తెలంగాణాలో ఎన్నికల హడావుడి మొదలయింది. ఈ రోజు హైదరాబాద్ జిల్లాలోని జూబ్లీహిల్స్ నియోజక వర్గానికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్‌ను.. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుధీర్ రెడ్డి విడుదల చేశారు. దీంతో హైదరాబాద్ అంతటా ఎన్నికల కోడ్ అమలులోనికి వచ్చింది. అన్నీ రాజకీయ పార్టీలు మరియు రాజకీయ నాయకులకు సంబంధించిన ప్రతి ఫొటోను, బ్యానర్లను అన్నింటినీ ఎన్నికల యంత్రాంగం తొలగించే కార్యక్రమాన్ని చేపట్టిందని ఎలక్షన్ ఆఫీసర్ తెలియజేశారు.
ఎన్నికల షెడ్యూల్ వివరాలు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను 2025 నవంబర్ 11వ తేదీన నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి.. అభ్యర్థుల దగ్గర నుంచి అక్టోబర్ 13న నామినేషన్ పత్రాలను స్వీకరిచడం జరుగుతుంది. నామినేషన్స్ సమర్పించడానికి అక్టోబర్ 21వ తేదీని చివరి గడువు ఇచ్చారు. కాగా ఈనెల 23న ఉపసహరణకు అవకాశం కల్పించారు. వచ్చే నెల 11న పోలింగ్/ఓటింగ్ జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నవంబర్ 14వ తేది.. కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగుతుందని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుధీర్ రెడ్డి మీడియా ద్వారా తెలియజేశారు.
ఓటర్లు ఓటు వేయడానికి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ బుక్, పోస్టు ఆఫీస్ బుక్, బ్యాంకు బుక్ లాంటివి 12రకాల ఐడీలలో ఏదో ఒకటి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఓటర్ లిస్టులో తమ వివరాలు ఉన్నాయా లేదా అని సరిచూసుకోవాల్సి ఉంటుంది.
ఓటర్ల జాబితా
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు 139 కేంద్రాలు, 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ పేర్కొన్నారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,98,982 ఉండగా.. ఇందులో పురుషులు సంఖ్య 2,07,382 మందిగాను, మహిళలు 1,91,593 మంది ఉన్నారు. జాబితాలో 25 మంది ట్రాన్సజెండర్లు, 6106 మంది యువ ఓటర్లు, 2613 మంది వృద్ధులు, 1891 మంది వికలాంగులు, 311 మంది బధిరులు, 519 మంది అంధులు, ఇతర కేటగిరీలు 722 మంది, విదేశి ఓటర్లు 95 మంది ఉన్నారని ఎలక్షన్ కమిషన్ తెలిపింది.
మాగంటి గోపినాథ్ భార్యకు టికెట్
జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూసిన కారణంగా.. ఈ ఉప ఎన్నిక నిర్వహించడం జరుగుతోంది. ఆయన ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి ఏఐఎమ్ఐఎమ్ పైన 9వేల పైచిలుకు మెజారితో గెలిచారు. 2018లో టీఆర్ఎస్ పార్టీలో చేరి వరుసగా మరో రెండుసార్లు విజయం సాధించాడు. జూన్ 2025లో ఆయన పరమపదించారు.
బీఆర్ఎస్ తిరిగి టికెట్‌ను మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీతకు కేటాయించిది. దీంతో సానుభూతి ఓట్లు సంపాదించి తన స్థానాన్ని నిలుపుకోవాలని చూస్తోంది. మిగిలిన పార్టీలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్, బీజేపీ హై కమాండ్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రచారంలో అయితే ఇప్పటికే ఒకరిమీద ఒకరు పోటీగా ఇల్లు ఇల్లు తిరుగుతున్నారు. ప్రజలు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే నవంబర్ 14 వరకు ఆగాల్సిందే. ఎవరి గెలుపు ఎంతమేరకు ఉందో మీ అభిప్రాయాలు తెలియజేయండి.