ఆటోమొబైల్ రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను లాంచ్ చేస్తూ.. ఈ రంగంలో ప్రగతిపథంలో నడిపిస్తూ ఉన్నాయి. కంపెనీలు తయారు చేసిన లేదా రూపొందించిన వాహనాలను ప్రదర్శించడానికి అప్పుడప్పుడు కొన్ని ఆటోషోలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ప్రారంభంలో మనదేశంలో ఆటో ఎక్స్పో, భారత్ మొబిలిటీ ఆటో షో వంటివి నిర్వహించడం జరిగాయి. ఇప్పుడు జపాన్ మొబిలిటీ షో 2025 అట్టహాసంగా ప్రారంభమైంది.
జపాన్ మొబిలిటీ షో 2025
2025 అక్టోబర్ 30 నుంచి నవంబర్ 09వరకు టోక్యోలో జరిగి జపాన్ మొబిలిటీ షో 2025 కార్యక్రమంలో.. ప్రపంచ నలుమూలల నుంచి అనేక దిగ్గజ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. ఈ కార్యక్రమంలో సుమారు 500 కంపెనీలు పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. సంస్థల జాబితాలో.. టయోటా, హోండా, మిత్సుబిషి, నిస్సాన్, లెక్సస్, హ్యుందాయ్, మినీ, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ మొదలైనవి ఉన్నాయి.
హోండా అవుట్లియర్ కాన్సెప్ట్
జపాన్ మొబిలిటీ 2025 కార్యక్రమంలో హోండా మోటార్‌సైకిల్స్ కంపెనీ.. సరికొత్త బైక్ హోండా అవుట్లియర్ కాన్సెప్ట్ ఆవిష్కరించింది. ఇది ఇప్పుడున్న హోండా బైకుల కంటే కూడా చాలా భిన్నంగా ఉండటం చూడవచ్చు. జపాన్ కంపెనీ అయిన హోండా మోటార్‌సైకిల్స్.. ఇప్పుడు లాంచ్ చేసిన బైకును.. భవిష్యత్తులో మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేయనుంది. అయితే రాబోయే కంపెనీ బైకులు ఎలా ఉండబోతున్నాయని చెప్పడానికి దీనిని ఈ వేదికగా (జపాన్ మొబిలిటీ షో 2025) ప్రదర్శించింది. ఇది ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అని తెలుస్తోంది.
హోండా అవుట్లియర్ కాన్సెప్ట్.. 2024 ఈఐసీఎమ్ఏ కార్యక్రమంలో.. ఆవిషకరించబడిన ఈవీ ఫన్ కాన్సెప్ట్ మరియు ఈవీ అర్బన్ కాన్సెప్ట్ వంటి మోడల్స్ ఆధారంగా నిర్మించబడింది. ఈ బైక్ యొక్క డిజైన్.. తప్పకుండా వాహన ప్రేమికులను ఆకట్టుకుంటుంది. ముందుకు సాగిన ఫ్రంట్ వీల్.. కంఫర్టబుల్ సీటు వంటివి మాత్రమే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇందులో ఎలాంటి ఫీచర్స్ ఉండనున్నాయి, బ్యాటరీ కెపాసిటీ, రేంజ్ వంటి చాలా వివరాలు ప్రస్తుతానికి వెల్లడికాలేదు. కంపెనీ ఈ వివరాలను భవిష్యత్తులో తప్పకుండా వెల్లడిస్తుంది.
2030 నాటికి లాంచ్!
ఫ్యూచరిస్టిక్ అవుట్లియర్ కాన్సెప్ట్ బైక్.. ముందు, వెనుక రెండు ఎలక్ట్రిక్ బ్యాటరీలను కలిగి ఉంటుంది. కాబట్టి కారులో మాదిరిగానే.. ఈ బైక్ ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ పొందుతుంది. ఇలాంటి ఫీచర్ బైకులో.. అందుబాటులోకి రావడం బహుశా ఇదే మొదటిసారి కావడం గమనార్హం.హోండా గోల్డ్‌వింగ్ బైకులోని.. డబుల్ విష్బోన్ స్వింగ్ ఆర్మ్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. డిస్క్ బ్రేకులు ముందు, వెనుక ఉంటాయి. సస్పెన్షన్ విషయానికి వస్తే.. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక మోనోషాక్ ఉంటాయి. ఈ బైక్ 2030 నాటికి మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అంతకంటే ముందే లాంచ్ చేయడానికి ప్రయత్నిస్తామని కంపెనీ వెల్లడించింది.
ఇతర కంపెనీల ప్రదర్శన
హోండా మోటార్‌సైకిల్ కంపెనీ.. మాత్రమే కాకుండా జపాన్ మొబిలిటీ షో 2025 కార్యక్రమంలో హోండా కార్లు, టయోటా ఉత్పత్తులు, లెక్సస్, మారుతి సుజుకి కార్లు కూడా ప్రదర్శించబడ్డాయి. దీన్నిబట్టి చూస్తే రానున్న కాలంలో చాలా కొత్త వాహనాలు మార్కెట్లో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయని అర్థమవుతోంది.