తమిళ సినిమాకు జూ.ఎన్టీఆర్ ప్రమోషన్!: దీని వెనుక ఇంత కథ ఉందా?

తెలుగు కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సహజంగా తనకు నచ్చిన వ్యక్తులకు లేదా తనను నమ్మిన మనుషులకు అన్ని వేళల్లో అండగా నిలబడటం.. వారి విషయాల పట్ల సానుకూలంగా స్పందించడం అనేది సర్వసాధారణమైన అంశం. ఇలాంటి ఉదారభావం కలిగి ఉన్నందుకు ఎల్లలు దాటిన అభిమానులను.. జూనియర్ ఎన్టీఆర్ తన సొంతం చేసుకోగలిగారు. ఆ కారణంగా ఆయన్ని సపోర్ట్ చేసేవాళ్ళు.. ఆయన సపోర్ట్ చేసే వాళ్ళు అన్ని సినిమా ఇండస్ట్రీలలో కూడా పెరిగిపోయారు అనే చెప్పొచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే తమిళ యాక్టర్ శిలంబరసన్ టి.ఆర్ (శింబు) నటిస్తున్న “అరసన్ ” సినిమా ప్రోమో వీడియోని ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.

వెట్రిమారన్ & శింబు మూవీ..

సినిమా ప్రమోషన్ కోసం ఈ వీడియోని విడుదల చేశారు. దాదాపు ఐదు నిముషాల కంటే ఎక్కువే నిడివి కలిగిన వీడియోను చాలామందే చూశారు. ఈ చిత్రానికి ఎన్టీఆర్ అభిమాన దర్శకుడు వెట్రిమారన్ డైరెక్ట్ చేయడం ఇంకో విశేషం అని చెప్పాలి. అందులోనూ వెట్రి సొంత బ్యానర్ అయిన వీ క్రియేషన్స్ పతాకంపైనే ఈ మూవీని నిర్మిస్తున్నారు. సినిమాల పట్ల మంచి అభిరుచి కలిగిన.. పాపులర్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శింబు, వెట్రిలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక అభిమాన ఘనం ఉండటం ఒకెత్తైతే.. దానికి తోడు స్వయానా తెలుగువాడైనా ఎన్టీఆర్ ఈ వీడియోను ప్రమోట్ చేయడంతో మూవీకి మరింత హైప్ వచ్చిందని చెప్పొచ్చు.

జూ. ఎన్టీఆర్ ఏమన్నారంటే?

ఎన్టీఆర్ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టి ఏమని విష్ చేసారంటే.. “అత్యంత ప్రతిభను కలిగిన వ్యక్తి వెట్రిమారన్ సర్, నా తమ్ముడు శిలంబరసన్, ఇంకా రాక్ స్టార్ అనిరుద్ & చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు” అని అన్నారు. అంతే కాకుండా “శింబు లో ఇంకా ఉత్తమమైన నటన దాగి ఉందని, ఆ విషయం నాకు తెలుసని మరియు దాన్ని ఒక పెద్ద తెరపైన చూపించడానికి వెట్రిమారన్ సర్ కంటే మెరుగైన వాళ్ళు ఇంకెవరు లేరని” ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

వెట్రిమారన్ కూడా ఈ వీడియోలో శింబుతో ఎన్టీఆర్ పేరు వచ్చే డైలాగ్ చెప్పించాడు. నా కథను సినిమాగా తీస్తే దానికి హీరో ఎన్టీఆర్ అయితే సరిపోతాడు అనే అర్థం వచ్చేలాగా శింబు వీడియో స్టార్టింగ్ చెబుతారు. దీంతో వెట్రి, ఎన్టీఆర్ కలిసి సినిమా చేయబోతున్నారేమో అనే ఊహాగనాలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. విషెస్ చెప్పడం కూడా అందులో భాగమేనేమో అనుకుంటున్నారు.

అప్పటి నుంచే క్యూరియాసిటీ!

ఎన్టీఆర్ ఒకానొక సినిమా కార్యక్రమంలో తమిళనాడులో ఒక యాంకర్ “మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు, మీకు ఎవరితో సినిమా చేయాలని ఉంది” అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. “నాకు చాలా ఇష్టమైన దర్శకుడు వెట్రిమారన్” అని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఆయనతో నాకు సినిమా చేయాలనుందని, అది కూడా డైరెక్ట్ తమిళ్ సినిమా చేయాలని, డబ్బింగ్ సినిమా కాదు అని కూడా ఆయన అనడం జరిగింది. దీంతో అప్పటి నుంచి కూడా వెట్రి, తారక్ అభిమానుల్లో వీరి ఇద్దరి మధ్య సినిమా ఎప్పుడు వస్తుందా అనే క్యూరియాసిటీ పెరిగిపోయింది.