భారతదేశంలో స్పెషల్ ఎడిషన్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ కంపెనీ క్రెటా కింగ్ మరియు క్రెటా కింగ్ లిమిటెడ్ ఎడిషన్ పేరుతో రెండు కార్లను లాంచ్ చేసింది. క్రెటా కారు ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కొత్త కార్లను కంపెనీ లాంచ్ చేసింది.
ధరలు ఇలా
కొత్త హ్యుందాయ్ క్రెటా కింగ్ ఎడిషన్ ధరలు రూ. 17.89 లక్షల నుంచి రూ. 19.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). కింగ్ లిమిటెడ్ ఎడిషన్ ధర రూ. 19.64 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
క్రెటా కింగ్ ఎడిషన్
దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త హ్యుందాయ్ క్రెటా కింగ్ ఎడిషన్ 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, పవర్ డ్రైవర్ సీటు కోసం మెమరీ ఫంక్షన్, ఫ్రంట్ ప్యాసింజర్ సీటు కోసం 8వే పవర్డ్ అడ్జస్ట్‌మెంట్, డ్యూయెల్ జోన్ ఏసీ, స్లయిడింగ్ ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్, కింగ్ ఎంబ్లెమ్ వంటివి పొందుతుంది. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ కారు 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది.
హ్యుందాయ్ క్రెటా కింగ్ కారు నైట్ ఎడిషన్ ట్రీట్‌మెంట్‌ను పొందుతుంది. కాబట్టి ఇది బ్లాక్ అవుట్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ వంటివి కలిగి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది పెట్రోల్ సీవీటీ, డీజిల్ ఆటోమాటిక్ అనే పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ పొందుతుంది.
క్రెటా కింగ్ లిమిటెడ్ ఎడిషన్
హ్యుందాయ్ క్రెటా కింగ్ లిమిటెడ్ ఎడిషన్.. అనేది కూడా స్పెషన్ ట్రిమ్ వేరియంట్. ఇది సీట్‌బెల్ట్ కవర్, హెడ్‌రెస్ట్ కుషన్స్, కొత్త కార్పెట్ మ్యాప్స్, కీ కవర్ వంటి వాటితో పాటు అడిషినల్ డోర్ క్లాడింగ్ వంటివి పొందుతుంది. ఈ స్పెషల్ ఎడిషన్ 1.5 లీటర్ పెట్రోల్ సీవీటీ, 1.5 లీటర్ డీజిల్ ఆటోమాటిక్ అనే ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, బ్లాక్ మ్యాట్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
భారతదేశంలో ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేస్తున్న కార్ల జాబితాలో.. హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా ఒకటి. దీనిని ఇప్పటి వరకు 12 లక్షల మంది కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఇది స్పెషన్ ఎడిషన్స్ రూపంలో లాంచ్ కావదంతో మరింత మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. అయితే ఇది ఎలాంటి అమ్మకాలు పొందుతుందనే విషయం తెలుసుకోవడానికి ఇంకొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది.
ఇండియన్ మార్కెట్లోని స్పెషల్ ఎడిషన్స్
నిజానికి భారతదేశంలో స్పెషల్ ఎడిషన్స్.. లెక్కకు మించి ఉన్నాయి. ఇందులో హ్యుందాయ్ కంపెనీ కూడా ఒకటి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, రెనాల్ట్, టయోటా కంపెనీలు కూడా దేశీయ విఫణిలో స్పెషల్ ఎడిషన్ కార్లను లాంచ్ చేశాయి. లగ్జరీ విభాగంలో కూడా స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ అయ్యాయి. కొత్తదనం కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకుని.. వాహన తయారీ సంస్థలు ఈ స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ చేస్తున్నాయన్నమాట.