కేవలం రూ. 54999లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రోజువారీ వినియోగానికి కరెక్ట్ ఆప్షన్!

iVoomi S1 Lite Electric Scooter Details: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీల వరకు ఎలక్ట్రిక్ విభాగంలో వాహనాలను లాంచ్ చేస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ‘ఐవూమి’ (iVOOMi).. దేశీయ విఫణిలో అతి తక్కువ ధరలోనే ఓ సరికొత్త ‘ఎస్1 లైట్’ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. నిజానికి ఈ స్కూటర్ ధర యాపిల్ ఐఫోన్ 14 ప్రో కంటే కూడా చాలా తక్కువే అని తెలుస్తోంది. ఈ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ధర & బుకింగ్స్

ఐవూమి కంపెనీ లాంచ్ చేసిన కొత్త ఎస్1 లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ఒకటి గ్రాఫెన్ అయాన్ బ్యాటరీ, మరొకటి లిథియం అయాన్ బ్యాటరీ. వీటి ధరలు వరుసగా రూ. 54999 మరియు రూ. 64999 మాత్రమే. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కస్టమర్లు దేశంలోని కంపెనీ యొక్క అధికారిక డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

డిజైన్ మరియు కలర్ ఆప్షన్స్

సింపుల్ డిజైన్ కలిగిన ఈ స్కూటర్ చూడగానే ఆకరించబడుతుంది. ఇందులో పెద్ద హెడ్‌ల్యాంప్, సింగిల్ పీస్ సీటు, బ్యాక్ రెస్ట్ మొదలైనవి గమనించవచ్చు. కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే.. ఇది పెర్ల్ వైట్, మూన్ గ్రే, స్కార్లెట్ రెడ్, మిడ్‌నైట్ బ్లూ, ట్రూ రెడ్ మరియు పీకాక్ బ్లూ అనే ఆరు రంగులలో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇందులో కస్టమర్లు తమకు నచ్చిన కలర్ ఎంచుకోవచ్చు.

రేంజ్ (పరిధి) & ఛార్జింగ్ టైమ్

చూడటానికి సింపుల్ డిజైన్ కలిగిన ఐవూమి ఎస్1 లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక సింగిల్ చార్జితో 75+ కిమీ (గ్రాఫెన్ అయాన్ బ్యాటరీ కలిగిన స్కూటర్), 85+ కిమీ (లిథియం అయాన్ బ్యాటరీ కలిగిన స్కూటర్) రేంజ్ అందిస్తుంది. గ్రాఫెన్ వేరియంట్ టాప్ స్పీడ్ గంటకు 45 కిమీ. ఇది 3 గంటల సమయంలో 50 శాతం ఛార్జ్ చేసుకోగలదు, అంతే ఫుల్ ఛార్జ్ కావడానికి 6 గంటల సమయం పడుతుంది.

లిథియం అయాన్ వేరియంట్ విషయానికి వస్తే.. దీని టాప్ స్పీడ్ గంటకు 55 కిమీ. ఇది 1.5 గంటల సమయంలో 50 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. ఈ లెక్కన ఇది ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 3 గంటలు మాత్రమే. రెండు వేరియంట్లలోని బ్యాటరీలు వాటర్ రెసిస్టెన్స్ ఐపీ67 అని తెలుస్తోంది. కాబట్టి నీరు మరియు దుమ్ము నుంచి రక్షణ లభిస్తుంది. రోజు వారీ వినియోగానికి ఈ స్కూటర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఫీచర్స్

మంచి డిజైన్ కలిగిన ఐవూమి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ డిస్‌ప్లే, మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్బీ పోర్ట్ వంటి వాటిని పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బూట్ స్పేస్ 18 లీటర్లు. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వివిధ భూభాగాల్లో రైడింగ్ చేయడానికి అనుకూలంగా ఉండేలా రూపొందించింది. ఈ స్కూటర్ గ్రౌండ్ క్లియరెన్స్ 170 మిమీ వరకు ఉంది.

ప్రస్తుతం భారతదేశంలో ఎన్నెన్నో ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్లను కొనుగోలు చేయడానికి కనీసం ఒక లక్ష రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఐవూమి లాంచ్ చేసిన ఈ స్కూటర్ ప్రారంభ ధర కేవలం రూ. 54999 మాత్రమే. రోజువారీ వినియోగానికి, తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఎదురు చూస్తున్న వారికి ఐవూమి ఎస్1 లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓ మంచి ఆప్షన్ అని తెలుస్తోంది.

Don’t Miss: ప్రభాస్ కల్కి విడుదలకు ముందే.. కల్కి సైకిల్ వచ్చేసింది: ధర ఎంతో తెలుసా?

ఇంకా ఎక్కువ రేంజ్ ఎక్కువ కావాలనుకునే వారు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా చూడవచ్చు. ప్రస్తుతం ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ వంటివి ఉన్నాయి. కాబట్టి కొనుగోలుదారులు అవసరాలను బట్టి నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు.