తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తురులో అక్టోబర్ 11న.. 10వ ‘ఎఫ్ఎమ్ఏఈ’ నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ కాంపిటీషన్ 2025 జరగనుంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ముఖ్య అతిధిగా పాల్గొని ఆయన చేతుల మీదగా ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్ ప్రారంభించనున్నారు.
1300 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు
ఈ ఈవెంట్‌ను ఫ్రాటర్నిటీ ఆఫ్ మెకానికల్ అండ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్ (ఎఫ్ఎమ్ఏఈ) అనే సంస్థ నిర్వహిస్తోంది. ఇందుకుగానూ కోయంబత్తురులోని కుమరగురు ఇన్‌స్టిట్యూషన్స్ వేదికగా నిలవనుంది. ఈ పోటీలో దాదాపుగా 101 విద్యాసంస్థలకు చెందిన 1300 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. వీరంతా కలిసి 70కి పైగా చిన్న చిన్న టీమ్స్‌గా పోటీ చేయనున్నారు. ఇక్కడ విద్యార్థులు అందరూ వారి సొంత మేధస్సుతో, తెలివితేటలతో తయారు చేసిన వెహికల్స్ (మినీ రేసింగ్ వాహనాల) ప్రదర్శించనున్నారు.
విజేతల ఎంపిక ఇలా..
విద్యార్థులు వారు తయారు చేసిన వాహనాలను ట్రాక్‌లో నడిపి వారి ప్రతిభను పరీక్షించుకోనున్నారు. ఈ వెహికల్స్ అన్ని పెట్రోల్, డీజిల్ లేదా కరెంటుతో నడిచేవి కూడా ఐయుండచ్చు. ఒక్కో వాహనం ఎంత స్పీడ్ వెళ్తోంది, తయారు చేసిన డిజైన్ అండ్ మోడల్ ఏ విధంగా ఉంది, వెహికల్ పికప్, సేఫ్టీ వాటి ఇన్నోవేషన్ అంటే బ్యాటరీ, సెన్సార్లు,ఇంజన్ ఇవన్నీ కొత్త టెక్నాలజీ తో చేశారా లేదా ఇంకా కంట్రోలింగ్, బ్రేక్ సిస్టమ్, మానిటరింగ్ ఫిచర్లు ఏ పద్ధతిలో చేశారో వంటివాటిని బట్టి ఈ పోటీలో విజేతలను ఎంపిక చేస్తారు. జడ్జిమెంట్ ఇవ్వడానికి అత్యంత ప్రతిభ కలిగిన ఇరవై ఐదు మంది నిపుణులు ఇందులో పాల్గొననున్నారు. వీరందరూ దేశంలోని అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీలకి చెందిన ప్రతినిధులు. వీరే పోటీలో పాల్గొనే విన్నింగ్ పర్సన్‌ని నిర్ణయిస్తారు.
విద్యార్థులు భవిష్యత్తుకు ఓ దారి
ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్ అనేది.. భవిష్యత్తులో ఆటోమొబైల్ రంగంలో ఇంజనీర్స్ అవ్వాలనుకునే విద్యార్థులకు మంచి అవకాశాలను కల్పించడానికి దారిచూపుతుందని చెప్పవచ్చు. అంతే కాకుండా వారిలో ఉన్న కొత్త కొత్త ఆలోచనలను, ప్రాక్టికల్ నాలెడ్జ్, టీమ్ వర్క్, సాంకేతిక నిపుణ్యాన్ని ప్రోత్సహించడానికి భవిష్యత్తులో మరింత అభివృద్ధి పరచడానికి ఈ పోటీ ఉపయోగపడుతుంది అనేది ఎఫ్ఎమ్ఏఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం.
కేటీఆర్ రాకతో మరింత ప్రాముఖ్యత
స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ కాంపిటీషన్ అనేది మన ఇండియాలో మాత్రమే కాదు.. ఆసియాలోనే అతి పెద్ద పోటీ అనే చెప్పుకోవాలి. ఇటువంటి పోటీకి తెలంగాణ రాష్ట్ర రాజకీయ నేత కేటీ రామారావు రావడం అనేది మరింత ప్రచారం పొందటమే కాకుండా.. ప్రాముఖ్యతను సంతరించుకుంది. కేటీఆర్ ఎప్పుడు కూడా విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీలో మరింత అభివృద్ధి చెందాలని ప్రోత్సహం అందిస్తూ ఉంటారు కాబట్టి.. ఈ కార్యక్రమం ఒక ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పవచ్చు. అయితే ఏ విభాగంలో ఎవరు విజేత.. ఎవరి సామర్థ్యం ఎంత అని తెలుసుకోవడానికి ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని, విద్యార్థుల భవిష్యత్తుకి మంచి మార్గం చూపాలని ఆశిద్దాం.