ఒక్కసారి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు – షాకిస్తున్న కొత్త రేట్లు

Karnataka Govt Hike Petrol And Diesel Prices: భారతదేశంలో బంగారం ధరలు మాత్రమే కాకుండా పెట్రోల్ ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పెట్రోల్ ధరలు సెంచరీ దాటేశాయి. మళ్ళీ ఇప్పుడు లీటరు పెట్రోల్ మీద ఏకంగా రూ. 3 పెరిగింది. ఇంతకీ ఈ ధర దేశం మొత్తం మీద అమలులోకి వచ్చిందా? లేక ఒక్క రాష్ట్రానికే (ఏ రాష్ట్రానికి) పరిమితమైందా? అనే వివరాలు క్షుణ్ణంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

అధికారిక ప్రకటన

నివేదికల ప్రకారం.. కర్ణాటక ప్రభుత్వం ఒకేసారి లీటరు పెట్రోల్ మరియు డీజిల్ ధరను ఒక్కసారిగా రూ. 3 పెంచింది. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. పెట్రోల్ అమ్మకపు పన్నును 3.92 శాతం పెంచింది. దీంతో 25.92 శాతంగా ఉన్న పన్ను నుంచి 29.84 శాతానికి చేరింది. అదే సమయంలో డీజిల్ ధరలు 4.1 శాతం పాయింట్లు పెరిగాయి. 14.34 శాతం నుంచి 18.44 శాతానికి పెరిగింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని రోజుల తరువాత కర్ణాటక ప్రభుత్వం అందరికి షాకిచ్చింది.

కొత్త ధరలు

కర్ణాటకలో పెట్రోల్ ధర రూ. 3 పెరిగితే.. డీజిల్ ధరలు రూ. 3.5 పెరిగింది. ఈ ధరలు 2024 జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి. పెట్రోలియం ఉత్పత్తుల మీద విధించే అమ్మకపు పన్నును సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన కూడా చేసింది. ప్రస్తుతం కర్ణాటకలో పెట్రోల్ ధరలు రూ. 102.84 కాగా.. డీజిల్ ధర రూ. 88.95 వద్ద ఉంది.

సమర్ధించిన కర్ణాటక ప్రభుత్వం

పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగినప్పటికీ కర్ణాటక ప్రభుత్వం సమర్ధించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మరియు మరియు రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. రాష్ట్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ వెల్లడించారు. కర్ణాటకలో ఇంధన పెరిగినప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువే అని ఆయన అన్నారు.

వ్యతిరేకించిన బీజేపీ

కర్ణాటక రాష్ట్రంలో ఇంధన ధరల పెరుగుదలను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది ప్రజారవాణా మరియు నిత్యావరస ధరల పెరుగుదలకు కూడా కారణమవుతుందని వెల్లడించింది. దేశంలో మోదీ ప్రభుత్వం ధరల పెరుగుదలను నియంత్రించడానికి ప్రయత్నిస్తుంటే.. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉన్నట్టుండి ధరలను పెంచడం సమంజసం కాదని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ధరల పెరుగుదల నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన అన్నారు.

ప్రతి రోజు వాహనాల కోసం పెట్రోల్ మరియు డీజిల్ అవసరం చాలా ఉంది. అలన్తి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్యుల మీద పెద్ద ప్రభావం చూపుతుందని ప్రహ్లాద్ జోషి అన్నారు. రోజువారీ అభివృద్ధి పనులకు మరియు ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి డబ్బులు లేకపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన (ప్రహ్లాద్ జోషి) ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఐదు హామీలను నెరవేర్చడానికి ఎక్కువ డబ్బు అవసరం. ఇది ప్రభుత్వ ఖజానా మీద తీవ్ర ప్రభావం చూపించింది. గ్యారంటీలు, ఉచిత పథకాల వల్ల అభివృద్ధి పనులకు కూడా డబ్బులు లేవు. అయితే ఉచిత పథకాలను మేము వ్యతిరేకించడం లేదు, కానీ దాన్ని మళ్ళీ ప్రజలమీదే భారంగా చేయడం సమంజసం కాదని జగదీశ్ శెట్టర్ అన్నారు.

Don’t Miss: సన్నీలియోన్‌ గ్యారేజీలో ఇన్ని కార్లున్నాయా? ఒక్కో కార్‌ రేటు చూస్తే మతిపోవడం ఖాయం!

ధరల పెరుగుదల ప్రజల మీద భారాన్ని చూపెడతాయని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీజీపీ కర్ణాటక అధ్యక్షుడు బీవై విజయేంద్ర అన్నారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దిగజారిందని, దీనికి చక్కని నిదర్శనం ఇంధన ధరల పెరుగుదల అని ఆయన అన్నారు. హామీల కారణంగా ప్రభుత్వం పరిపాలన చేయలేకపోతోందని.. వారు సరైన వనరులను పొందలేకపోతున్నారని విజయంద్ర అన్నారు.

పెరుగుతున్న ఎలక్ట్రిక్ కార్ల వినియోగం

పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్న కారణంగా చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య క్రమంగా పెరిగింది. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం తీసుకున్న నిర్ణయం.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత పెంచడానికి కారణం అవుతుంది. అంతే కాకుండా CNG వాహనాల వినియోగం కూడా పెరగనుంది. మొత్తం మీద ఏది ఏమైనా ప్రభుత్వాలు ఒక్కసారిగా ఇంధన ధరలను పెంచడం మంచిది కాదు, ఇది ప్రజలలో తీవ్రమైన అసంతృప్తిని రేకెత్తిస్తుంది.