున్నే లేచిన వెంటనే న్యూస్ పేపర్ చదవడం ఆయనకు అలవాటు, అందులో భాగంగా ఆరోజు యాదవిధిగా పేపర్ చదివాడు కానీ కళ్లు మసక మసకగా కనిపిస్తుండటం కారణంగా మరీ ఎక్కువ సేపు చదవలేకపోయారు.
ఈ దేశానికి స్వేచ్చా వాయువులు..
తరువాత అలాగే మంచపై కాసేపు పడుకొని రెస్ట్ తీసుకున్నారు. గౌతమ బుద్దునికి సంబంధించి తను చివరగా రాసిన “ది బుద్ధ అండ్ హిస్ ధమ్మా” అనే పుస్తకం ప్రూఫ్ రీడింగ్ కోసమని పది గంటల సమయంలో ఒక వీల్ ఛైర్ మీద తన సొంత గ్రంధాలయానికి వెళ్లడం జరిగింది. బుక్ మొత్తం చదివి అందులో కొన్ని మార్పులు, చేర్పులు, సవరణలు చేయవలసినవి తనకు సహాయకుడిగా ఉన్నటువంటి నానక్ చంద్ రట్టు అనే వ్యక్తికి చెప్పాడు. మధ్యాహ్నం ఒంటిగంటకు కూడా ఎక్కువగా ఏమి తీసుకోకుండా తక్కువ మొత్తంలోనే అన్నము, కూర తిన్నారు. కొన్ని మందులు వేసుకుని పడుకున్నారు.
మూడు గంటల సమయంలో ఎక్కువగా నిద్రపోయారట. అనారోగ్యం కారణంగా కూడా అంబేద్కర్ ఎప్పుడు కూడా చివరి క్షణాల్లో ఎక్కువ నిద్రావస్థలో ఉండేవారట. అప్పటికే ఆయన తన ప్రజల బాగు కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఉన్నారు. ఆ విధంగా నిద్ర, నీళ్లు, తిండి, సంతోషం తనకంటూ ఏది ప్రతేకంగా శ్రద్ధతీసుకొని సుఖపడలేదు. అంతగా తన జీవితం మొత్తాన్ని త్యాగం చేయడం వల్లే అనారోగ్యం పాలయ్యారు. ఈ దేశానికి స్వేచ్ఛ, సమానత్వ వాయువులు ఇచ్చాడు.
సొంత లైబ్రరీలో ఎక్కువ సమయం..
అంబేడ్కర్ చివరిసారిగా తన సొంత లైబ్రరీలో గడపడం అనేది అదే ఆఖరు సమయం అయింది. సరిగ్గా సాయంత్రం ఐదు గంటల ముప్పై ప్రాంతంలో తన ఆఖరి రచన అయిన ది బుద్ధ అండ్ హిస్ ధమ్మా అనే పుస్తకానికి అక్కడ కూర్చుని ముందు మాట రాసి పూర్తి చేసాడట. అవే ఆయన రాసిన చిట్టచివరి రాతలుగా చెప్పుకోవచ్చు. ఆ తరువాత పుస్తకాన్ని తన సహాయకుడికి ఇస్తూ.. అవే మాటలు ఆయనతో చెప్పాడంట ఈ రచన ఇంక నా ఆఖరిది అని. అంతే అప్పటికే అంబేద్కర్ అలసిపోయారు, ఇక చాలులే నన్ను నా మంచం దగ్గరకు తీసుకుని వెళ్ళండి అని చెప్పాడట. అప్పుడు తనని విశ్రాంతి గదికి తీసుకెళ్లారు.
చివరి మాటలు ఆమెతోనే..
రాత్రి ఏడు గంటలకు కేవలం ఏదో జావ లాంటిది తాగి మందులేసుకున్నాడట. ప్రతిసారి ఈ మందులు వేసుకోవడం బట్టి చూస్తేనే.. అర్థమవుతుంది ఆయన ఆరోగ్యం ఎంతగా దెబ్బతిన్నది, ఎంత శ్రమ పడ్డారు అనేది. ఒక ఎనిమిదన్నర తరుణంలో తిన్న తరువాత సవితాబాయి (అంబేడ్కర్ రెండో భార్య)తో కాసేపు గౌతమ బుద్ధుని బోధనలకు సంబంధించిన విషయాలు, తన రచనల గురించి అనేక అంశాలు ముచ్చటించారట. ఆయన చివరిసారిగా మాట్లాడిన మాటలు ఆమెతోనే అని తెలుస్తోంది. ఇక నాకు సమయం అయిపోయింది అనే విషయం అంబేద్కర్ ఆమెతో చెప్పేవారని కొన్ని సందర్బాల్లో సవితాబాయి చెప్పుకున్నారట.
ఈ దేశంలో అదే చీకటిరోజు!
సాధారణంగా అంబేద్కర్ పనులు చదవడం, రాయడం, చర్చించడం కారణంగా చాలా ఆలస్యంగా పడుకునేవారు. కొన్నిసార్లు నిద్రకూడపోయేవారు కాదు, అంతలా రాస్తుండేవారు. అలాగే ఆ రోజు కూడా 10:45 తరువాత సావితాబాయి గదిలో లైట్లు ఆర్పివేశారు. ఆమె కూడా పక్కనే ఉన్నారట. ఆయన నీలం రంగు షాలువ కప్పుకుని పడుకొని నిద్రపోయారట, ఆ తరువాత మళ్లీ అంబేద్కర్ తిరిగిలేవలేదు. తరువాత 1:30 నుంచి 02 గంటలకు డిసెంబర్ 06, 1956న ఢిల్లీలోని ఆయన స్వగృహంలో మహాపరినిర్వానం చెందారు. ఈ దేశంలో ఆ రోజు చీకటిరోజుగా మిగిలింది. ప్రజలకు ఎవరు తీర్చలేని లోటు. కొన్ని లక్షల సంఖ్యలో ఆయన అభిమానులు, ప్రజలు, నాయకులు అతనిని చూడటానికి తండోపతండాలుగా వచ్చారు. అంబేద్కర్ కలలు కన్న ఆశయాలు, ఆశలు చాలా మిగిలిపోయాయి. పల్లె ప్రాంతాల ప్రజలకు ఎంతో చేయాలనుకున్నారు, అది నెరవేరలేదు. భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ ఇంకా కొద్ది కాలం ఉండుంటే అనేక సంస్కరణలు వచ్చి ఉండేవంటే తప్పకుండా అంగీకరించాల్సిన విషయమే.
నేటికీ తీరని దుఃఖం
డా. భీమ్ రావ్ అంబేద్కర్ తనువు చాలించడంపై అనేక మందిలో అనుమానాలు ఉన్నాయి. ఆయన సహజంగా కనుమూయలేదని వాదనలు కూడా ఉన్నాయి. తనకి ఏవో మందులు ఇచ్చి కన్నుమూసేలా చేశారానికూడా చెబుతారు. అయితే అటువంటి సందేహాలకి తగినటువంటి ఆధారాలు లేవు. ఏదేమైనప్పటికి ఒక మహామనిషిని ఈ భారతదేశం కోల్పోయింది. నేటికీ గుండెల్లో తీరని దుఃఖాన్ని రగిలిస్తూనే ఉంది.