ఫోన్‌పేలో లోన్: రూ. 10వేలు నుంచి రూ. 5లక్షల వరకు..

అప్పులేనివాడు అధిక సంపన్నుడు అనే మాట చిన్నప్పుడు పద్యాలు చదువుకునే రోజుల నుంచి వింటూనే ఉన్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో.. చాలీచాలని జీతాలతో పనిచేయడమే ఓ సమస్యగా మారిపోయింది. ఇలాంటి సమయంలో అప్పుచేయక తప్పడం లేదు. అయితే ఈ రోజుల్లో అప్పు (లోన్) తీసుకోవడం కూడా చాలా సులభం అయిపోయింది. బ్యాంకులు మాత్రమే కాకుండా.. డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన ఫోన్‌పే కూడా వేగంగా లోన్ మంజూరు చేస్తోంది. అర్హత కలిగిన వినియోగదారులు రూ. 10వేలు నుంచి రూ. 5 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. ఈ లోన్ ఎప్పుడు, ఎలా.. తీసుకోవాలనే విషయాన్ని ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

72 గంటల్లో లోన్!

కొన్నిసార్లు బ్యాంకుల్లో లోన్ ప్రాసెస్ కొంత ఆలస్యం అవుతుంది. కానీ ఫోన్‌పేలో మాత్రం.. అత్యవసర సమయాల్లో చాలా తొందరగా లోన్ తీసుకోవచ్చు. ఈ విధానం మొత్తం కూడా చాలా పారదర్శకంగా ఉంటుంది. సరైన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేస్తే.. 72 గంటల వ్యవధిలోనే మీకు లోన్ మంజూరు అవుతుంది.

జీతం తీసుకునే ఉద్యోగులు లేదా ఉద్యోగస్తులు, చిన్న వ్యాపారులు ఫోన్‌పే నుంచి లోన్ తీసుకోవచ్చు. వైద్య, విద్య, చిన్న వ్యాపారాల పెట్టుబడి నిమిత్తం ఇందులో లోన్ పొందవచ్చు. లోన్ మంజూరు చేయడానికి ఫోన్‌పే.. ప్రముఖ్ బ్యాంక్స్ & నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటుంది. అర్హతను బట్టి.. మీరు ఆస్తులు తాకట్టుపెట్టుకోకుండా.. రూ. 10,000 నుంచి రూ. 5,00,000 వరకు లోన్ తీసుకోవచ్చు. లోన్ కోసం అప్లై చేసుకున్న తరువాత.. గంటల్లోనే ఆమోదం లభిస్తుంది.

అవసరమైన డాక్యుమెంట్స్

ఫోన్‌పేలో లోన్ తీసుకోవడానికి ముందే.. వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజులు, నిర్దిష్ట కాలం, ఈఎంఐ వంటివన్నీ చూపిస్తుంది. అయితే లోన్ తీసుకునే వ్యక్తి.. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పే స్లిప్ (జీతం పొందే వ్యక్తి), గడిచిన ఆరు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్, చిరునామా కోసం యుటిలిటీ బిల్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో వంటి డిజిటల్ కాపీలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

లోన్ కోసం ఫోన్‌పేలో అప్లై చేసుకున్న తరువాత.. డాక్యుమెంట్స్ అన్నింటినీ పరిశీలించి, సిబిల్ స్కోర్.. వ్యక్తిగత & ఆర్ధిక వివరాలను చెక్ చేస్తారు. అంతే కాకుండా లోన్ తీసుకునే వ్యక్తి ఆదాయం వంటివి కూడా పరిగణలోకి తీసుకుంటారు. అన్నీ సరిగ్గా ఉంటే.. కేవలం 72 గంటలలోపు లోన్ మంజూరు అవుతుంది. మీరు లింక్ చేసిన బ్యాంక్ ఖాతాకు నేరుగా జమ అవుతుంది.

వడ్డీ రేటు & కాలవ్యవధి

ఫోన్‌పే.. లోన్ మీద 11.30 శాతం నుంచి 35 శాతం వరకు వడ్డీ వేస్తుంది. అయితే ఈ వడ్డీ రేటు సిబిల్ స్కోర్, జీతం, తిరిగి చెల్లించే సామర్థ్యం (గతంలో మీరు లోన్ తీసుకుని ఉంటే.. అప్పుడు ఎలా చెల్లించారు అనేది పరిగణలోకి తీసుకుంటారు).

లోన్ తీసుకునే వ్యక్తి తిరిగి చెల్లించడానికి కాల వ్యవధి (డ్యూరేషన్)ని 12 నెలల నుంచి 60 నెలల వరకు సెలక్ట్ చేసుకోవచ్చు. మీకు వచ్చే సంపాదన, ఖర్చులు వంటివన్నీ లెక్కలోకి తీసుకుని.. మీరు నెలకు ఎంత చెల్లించగలరు అనే విషయం అలోచించి, కాలవ్యవధిని సెలక్ట్ చేసుకోవచ్చు.

లోన్ తీసుకోవడానికి అర్హతలు

  • ఫోన్‌పేలో లోన్ తీసుకోవాలనుకునే వ్యక్తి భారతీయ పౌరుడై ఉండాలి.
  • వయసు 21 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉండాలి.
  • నెలవారీ ఆదాయం కనీసం రూ. 15వేలు ఉండాలి.
  • సిబిల్ స్కోర్ 650 కంటే ఎక్కువ ఉండాలి. సిబిల్ స్కోర్ కొంత ఎక్కువగా ఉంటే.. వడ్డీ రేటు కొంత తగ్గుతుంది.
  • ఫోన్‌పే లింక్డ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. తిరిగి చెల్లింపుకు సంబంధించిన రికార్డు కూడా ఉండాలి.

లోన్ కోసం ఫోన్‌పేలో ఎలా అప్లై చేయాలంటే?

  • ఫోన్‌పే యాప్ ఓపెన్ చేసిన తరువాత.. లోన్స్ అనే విభాగంలోకి వెళ్లాలి.
  • అర్హతను చెక్ చేసుకోవడానికి.. మీ వ్యక్తిగత, ఆదాయ వివరాలు ఎంటర్ చేయాలి.
  • లోన్ ఎంతకావాలి, ఈఎంఐ, డ్యూరేషన్ వంటివన్నీ ఎంచుకోవాలి.
  • అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
  • అన్నీ పూర్తయిన తరువాత మీ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తరువాత ఫోన్‌పే దృవీకరిస్తే 72 గంటల్లో లోన్ మంజూరు అవుతుంది. ఇది మొత్తం డిజిటల్ ప్రక్రియ. కాబట్టి బౌతికంగా ఎలాంటి డాక్యుమెంట్స్ అందించాల్సిన అవసరం లేదు.