Hyundai Creta EV Launch on 2025 January 17: హ్యుందాయ్ అంటే మొదట గుర్తొచ్చేది ‘క్రెటా’. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే ఈ కారును 10 లక్షల కంటే ఎక్కువమంది కొనుగోలు చేశారు. అయితే కంపెనీ ఈ కారును త్వరలోనే ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. సంస్థ లాంచ్ చేయనున్న కొత్త ‘హ్యుందాయ్ క్రెటా ఈవీ’ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ లేదా ఆదరణను దృష్టిలో ఉంచుకుని హ్యుందాయ్ తన పాపులర్ క్రెటా కారును ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. కంపెనీ ఈ కారును 2025 జనవరి 17 మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించే అవకాశంఉంది. మార్కెట్లో లాంచ్ అయిన తరువాత ఈ కారు మహీంద్రా లాంచ్ చేయనున్న బీఈ 6 మరియు టాటా కర్వ్ ఈవీ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
హ్యుందాయ్ క్రెటా ఈవీ (Hyundai Creta EV)
చూడటానికి హ్యుందాయ్ క్రెటా స్టాండర్డ్ మోడల్ కంటే కూడా క్రెటా ఈవీ కొంత భిన్నంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ కానున్న క్రెటా ఇప్పుడు క్లోజ్డ్ గ్రిల్ పొందనుంది. బంపర్ కూడా కొత్త డిజైన్ పొందుతుంది. కొంత భిన్నంగా కనిపించే అల్లాయ్ వీల్స్ మరియు ఈవీ బ్యాడ్జ్ వంటివన్నీ ఈ కారులో చూడవచ్చు. మొత్తం మీద ఈ హ్యుందాయ్ క్రెటా.. ఫ్యూయెల్ కారు కంటే కూడా భిన్నంగా ఉంటుందని స్పష్టమవుతోంది.
ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్, డ్రైవ్ సెలెక్టర్ కంట్రోలర్, రెండు కప్ హోల్డర్లతో రీడిజైన్ చేయబడిన సెంటర్ కన్సోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కోసం ప్రత్యేకంగా బటన్స్, 360 డిగ్రీ కెమెరా, సెంటర్ ప్యానెల్‌లో HVAC కంట్రోల్స్ వంటివన్నీ చూడవచ్చు. అంతే కాకుండా ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ట్విన్ స్క్రీన్ సెటప్ ఉంటుంది. కాబట్టి దీనిని సులభంగా యాక్సిస్ చేయవచ్చు. కొన్ని ఫిజికల్ కంట్రోల్స్ కూడా ఈ కారులో గమనించవచ్చు.
హ్యుందాయ్ క్రెటా ఈవీ బ్యాటరీ & రేంజ్
వచ్చే నెలలో మార్కెట్లో అధికారికంగా అడుగుపెట్టనున్న క్రెటా ఈవీ 45 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందనున్నట్లు సమాచారం. బ్యాటరీ కెపాసిటీ ఎంజీ జెడ్ఎస్ ఈవీ (50.3 కిలోవాట్), మారుతి ఈవీఎక్స్ (49.6 కిలోవాట్) కంటే తక్కువని తెలుస్తోంది. అయితే క్రెటా ఈవీ సింగిల్ ఛార్జితో 400 కిమీ నుంచి 500 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.
Also Read: లక్కీ భాస్కర్‌లో ‘దుల్కర్ సల్మాన్’ వాడిన విలాసవంతమైన కారు ఇదే!
హ్యుందాయ్ క్రెటా ఈవీలో సింగిల్ ఫ్రంట్ యాక్సిల్ మౌంటెడ్ మోటార్ ఉంటుంది. ఇది 138 హార్స్ పవర్ మరియు 255 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కాబట్టి ఇది ఉత్తమ పర్ఫామెన్స్ అందిస్తుందని సమాచారం. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో లాంచ్ చేసిన తరువాత ప్రతి ఏటా 24000 కంటే ఎక్కువ కార్లను ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది.
క్రెటా ఈవీ అంచనా ధర
కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త హ్యుందాయ్ క్రెటా ఈవీ ధరలు అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ దీని ధర రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య ఉంటుందని సమాచారం. అంతే కాకూండా ఈ కారు రేంజ్ కూడా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఈ వివరాలన్నీ కూడా త్వరలో వెల్లడవుతాయని భావిస్తున్నాము.
క్రెటా ఈవీ లాంచ్ ఎప్పుడంటే..
ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న కార్ల జాబితాలో హ్యుందాయ్ క్రెటా కూడా ఒకటి. ఈ కారు రోజువారీ ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల చాలామంది ఈ కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే ఇది గొప్ప అమ్మకాలను పొందగలిగింది. కాబట్టి మార్కెట్లో లాంచ్ కానున్న క్రెటా ఈవీ కూడా మంచి అమ్మకాలు పొందుతుందని, దాని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నాము. అయితే ఈ కారును హ్యుందాయ్ కంపెనీ ఎప్పుడు లాంచ్ చేస్తుందనే వివరాలు వెల్లడించాల్సి ఉంది.