ఎగసిపడే యువ కెరటాలు.. ఆటల్లో బంగారు పతకాలు

మనం ఏదైనా సాధించాలి అంటే ముందుగా మనసులో ఒక దృఢ సంకల్పం అవసరం. ఆ తరువాత.. అందుకు తగిన కష్టం (శ్రమ), అనుకున్నది సాధించి తీరాలనే కసి, పట్టుదల అతి ముఖ్యమైనవి. వీటితో పాటు మనకు మనమే తీసుకునే బలమైన నిర్ణయాలు, ఆలోచనలు మనల్ని ముందుకు నడిపిస్తాయి. అన్నింటికీ మించి చెప్పింది చెప్పినట్టు వినడం, అందుకు తగినట్టు ప్రణాళికబద్దంగా అమలుపరచడం, క్రమశిక్షణతో మెలగడం అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది. ఇవన్నీ కలగలిసిన చిచ్చర పిడుగుల్లాంటి విద్యార్థులే ఎస్. సనా మరియు రిషిత్ కుమార్. విద్యార్థులే అయినా.. ఎంచుకున్న ఆట పట్ల వారికున్న అంకితభావమే.. ఈరోజు ఓ నలుగురికి ఆదర్శమైంది.

సనా, రిషిత్ మాటల్లో వారి గురించి..

”నా పేరు ఎస్. సనా. మాది చిత్తూరు జిల్లా. నాకు ఊహ తెలిసినప్పటినుండి కబడ్డీ అంటే ఇష్టం. కబడ్డీ అంటే అబ్బాయిలకే పరిమితమా అనుకుంటారు. ఈ కారణంగానే.. ఇప్పటికీ చాలా చోట్ల అమ్మాయి, అబ్బాయి అనే వ్యాత్యాసం చూపిస్తుంటారు. కానీ నాకు మాత్రం మా తల్లిదండ్రులు అటువంటి తారతమ్యాలు చూపించకుండా.. నేను కోరుకున్న దారిలో వెళ్ళడానికి అన్నీ విధాలుగా ప్రోత్సహిస్తున్నారు” అని చెప్పుకున్నారు.

”నా పేరు రిషిత్ కుమార్. మాది ప్రకాశం జిల్లా, ఒంగోలు ప్రాంతం. నాన్న కూడా పిఈటీ మాస్టారుగా పని చేస్తూ ఉండటం వలన.. నేను ఆరవ తరగతి నుంచి కబడ్డీ ఆడుతున్నాను. ఓటమి గెలుపు అనేవి సహజమని రెండింటిని ఒకేలాగా తీసుకోవాలని మా నాన్న నాకు ఎప్పుడు చెబుతుంటారు, అథ్లెటిక్స్‌లో కూడా మెడల్స్ సాధించాను” అని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు వీరు ఆడిన, అందుకున్న బహుమతులు

సనా

  • రాష్ట్రస్థాయిలో.. సీబీఎస్ఈ క్లస్టర్స్ మొదటి స్థానంలో గెలిచి బంగారు పతకం సాధించింది (గద్వాల్-2025)
  • అసోసియేషన్ తరపున అండర్-17 జాతీయ స్థాయిలో రెండుసార్లు బ్రోంజ్ మెడల్ గెలిచింది (హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ -2024)
  • అండర్ -17  జాతీయ స్థాయిలో రెండుసార్లు పార్టిసిపేషన్ చేసింది
  • స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్ -17 గోల్డ్ మెడల్, అండర్-14 లో సిల్వర్ మెడల్ గెలుపొందినది (చిట్వేల్, రాయచోటి- 2023, 2024).
  • కడప, విశాఖపట్నం, గుంటూరు, ఒంగోలు లాంటి అనేక ప్రాంతాల్లో అసోసియేషన్స్ తరపున పోటీ చేసిన అన్నీ చోట్ల అనేక బహుమతులు, ప్రశంసలు కైవసం చేసుకునింది.

రిషిత్
కబడ్డీ ఆటలో

  • రాష్ట్ర స్థాయిలో సీబీఎస్ఈ క్లస్టర్స్ లో బంగారు పతకం. (కరీంనగర్)
  • జాతీయ స్థాయిలో వెండి పతకం (బీహార్).
  • రాష్ట్ర స్థాయిలో రెండు సార్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది. (కడప)

అథ్లెటిక్స్‌లో

  • రాష్ట్ర స్థాయిలో సీబీఎస్ఈ 600 మీటర్ల లాంగ్ జంప్ లో గోల్డ్ మెడల్ (నెల్లూరు)
  • జాతీయ స్థాయిలో లాంగ్ జంప్ 600 మీటర్ల పార్టిసిపేషన్ (వారణాసి)
  • జూనియర్ స్టేట్ మీట్‌లో ట్రయాతలిన్-సీ  బ్రోంజ్ మెడల్.
  • జిల్లా స్థాయిలో అనేక అసోసియేషన్స్ తరపున ఆడి బహుమతులు, ప్రశంసలు గెలుపొందారు.

కోచ్  & పాఠశాల యాజమాన్యం ప్రోత్సహం

ఆటల్లో రాణించడానికి తమ కబడ్డీ కోచ్ శంకర్ గురించి చెబుతూ.. ఎప్పుడైనా ఆటలో ఓడిపోయినా లేదా ఏదైనా నిరాశకు లోనైనా తమని వెన్ను తట్టి ప్రోత్సహిస్తారని, మేము ఆత్మవిశ్వాసంతో దృఢంగా ఉండటానికి ఆయన చెప్పే విలువైన మాటలే కారణం అని విద్యార్థులు చెప్పుకొచ్చారు. అతను కబడ్డీ కోచ్ అయినప్పటికీ కూడా మాకు అథ్లెటిక్స్‌లో ఒకింత పట్టు ఉండటంతో అందులో కూడా ఆడమని ప్రోత్సహించారని చెప్పుకొచ్చారు. ఆయన మాతో పాటు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే గ్రౌండ్‌లో ఉండటం అనేది మాకు ప్రేరణ ఇచ్చే విషయం అన్నారు.

కోచ్‌తో పాటు మేము చదువుతున్న వెరిటాస్ సైనిక్ స్కూల్ యాజమాన్యం కూడా సపోర్ట్ చేస్తోంది. పాఠశాలలో కబడ్డీ సాధన చేయడానికి మంచి మ్యాట్ అండ్ గ్రౌండ్ ఉండడము ఎంతో మేలు చేస్తోందని, బయట ప్రాంతాలకు వెళ్లి ఆడటానికి పర్మిషన్ ఇవ్వడం, వీటి కారణంగా చదువులో ఎక్కడ వెనకపడకుండా జాగ్రత్తలు తీసుకోవడం.. ఆటల్లో ముందుకు సాగటానికి వెసలుబాటు కల్పిస్తోందని విద్యార్థులు చెప్పారు.

ప్రతిభ ఏ ఒకరి సొంతం కాదు. ఇష్టమైన రంగంలో ముందుకు పోతే.. తప్పకుండా సక్సెస్ సాధ్యమవుతుంది. యుక్త వయసములోనే అసాధారణ ప్రతిభ కనపరుస్తున్న సనా మరియు రిషిత్ లాంటి క్రీడాకారులను ప్రోత్సహించడం మన బాధ్యత. భవిష్యత్ లక్ష్య సాధనే ధ్యేయంగా ముందుకు సాగాలని.. మరిన్ని గొప్ప అవార్డులను సైతం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇద్దరికీ ఆల్ ది బెస్ట్.