తన బయోపిక్ ఎలా ఉండాలో చెప్పిన గుమ్మడి నర్సయ్య

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఉన్న ఇల్లందు నియోజకవర్గ కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ ఎంఎల్)కు చెందిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య నిజజీవితం ఆధారంగా తెరకేక్కిస్తున్న సినిమా పేరు గుమ్మడి నర్సయ్య. టైటిల్ రోల్‌లో కన్నడ పాపులర్ నటుడు డా. శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. ఈ సినిమాకు పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వం వహిస్తుండగా, ఎన్. సురేష్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంగీతం సురేష్ బొబ్బిలి అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన సినిమా ప్రారంభోత్సవ సభను తెలంగాణలోని బధ్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి నర్సయ్య తన గురించి తీస్తున్న ఈ సినిమా ఎలా ఉండాలి అని ఆయన అభిప్రాయాలని తెలియజేశారు.

గుమ్మడి నర్సయ్య కథ..

ఈ చిత్రానికి సంబంధించినంతవరకు కథ అనేది ఒక నీతి, నిజాయితీ కలిగి, జీవితాంతం ఒకే విధానంతో, ఒకే సిద్ధాంతంతో, ఒకే లక్ష్యంతో ప్రజల కోసం పనిచేసిన, ఇప్పటికీ ఇంకా చెక్కుచెదరని విలువలతో సాధాసీదాగా జనంలోనే ఉంటూ ఎటువంటి స్వార్థం లేకుండా జనంకోసమే పోరాడుతున్న తెలంగాణ రాష్టంలోని ఖమ్మం జిల్లా, ఇల్లందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పూర్తి జీవిత కథనే వెండితెరపై పరమేశ్వర్ చూపించనున్నారు.

నిజజీవితమే గుమ్మడి నర్సయ్య బయోపిక్

గుమ్మడి నర్సయ్య ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983,1985,1989 వరుసగా మూడుసార్లు.. 1999, 2004 లో రెండుసార్లు గెలుపొందారు. పార్టీ సిద్ధాంతాలకు, సామాజిక, రాజకీయ విలువలుకు కట్టుబడి పనిచేసిన నిగర్వి. ఎమ్మెల్యేగా పని చేసినందుకు ఆయనకు వచ్చిన జీతాన్ని, పెన్షన్‌ను తనకోసం.. ఉపయోగించుకోకుండా దానిని కూడా పార్టీకి, ప్రజలకు ఇచ్చేసే నిజాయితీకి నీలువెత్తు నిదర్శనం అయిన వ్యక్తి గుమ్మడి నర్సయ్య.

ఎక్కడికైనా, ఏ సమస్య ని పరిష్కారం చేయడానికి అయిన ఇప్పటికీ సైకిల్ పైనే వెళ్తాడు. తనకంటూ కొంత భూమిని, సొంత ఇంటిని కూడా కొనుక్కోకుండా.. ఉన్న చిన్న ఇల్లుని కూడా ప్రజల సమస్యలు వినడానికి పార్టీ కార్యాలయంగా మార్చివేసి అందులోనే అతనుకూడా ఉండే త్యాగశీలి. ఇటువంటి మహనీయుని యొక్క జీవితంలోని చిన్నప్పటి నుంచి నేటి వరకు ఎలా బతికారు, ఏ విలువల కోసం బతికారు, ఎవరికోసం జీవించారు, ఏమేమి చేశారు, ఆయన నమ్మిన సిద్ధాంతాలతో ఏ పరిణామాల్ని ఆయన చూశారు, అని తన మొత్తం జీవితాన్ని కథగా తీస్తున్నారు. అదే “గుమ్మడి నర్సయ్య” బయోపిక్.

కొత్తగూడెంలో సినిమా ప్రారంభోత్సవం

సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణంలో నిర్వహించారు. ఈ సభలో గుమ్మడి నర్సయ్య సినిమా ఎలా ఉండాలి? అనేదానికి సంబంధించిన కొన్ని మాటలు పంచుకున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్లంతా నాగురించే మాట్లాడారు. కానీ నేను మాత్రం ఈ సినిమా ఎలా ఉండాలి? అనేది చెబుతాను అన్నారు. చిత్రం చాలా సహజంగా ఉండాలనేది నా కోరిక. నేను ఏ పద్ధతుల్లో ఉండేవాన్ని, నా పద్ధతేంటి, నా విధానమేంటి, నా స్వభావం ఏంటి అనేది ఇందులో చూపించాలని గుమ్మడి నర్సయ్య కోరారు.

ఈ సమాజంలో మార్పు కావాలి, మనందరిలో మార్పు జరగాలి. ఒకరిని ఒకరు మోసం చేసుకునే పద్ధతిగాని, ఒకరిని ఒకరు దోచుకునే విధానంగాని, చిన్నోడు, పెద్దోడు అనే బేధాలు గానీ లేని వ్యవస్థ ఉండాలనేది నా స్వభావం. అందరూ నన్ను గొప్పనాయకుడు అంటున్నారు. కానీ నేను సామాన్య ప్రజల్లో ఉండి వారికోసం కొట్లాడే సామాన్యున్ని. అదే విధంగా సినిమా ఉండాలని గుమ్మడి నర్సయ్య ఈ సందర్భంగా ఆకాక్షించారు.

కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు

ఈ చిత్రం సమాజంలో ఉన్న అందరి మార్పుకి నాంది పలుకుతుందని పలువురు చెబుతున్నారు. ఇందులో తమిళ నటుడు సముద్రఖని ఇందులో ముఖ్య పాత్రపోస్తిస్తున్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర ప్రధాన కన్నడ నటుడు డా. శివరాజ్ కుమార్, గుమ్మడి నర్సయ్య, ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు (సీపీఐ), సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కవిత, డైరెక్టర్ పరమేశ్వర్, నిర్మాత ఎన్. సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తునరావడంతో పాల్వంచలో సందడి నెలకొంది.