డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయడం ఎలా?: దీని ప్రయోజనాలివే..

భారతదేశంలో ప్రజా రహదారులపై వాహనాలు నడపాలంటే.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. అయితే డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అందరూ కూడా.. తమ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ యాక్టివేట్‌లో ఉందని నిర్దారించుకోవాలని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. దీనికి వెనుక ఉన్న కారణాలు ఏమిటి? మొబైల్ నెంబర్ యాక్టివేట్‌లో లేకుంటే.. ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

మొబైల్ నెంబర్ యాక్టివేట్‌

మీ డ్రైవింగ్ లైసెన్స్‌కు లింక్ చేసిన.. మొబైల్ నెంబర్ యాక్టివేట్‌లో ఉంటే, మీరు చలాన్లు, ఫెనాల్టీ నోటీసులు, రెన్యూవల్ రిమైండర్స్ వంటి వాటితో పాటు.. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన మెసేజస్ పొందుతారు. లింక్ కాని ఎడల.. నోటిఫికెషన్స్ కోల్పోవాల్సి వస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

యాక్టివేట్‌లో లేకుంటే..

రవాణా శాఖ నుంచి వచ్చే సమాచారం మొత్తం.. డ్రైవింగ్ లైసెన్స్‌కు లింక్ చేసిన మొబైల్ నెంబరుకు మాత్రమే వస్తుంది. అయితే మొబైల్ నెంబర్ యాక్టివేట్‌లో లేకుంటే.. నోటిఫికెషన్స్ రావు. ఇలా జరిగితే కొన్ని సమస్యలు తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు సరైన సమయంలో సందేశాలను చూడకపోతే.. డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది.

మీ మొబైల్ నెంబర్.. యాక్టివేట్‌లో లేకపోతే ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే యాక్టివేట్ చేసుకోవచ్చు. దీనికోసం రవాణా శాఖ పరివాహన్ పోర్టల్ లేదా సంబంధిత అధికారిక వెబ్‌సైట్లను అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ.. మీరు మొబైల్ నెంబరును అప్డేట్ చేసుకోవచ్చు. ఇలా అప్డేట్ చేసుకోవడం ద్వారా.. మళ్లీ మొబైల్ నెంబరును యాక్టివేట్ చేసుకోవచ్చు.

ఎలా అప్డేట్ చేసుకోవాలంటే?

  • పరివాహన్ లేదా రాష్ట్ర రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
  • ఆన్‌లైన్ సర్వీసెస్ అనే విభాగంలోని డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి.
  • ఈ పేజీ ఓపెన్ అయిన తరువాత స్టేట్ సెలక్ట్ చేసుకున్న తరువాత.. మీకు మొబైల్ నెంబర్ అప్డేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • ఇది సెలక్ట్ చేసుకున్న తరువాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి.. ఓటీపీతో ద్రువీకరించి.. అప్డేట్ చేసుకోవచ్చు.

ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు

ఇప్పటికి కూడా డ్రైవింగ్ లైసెన్స్‌కు లింక్ చేసిన.. యాక్టివేట్‌లో లేని మొబైల్ నెంబర్స్ చాలానే ఉన్నాయని రవాణా శాఖ వెల్లడించింది. డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లు.. దీనిని గుర్తించి, సకాలంలో యాక్టివేట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడే.. రవాణా శాఖ అందించే అధికారిక హెచ్చరికలు మీకు అందుతాయి. దీంతో జరిమానాలు, రెన్యువల్ వివరాలు, లైసెన్స్ సస్పెన్షన్ వంటివి నివారించుకోవడంలో సహాయపడుతుంది.

డ్రైవింగ్ లైసెన్స్ ఆవశ్యకత

నిజానికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది.. అర్హత కలిగిన వారికి, ప్రజా రహదారులపై వాహనం నడపడానికి ఇచ్చే ఒక ధ్రువీకరణ. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి.. సురక్షితమైన డ్రైవింగ్ చేయడానికి ఇది మీ అర్హతను నిర్థారిస్తుంది. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్నవారికి మాత్రమే.. భారత ప్రభుత్వం మన దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తుంది. అయితే 16 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న వారికి లర్నింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. అయితే ప్రజా రహదారులపై డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరం.