Indian Cricketer Mohammed Siraj New Car Range Rover: క్రికెటర్లు, సినీతారలు, రాజకీయ నాయకులు మరియు పారిశ్రామిక వేత్తలు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన వాహనాలను (కార్లు లేదా బైకులు) కొనుగోలు చేస్తుంటారని అందరికీ తెలుసు. గతంలో సెలబ్రిటీలు కొనుగోలు చేసిన కార్ల గురించి చాలానే తెలుసుకున్నాం. ఇటీవల ప్రముఖ క్రికెటర్ ‘మహ్మద్ సిరాజ్’ (Mohammed Siraj) ఖరీదైన ‘ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్’ (Land Rover Range Rover) కారును కొనుగోలు చేశారు. ఈ కారు రేటు ఎంత? ఇప్పటికే ఈ కారును ఉపయోగిస్తున్న ప్రముఖులు ఎవరు అనే వివరాలు తెలుసుకుందాం.
ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్
ఇండియన్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కొనుగోలు చేసిన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కారు ధర రూ. 3 కోట్లు అని తెలుస్తోంది. ఎన్నో రోజులుగా కలలు కన్న సిరాజ్ మొత్తానికి తాను ఇష్టపడ్డ కారును సొంతం చేసుకున్నారు. ఇటీవలే ఈ కారును హైదరాబాద్‌లోని కంపెనీ డీలర్షిప్ నుంచి డెలివరీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సిరాజ్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేశారు. కొత్త కారు కొనుగోలు చేసిన సందర్భంగా సిరాజ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మహ్మద్ సిరాజ్ ల్యాండ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. కానీ ఏ మోడల్ కొనుగోలు చేసారనేది ఖచ్చితంగా తెలియడం లేదు. కానీ ఫోటోలను షేర్ చేస్తూ.. మీ కలలకు పరిమితులు లేదు. ఎందుకంటే అవి మిమ్మల్ని మరింత కస్టపడి పనిచేయడానికి ఉసిగొల్పుతాయి. నిలకడతో మీరు చేసే ప్రయత్నాలు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. ల్యాండ్ రోవర్ వంటి ఖరీదైన కారును కొనుగోలు చేసేలా నా డ్రీమ్ నన్ను తయారు చేసింది. మీపైన మీకు నమ్మకం ఉంటే.. మీరు కోరుకున్నది సాధించవచ్చు అని సిరాజ్ వెల్లడించారు.
సిరాజ్ కొనుగోలు చేసిన కారు ఏది అనేది వెల్లడి కాలేదు, కానీ ఇప్పుడు భారతదేశంలో అసెంబుల్ చేయబడిన కారు ప్రారంభ ధర రూ. 2.98 కోట్లు. కాగా టాప్ ఎండ్ మోడల్ ల్యాండ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ట్రిమ్ కోసం రూ. 5.2 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఇంజిన్
ల్యాండ్ రోవర్ బేస్ మోడల్ 3 లీటర్ 6 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 394 Bhp పవర్ మరియు 560 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కలిగి ఆల్ వీల్ డ్రైవ్ ఎంపికను పొందుతుంది. సుమారు 2.5 టన్నుల బరువు కలిగిన ఈ కారు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం మరియు ఐడిల్ స్టాప్ సిస్టం వంటి వాటిని పొందుతుంది. ఇది 5.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 242 కిమీ కావడం గమనార్హం.
ఇక ల్యాండ్ రోవర్ టాప్ వేరియంట్ ఎస్వీ ఆటోబయోగ్రఫీ విషయానికి వస్తే.. ఇది 4.4 లీటర్ వీ8 ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 523 Bhp పవర్, 750 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ పొందుతుంది. ఈ మోడల్ 4.7 సెకన్లలో గంటకు 0 – 100 కిమీ వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిమీ కావడం గమనార్హం.
ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ 3 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ కూడా పొందుతుంది. ఇది 346 బ్రేక్ హార్స్ పవర్ మరియు 700 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే సమయంలో 3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌తో 503 బీహెచ్పీ మరియు 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇవి రెండూ కూడా అత్యుత్తమ పనితీరును అందిస్తాయి.
ఫీచర్స్
ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో హీటెడ్ అండ్ కూల్డ్ ఎగ్జిక్యూటివ్ రియర్ సీట్లు, 13.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం మరియు 13.1 ఇంచెస్ రియర్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్స్ కూడా ఉంటాయి. అంతే కాకుండా 3డీ సరౌండ్ సిస్టం, ప్రీమియం లెదర్ అప్‌హోల్స్టరీ, మల్టి ఫంక్షన్ స్టీరింగ్ వీల్ మొదలైనవి ఉన్నాయి.
Don’t Miss: తోబుట్టుల మనసు దోచే ‘రక్షాబంధన్’ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇది చూడండి
మహ్మద్ సిరాజ్ ఇతర కార్లు
క్రికెటర్ మహ్మద్ సిరాజ్ గ్యారేజిలో ఇతర కార్ల విషయానికి వస్తే.. ఇందులో మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, మహీంద్రా థార్, బీఎండబ్ల్యూ 5 సిరీస్ సెడాన్, టయోటా ఫార్చ్యూనర్ మొదలైన కార్లను కలిగి ఉన్నారు. కాగా ఇప్పుడు ఖరీదైన ల్యాండ్ రోవర్ కారును తన గ్యారేజిలో చేర్చారు. ఒకప్పుడు బజాజ్ ప్లాటినా బైక్ ఉపయోగించే సిరాజ్ ఇప్పుడు ల్యాండ్ రోవర్ కొనే స్థాయికి ఎదిగారు అంటే.. అది ఆయన కృషి మరియు పట్టుదల అనే చెప్పాలి.