2024లోనే కారును ఎందుకు కొనాలి.. 2025లో కొంటే వచ్చే నష్టాలు తెలుసా?

Cars and SUVs To Get Price Hike From January 2025: 2024 సంవత్సరం చరమదశకు వచ్చేసింది.. ఇంకొన్ని రోజుల్లో కొత్త ఏడాది (2025) మొదలైపోతుంది. చాలామంది కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు. కానీ 2025లో కారు కొనుగోలు చేయడం కన్నా.. 2024 ముగిసేలోపే కారు కొంటే కొంత లాభదాయకమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాదే కారు కొంటే వచ్చే లాభాలు ఏమిటి.. వచ్చే ఏడాది కొంటే వచ్చే నష్టాలు ఏమిటనే వివరాలు క్షుణ్ణంగా ఇక్కడ తెలుసుకుందాం.

జనవరి నుంచి పెరగనున్న ధరలు

భారతదేశంలోని చాలా దిగ్గజ కంపెనీలు 2025 జనవరి నుంచి తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించేసాయి. ఈ జాబితాలో మారుతి సుజుకి, జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా, హ్యుందాయ్ మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఆడి మరియు మహీంద్రా అండ్ మహీంద్రా మొదలైన కంపెనీలు ఉన్నాయి.

కార్ల తయారీకి అవసరమైన ముడిసరుకుల ధరలు పెరగడం మాత్రమే కాకుండా.. దిగుమతి సుంకాలు భారీగా పెరగడం, సరఫరాలో కలుగుతున్న అంతరాయాలు వంటివన్నీ కూడా ధరల పెరుగుదలకు కారణమయ్యాయి రాయిటర్స్ తన నివేదికలో స్పష్టం చేసింది.

దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి (Maruti Suzuki).. వచ్చే ఏడాది ప్రారంభం నుంచే తన కార్ల ధరలను 4 శాతం వరకు పెంచనుంది. జేఎస్‌డబ్ల్యు మరియు ఎంజీ మోటార్ (JSW MG Motor) కంపెనీల మధ్య ఈ మధ్య కాలంలోనే జాయింట్ వెంచర్ ఏర్పడింది. ఈ సంస్థ కూడా తమ ఉత్పత్తుల ధరలపై 3 శాతం పెరుగుదలను ప్రకటించాయి.

భారతదేశంలోని రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన హ్యుందాయ్ మోటార్స్ (Hyundai Motor) కంపెనీ కూడా తన ఉత్పత్తులపైన ఏకంగా రూ. 25000 పెంచనున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త ధరలు 2025 జనవరి 1 నుంచే అమలులోకి వస్తున్నాయి. అంటే ఈ కార్ల ధరలు జనవరి ఒకటి నుంచి పెరగనున్నాయి. కొత్త ధరలు అప్పటి నుంచే అమలులోకి రానున్నాయి.

ఆటో పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లు

ద్రవ్యోల్బణం మాత్రమే కాకుండా.. పెరుగుతున్న గ్లోబల్ కమోడిటీ ధరలు, లాజిస్టికల్ సవాళ్లు అన్నీ కూడా భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ కారణాల వల్లనే కార్ల ధరలు పెరుగుతున్నాయి. ధరల పెరుగుదల కార్ల అమ్మకాల మీద కూడా కొంత ప్రభావాన్ని చూపే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనిని కూడా ఆటోమొబైల్ కంపెనీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

భారతదేశంలో 42 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్న దిగ్గజ కంపెనీ మారుతి సుజుకి.. 2023 జనవరిలో 0.45 శాతం ధరల పెరుగుదలను అమలు చేసింది. అయినప్పటికీ.. ఈ ఏడాది అమ్మకాలు ఉత్తమాంగానే ఉన్నట్లు వెల్లడించింది. మార్కెట్ షేర్స్ కూడా గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. దీన్ని బట్టి చూస్తే.. ధరల పెరుగుదల అమ్మకాల మీద పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని తెలుస్తోంది.

దేశీయ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్‌లో 1 శాతం వాటాను కలిగి ఉన్న జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ సంస్థ కూడా నాణ్యమైన ఉత్పత్తులును తీసుకురావడానికి ధరల సవరణ లేదా పెంపు అవసరమని స్పష్టం చేసింది. అంతే కాకుండా పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను భర్తీ చేయడానికి కొంత ధరల పెరుగుదల అనివార్యమని జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ‘సతీందర్ సింగ్ బజ్వా’ పేర్కొన్నారు.

ఇతర దిగ్గజ సంస్థల ధరల పెంపు

మారుతి సుజుకి, హ్యుందాయ్ మరియు ఎంజీ మోటార్ కంపెనీలు మాత్రమే కాకుండా.. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కూడా ఎస్‌యూవీల ధరలను మాత్రమే కాకుండా కమర్షియల్ వాహనాల ధరలను 3 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. అదనపు ఖర్చులను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Also Read: కాలగర్భంలో కలిసిపోయినా.. ఈ కార్ల కోసం గూగుల్‌లో వెతికేస్తున్నారు!

ఇదే వరుసలో లగ్జరీ కార్ల తయారీ సంస్థలు

దేశీయ దిగ్గజ కంపెనీలు మాత్రమే కాకుండా.. జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి వంటివన్నీ కూడా 2025 ప్రారంభం నుంచే తమ కార్ల ధరలను పెంచడానికి సిద్ధమయ్యాయి. మొత్తం మీద జనవరి 1 నుంచే దాదాపు అన్ని కంపెనీల కార్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల 31 లోపల కొత్త కార్లను కొనుగోలు చేసేవారు కొంత తక్కు డబ్బు వెచ్చించి.. కార్లను కొనుగోలు చేయవచ్చు. అదే వచ్చే నెలలో కొనుగోలు చేయాలనుకునే వారు కొత్త కారు కొనుగోలు చేయాలంటే కొంత ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిందే.

Leave a Comment