Mind Blowing Car Collection Of Mahendra Singh Dhoni: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరుకు పెద్దగా పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే భారత క్రికెట్ ప్రపంచంలో అలుపెరుగని ధీరుడు, అనితరసాధ్యుడుగా.. మేరునగధీరుడుగా ఎదిగిన ఎమ్ఎస్ ధోని.. ఎంతోమంది యువతకు రోల్ మోడల్. క్రికెట్ అంటే మాత్రమే బైకులు మరియు కార్ల పట్ల కూడా అమితమైన ఆసక్తి కలిగిన ధోని.. అతి పెద్ద వాహన ప్రపంచానికి మకుటంలేని మహారాజు. ఈ కథనంలో మహేంద్ర సింగ్ ధోని గ్యారేజిలో ఉన్న చెప్పుకోదగ్గ కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం..
హమ్మర్ హెచ్2
సుమారు రూ.75 లక్షల విలువైన హమ్మర్ హెచ్2 ఎమ్ఎస్ ధోని గ్యారేజిలో ఉంది. కఠినమైన డిజైన్ కలిగిన ఈ కారు.. అద్భుతమైన ఆఫ్ రోడింగ్ అనుభూతిని అందించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది 6.2 లీటర్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది 398 హార్స్ పవర్ మరియు 574 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. విలాసవంతమైన ఫీచర కలిగిన ఈ కారు వాహన వినియోగదారులకు అత్యద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ కారు పలువురు ప్రముఖుల గ్యారేజిలో కూడా ఉంది. దీన్ని బట్టి చూస్తే.. ఈ కారుకు మార్కెట్లో ఎంత ఆదరణ ఉందో ఇట్టే తెలిసిపోతుంది.
ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్ 2
రూ. 43.66 లక్షల నుంచి రూ. 57.37 లక్షల విలువైన ‘ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్ 2’ కూడా ధోని గ్యారేజిలో ఉంది. ఈ కారు 2.2 లీటర్ డీజిల్ మరియు 3.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు చూడగానే ఆకట్టుకుంటుంది. ధోని ఈ కారును డ్రైవ్ చేస్తూ పలుమార్లు కనిపించారు.
నిస్సాన్ జొంగా
మహేంద్ర సింగ్ ధోని గ్యారేజిలోని మరో కారు నిస్సాన్ జొంగా. నిజానికి ఇదొక వింటేజ్ కారు. 2019లో ధోని ఈ కారును తన గ్యారేజిలో చేర్చారు. ఈ మోడల్ కార్లను భారతీయ సాయుధ దళాలు ఉపయోగించేవి. కఠినమైన భూభాగాల్లో ప్రయాణించడానికి చాలా అనుకూలంగా ఉండే.. ఈ కార్లను మిలటరీ ఉపయోగించేది. అలాంటి కారును ధోని తన గ్యారేజిలో చేర్చారు. దీనిని నిస్సాన్ 4డబ్ల్యు73 అని పిలుస్తారు. ఈ కారు 4 లీటర్ ఇంజిన్ కలిగి 3200 rpm వద్ద 110 Bhp మరియు 1200 rpm వద్ద 264 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. దీని ధర సుమారు రూ. 15 లక్షలు ఉంటుందని సమాచారం.
మిత్సుబిషి పజెరో ఎస్ఎఫ్ఎక్స్
మహేంద్ర సింగ్ ధోని గ్యారేజిలోని మరో కారు మిత్సుబిషి పజెరో ఎస్ఎఫ్ఎక్స్. ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా.. అసాధారణమైన ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. ఈ కారు 2.8 లీటర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ 118 హార్స్ పవర్ మరియు 292 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. దృఢమైన నిర్మాణం కలిగిన ఈ కారు అద్బుతమైన ఇంటీరియర్ కూడా పొందుతుంది. ప్రస్తుతం ఈ కారు ఉత్పత్తి నిలిచిపోయింది. కానీ కొంతమంది వాహన ప్రేమికులు మాత్రమే తమ గ్యారేజిలో ఈ కార్లను కలిగి ఉన్నారు.
కియా ఈవీ6
సౌత్ కొరియా కార్ల తయారీ కియా మోటార్స్ యొక్క ఈవీ6 కూడా ధోని గ్యారేజిలో ఉంది. దాదాపు రూ.60 లక్షల ఖరీదైన ఈ కారు ఒక ఫుల్ చార్జితో ఏకంగా 700 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. అత్యాధునిక డిజైన్ కలిగిన ఈ కారు రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు కేవలం 5.1 సెకన్లలోనే గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు ప్రస్తుతం దేశంలో ఎక్కువ రేంజ్ అందిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో ఒకటిగా ఉంది.
ఆడి క్యూ7
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి క్యూ 7 కూడా మిస్టర్ కూల్ గ్యారేజిలో ఉంది. రూ. 88 లక్షల విలువైన ఈ కారు ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో ఉంది. ఈ కారు మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ కారు విలాసవంతమైన ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల.. మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ కారు జాన్ అబ్రహం, విరాట్ కోహ్లీ వంటివారు కూడా తమ గ్యారేజిలో ఈ కార్లను చేర్చారు. దీన్ని బట్టి చూస్తే ఈ కారుకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
మహీంద్రా స్కార్పియో
దేశీయ వాహన దిగ్గజం మహింద్ర అండ్ మహీంద్ర కంపెనీ యొక్క స్కార్పియో కూడా ధోని గ్యారేజిలోని అనేక కారులో ఒకటి. ఒకప్పటి నుంచి భారతీయ విఫణిలో అత్యుత్తమ అమ్మకాలు పొందుతున్న ఈ కారు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందుతూనే ఉంది. ఇది 2.2 లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 140 హార్స్ పవర్ మరియు 320 న్యూటన్ మీటర్ టార్క్ పొందుతుంది. ఈ కారు సిటీ డ్రైవింగ్ కోసం మాత్రమే కాకుండా ఆఫ్-రోడింగ్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికి కూడా భారతీయులు ఎక్కువమంది కోరుకునే కార్ల జాబితాలో ఇది చెప్పుకోదగ్గ మోడల్.
జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్‌హాక్
అమెరికన్ బ్రాండ్ అయిన జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్‌హాక్ కూడా మహేంద్ర సింగ్ ధోని గ్యారేజిలో ఉంది. దీని ధర ఏకంగా కోటి రూపాయలకంటే ఎక్కువ. ఇందులో 6.2 లీటర్ వీ8 ఇంజిన్ 707 హార్స్ పవర్, 875 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. మొత్తం మీద ఈ కారు అత్యంత శక్తివంతమైన జీప్ కారుగా పరిగణించబడుతుంది.
రోల్స్ రాయిస్ సిల్వర్ వ్రైత్
బ్రిటీష్ వాహన తయారీ సంస్థ రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన సిల్వర్ వ్రైత్ కారు కూడా ధోని గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇది 6.75 లీటర్ వీ8 ఇంజిన్ కలిగి 190 హార్స్ పవర్ మరియు 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్పెషల్ డిజైన్ కలిగిన ఈ కారు అత్యుత్తమ ఫీచర్స్ పొందుతుంది. తద్వారా మంచి డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు.
మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ
బెంజ్ కంపెనీకి చెందిన జీఎల్ఈ కారు కూడా ధోని ఉపయోగించే కార్ల జాబితాలో ఒకటి. రూ. 80 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన సొగసైన డిజైన్, ఆధునిక సాంకేతికతలను పొందుతుంది. అత్యాధునిక డ్రైవింగ్ అనుభవాన్ని పొందటానికి ఈ కారులో అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారును ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారు.
హిందూస్తాన్ అంబాసిడర్
ఒకప్పుడు భారతదేశంలో అత్యతం ప్రజాదరణ పొందిన మరియు ప్రసిద్ధి చెందిన కార్లలో చెప్పుకోదగ్గది హిందూస్తాన్ అంబాసిడర్. దీని ధర అప్పట్లో తక్కువే అయినా.. నేడు ఇది మార్కెట్లో అమ్మకానికి లేదు. కొంతమంది వాహన ప్రేమికుల గ్యారేజిలో మాత్రమే ఇది కనిపిస్తుంది. అప్పుడప్పుడూ.. అక్కడక్కడా ఈ కారు రోడ్ల మీద కూడా దర్శనమిస్తుంది. ఇది 1.5 లీటర్ డీజిల్ మరియు 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది.
Don’t Miss: 30 లీటర్ల పెట్రోల్ ట్యాంక్.. మరెన్నో విశేషాలు: రైడింగ్ చేయడానికి మినిమన్ ఉంటది!
పైన చెప్పిన కార్లు మాత్రమే కాకుండా మహేంద్ర సింగ్ ధోని గ్యారేజిలో ఫెరారీ 599 జీటీఓ, పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ ఆమ్ వంటి వింటేజ్ కార్లు కూడా ఉన్నాయి. కార్లు కాకుండా హార్లే డేవిడ్సన్ ఫ్యాట్‌బాయ్, కవాసకి నింజా హెచ్2, డుకాటీ 1098, యమహా ఆర్‌డీ350, సుజుకి హయబుసా, అపాచీ ఆర్ఆర్ 310 మరియు బీఎస్ఏ గోల్డ్ స్టార్ వంటి మరెన్నో బైకులు ఈయన గ్యారేజిలో ఉన్నాయని తెలుస్తోంది.