Interesting Facts About Manmohan Singh: భారతదేశ మాజీ ప్రధాని, కాంగ్రెస్ కురువృద్ధుడు ‘మన్మోహన్ సింగ్’ (Manmohan Singh) నేడు (డిసెంబర్ 26) 92 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యల కారణంగానే కన్ను మూసినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మన్మోహన్ సింగ్ మృతికి భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో సహా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. దేశ ప్రధానమంత్రిగా దశాబ్దం పాటు కొనసాగిన ఈయన అనేక సంస్కరణలు చేశారు. భారతదేశాన్ని ఓ కొత్త శకం వైపు నడిపిన ఘనత మన్మోహన్ సింగ్ సొంతమే అనటంలో ఎలాంటి సందేహం లేదు.
భారతదేశానికి 14వ ప్రధానమంత్రిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్.. ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ఖ్యాతిగడించారు.2004 మే 22న ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఈయన 2014 మే 26వరకు రెండుసార్లు.. పదేళ్ళపాటు ప్రధాని పీఠాన్ని అలంకరించారు.
చిన్నప్పుడే తల్లి మరణం
గురుముఖ్ సింగ్ మరియు అమృత్ కౌర్ దంపతులకు 1932 సెప్టెంబర్ 26న బ్రిటీష్ ఇండియాలోని పంజాబ్‌లోని గాహ్ (పాకిస్తాన్‌లో ఉంది)లో జన్మించిన మన్మోహన్ సింగ్.. చిన్న తనంలోనే తల్లిని కోల్పోయారు (తల్లి మరణించింది). ఆ తరువాత నానమ్మ సంరక్షణలోనే పెరిగిన ఈయన.. మొదట ఉర్దూ మీడియంలో చదువుకున్నారు.
భారతదేశ విభజన తరువాత.. మన్మోహన్ సింగ్ కుటుంబం దేశంలోని హల్ద్వానీకి వలస వచ్చింది. ఆ తరువాత 1948లో అమృత్‌సర్‌కు చేరుకున్నారు. అక్కడే ఉన్న హిందూ కళాశాలలో చదువుకున్నారు. పంజాబ్ యూనివర్సిటిలో బీఏ ఎకనామిక్స్, ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశారు. అప్పట్లోనే ఆర్థిక శాస్త్రంపై మంచి పట్టును సాధించారు. సింగ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటిలో చదువు పూర్తి చేసిన తరువాత.. మనదేశానికి వచ్చి.. పంజాబ్ యూనివర్సిటిలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ తరువాత మళ్ళీ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటిలో కూడా చదువుకున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ (RBI Governor)
పంజాబ్ యూనివర్సిటిలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేసిన మన్మోహన్ సింగ్.. లలిత్ నారాయణ్ మిశ్రా చేత విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖకు సలహాదారుడిగా నియమించబడ్డారు. ఆ తరువాత 1982లో అప్పటి ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ (Pranab Mukherjee) ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.
1982 నుంచి 1985 వరకు RBI గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్.. 1985 నుంచి 1987 వరకు ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత కొంత కాలం ఆర్ధిక వ్యవహారాలపై భారత ప్రధానమంత్రికి సలహాదారుగా కూడా పనిచేశారు.
రాజకీయ రంగప్రవేశం & ఆర్ధిక మంత్రి
మన్మోహన్ సింగ్ 1991లో మొదటిసారి అస్సాం రాష్ట్ర శాసనసభ ద్వారా పార్లమెంట్ ఎగువ సభ, రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత 1995, 2001, 2007 మరియు 2013లో కూడా పలుమార్లు ఎన్నికయ్యారు. 1998 నుంచి 2004 వరకు భారతీయ జనతా పార్టీ (BJP) అధికారంలో ఉన్నప్పుడు.. మన్మోహన్ సింగ్ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. నిజానికి జూన్ 1991లో అప్పటి భారత ప్రధాని ‘పీవీ నరసింహా రావు’ (PV Narasimha Rao).. మన్మోహన్ సింగ్‌ను తన ఆర్ధిక మంత్రిగా ఎన్నుకున్నారు.
ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ (PM Manmohan Singh)
2004 సార్వత్రిక ఎన్నికల తరువాత లోక్‌సభలో అధిక స్తనాలు పొందిన పార్టీగా అవతరించిన భారత జాతీయ కాంగ్రెస్ (ప్రస్తుత ఇండియా కూటమి) ఛైర్‌పర్సన్ ‘సోనియా గాంధీ’ (Sonia Gandhi) మన్మోహన్ సింగ్‌ను ప్రధానమంత్రి పదవికి యూపీఏ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఈయన 2004 మే 22న దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ గెలవని మన్మోహన్ సింగ్ అధిక ప్రజాదరణ పొందారు. దీనికి ప్రధాన కారణం సింగ్ ఒక స్వచ్ఛమైన రాజకీయ వేత్త కావడమే.
Also Read: రతన్ టాటా అరుదైన వీడియో: ఫిదా అయిపోతున్న జనం
కుటుంబం (Manmohan Singh Family)
స్వచ్ఛమైన రాజకీయ వేత్తగా.. మచ్చలేని మనిషిగా ఎదిగిన మన్మోహన్ సింగ్ 1958లో గురుశరన్ కౌర్ (Gursharn Kaur)ను వివాహం చేసుకున్నారు. వీరికి ఊపిందర్ సింగ్, దమన్ సింగ్ఎం అమృత్ సింగ్ అనే ముగ్గురు కుమారైలు ఉన్నారు. వీరందరూ ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు.