కలెక్టర్ బదిలీ.. పల్లకిపై కూర్చోబెట్టి మోసిన సహచరులు

ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఎవరైనా బదిలీలు తప్పవు. ఇది ప్రతి ఒక్క ఉద్యోగి జీవితంలో సర్వసాధారణం. అయితే పదవిలో (ఉద్యోగంలో) ఉన్నన్ని రోజులు ఇతరులకు చేసే మంచి.. నీకు చాలా గౌరవాన్ని తెచ్చి పెడుతుంది. ఇటీవల ఒక ఐఏఎస్ అధికారిణి బదిలీరీత్యా వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. ఆ ప్రాంత ప్రజలు ఆమెకు ఘనమైన వీడ్కోలు పలకడంలో భాగంగా.. ప్రజలే పల్లకిలో మోశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రజలు మెచ్చిన కలెక్టర్

మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాకు కలెక్టర్‌గా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ సంస్కృతి జైన్.. ఇటీవల బదిలీపై భోపాల్‌లోని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా.. మధ్యప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అడిషినల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు పొందారు. దీంతో ఆమె సియోని జిల్లా నుంచి వెళ్లాల్సి వచ్చింది. అప్పటివరకు ఆమె చేసిన సేవకు ప్రజలు ముగ్దులై ఘనమైన వీడ్కోలు పలికారు.

సంస్కృతి జైన్ సేవలకు కృతజ్ఞతగా.. ప్రజలు, ఆమె సహచరులు.. అందంగా అలంకరించిన పల్లకిపై కూర్చోబెట్టి, ఆమె ఇద్దరు కుమార్తెలతో పాటు మోసుకుంటూ వెళ్లారు. ఈ సంఘటన ఆమె సమాజంలో ఏర్పరచుకున్న అనుబంధానికి ప్రతీక. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. పలువురు నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు కూడా చేస్తున్నారు.

సంస్కృతి జైన్ గురించి

ఐఏఎస్ ఆఫీసర్ సంస్కృతి జైన్.. మంచి పరిపాలన దక్షత కలిగిన వ్యక్తి. ఈమె 1989 ఫిబ్రవరి 14న శ్రీనగర్‌లో జన్మించారు. ఈమె బాల్యం మొత్తం దేశంలోని వివిధ ప్రాంతాల్లో గడిచింది. దీనికి కారణం.. జైన్ తల్లిదండ్రులు ఇద్దరూ భారత వైమానిక దళంలో పనిచేయడమే. తండ్రి ఫైటర్ జెట్ పైలట్ కాగా.. తల్లి ఆ దళంలోని వైద్యరంగంలో పనిచేశారు.

సంస్కృతి జైన్ గోవాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత ప్రతిష్టాత్మక ఎల్ఏఎంపీ ఫెలోషిప్‌ను అభ్యసించారు. నిజానికి ఈమె లక్ష్యం సివిల్ సర్వెంట్ కావడం కాదు. పీహెచ్‌డీ చేయాలనుకున్నారు. కానీ స్నేహితుల సూచనలమేరకు.. సరదాగా యూపీఎస్‌సీ పరీక్షకు హాజరై.. తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణురాలైంది. అయితే రెండో ప్రయత్నంలో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్)లో స్థానం సంపాదించుకున్నారు. అయితే మూడో ప్రయత్నంలో ఆల్ ఇండియా 11వ ర్యాంక్ సాధించి.. ఐఏఎస్ అధికారి అయ్యారు. 2015 బ్యాచ్ అధికారిణి అయిన ఆమెను మధ్యప్రదేశ్ కేడర్‌కు కేటాయించారు.

పెద్దలమాట తప్పదు కదా..

ఒక మంచి చెయ్.. దాని ఫలితాన్ని ఆశించవద్దు, అని కొందరు మహానుభావులు ఇప్పటికే చెప్పారు. నువ్వు చేసిన పనే నీకు సుఖాన్ని లేదా దుఃఖాన్ని ఇస్తుంది. సంస్కృతి జైన్ విషయంలో ఇదే జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. ఆమె చేసిన అంకితమైన సేవ, ఆమె మంచి తనమే.. తన బదిలీ సమయంలో పల్లకి ఎక్కేలా చేసింది. బహుశా ఇలాంటి గౌరవం అందరికీ సాధ్యమయ్యేది కాదు. మనం చేసిన పని.. ప్రజలకు ఉపయోగపడినప్పుడు.. మనమీద వారికి అమితమైన గౌరవం కలిగినప్పుడే ఇలాంటి సత్కారాలు జరుగుతాయి. ఈ విషయం ప్రతి ఒక్క అధికారి దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే.. తప్పకుండా ఇలాంటి గౌరవాలు కలుగుతాయి.