Mahindra XUV700 Crossed 2 Lakh Units Production Milestone: దేశీయ వాహన తయారీ దిగ్గజం ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (Mahindra & Mahindra) దేశీయ మార్కెట్లో ఎక్స్‌యూవీ700 (XUV700) లాంచ్ చేసి ఉత్తమ అమ్మకాలు పొందుతున్న విషయం తెలిసిందే. భారతీయ విఫణిలో ప్రారంభం నుంచి కనీవినీ ఎరుగని రీతిలో బుకింగ్స్ పొందిన ఈ కారు ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. అత్యుత్తమ అమ్మకాలు పొందుతున్న ఈ ఎస్‌యూవీ తాజాగా ఉత్పత్తిలో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ తరుణంలో కంపెనీ రెండు కొత్త కలర్ ఎక్స్‌యూవీ700 కార్లను కూడా పరిచయం చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
33 నెలల్లో 2 లక్షల యూనిట్లు
ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్స్‌యూవీ700 కార్లను మహీంద్రా ఏకంగా రెండు లక్షల వరకు ఉత్పత్తి (తయారు) చేసినట్లు వెల్లడించింది. కంపెనీ ఈ కారును భారతదేశంలో లాంచ్ చేసిన కేవలం 33 నెలల సమయం మాత్రమే పట్టింది. ఎక్స్‌యూవీ700 ఉత్పత్తి ప్రారంభమైన 21 నెలల్లో కంపెనీ 1 లక్ష యూనిట్లను తయారు చేసింది. ఆ తరువాత 1 లక్ష యూనిట్ల మహీంద్రా ఎక్స్‌యూవీ700 కార్లను ఉత్పత్తి చేయడానికి కేవలం 12 నెలల సమయం మాత్రమే పట్టినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఈ కార్లకు ఎంత డిమాండ్ ఉందో ఇట్టే అర్థమైపోతుంది.
భారతీయ విఫణిలో మహీంద్రా ఎక్స్‌యూవీ700 నెలకు సగటున 8000 యూనిట్ల బుకింగ్స్ పొందినట్లు సమాచారం. గత నెలలో కంపెనీ బ్లేజ్ ఎడిషన్ పేరుతో సరికొత్త ఎక్స్‌యూవీ700 లాంచ్ చేసింది. ఈ ఎడిషన్ కేవలం ఏఎక్స్5 సెలక్ట్ వేరియంట్‌కు మాత్రమే పరిమితమైంది. ఈ ఎడిషన్ చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ పొంది ఉన్నట్లు సమాచారం.
కొత్త కలర్ మహీంద్రా ఎక్స్‌యూవీ700 కార్లు
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ రెండు లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసిన సందర్భంగా రెండు కొత్త పెయింట్ స్కీమ్‌లను ప్రవేశపెట్టింది. ఇందులో ఒకటి డీప్ ఫారెస్ట్ కాగా, మరొకటి బర్న్ట్ సియెన్నా కలర్. ఈ కలర్స్ కాకుండా కంపెనీ తన ఎక్స్‌యూవీ700 కారును సిల్వర్, ఎలక్ట్రిక్ బ్లూ, ఎవరెస్టు వైట్, మిడ్‌నైట్ బ్లాక్, రెడ్ రేజ్ మరియు నాపోలి బ్లాక్ మొదలైన సింగిల్ టోన్ రంగులలో కూడా అందిస్తోంది. ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఎక్స్‌యూవీ700 మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుండటం వల్ల కస్టమర్లు తమకు నచ్చిన కలర్ ఎంచుకోవచ్చు.
ఎక్స్‌యూవీ700 కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 197 బీహెచ్‌పీ పవర్ మరియు 380 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డీజిల్ ఇంజిన్ 182 బీహెచ్‌పీ పవర్ మరియు 420 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్లు 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్స్ పొందినట్లు సమాచారం. ఈ రెండూ ఉత్తమ పనితీరును అందిస్తాయని సమాచారం.
ధరలు
భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన మహీంద్రా ఎక్స్‌యూవీ700 ధరలు రూ. 13.99 లక్షల నుంచి రూ. 26.99 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ కారు మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న టాటా సఫారీ, టాటా హారియర్, ఎంజీ హెక్టర్, హెక్టర్ ప్లస్, హ్యుందాయ్ ఆల్కజార్ మరియు జీప్ కంపాస్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాగా మహీంద్రా కంపెనీ త్వరలోనే ఎక్స్‌యూవీ700 యొక్క ఫుల్ ఎలక్ట్రిక్ వెర్షన్ ఎక్స్‌యూవీ.ఈ8 పేరుతో లాంచ్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
Don’t Miss: కేవలం రూ. 54999లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రోజువారీ వినియోగానికి కరెక్ట్ ఆప్షన్!
నిజానికి భారతదేశంలో అత్యుత్తమ డిజైన్, ఫీచర్స్ మరియు సేఫ్టీ ఫీచర్స్ కలిగిన కార్ల జాబితాలో ఎక్స్‌యూవీ700 చెప్పుకోదగ్గ మోడల్. ఇది మల్టిపుల్ ట్రిమ్‌లలో లభిస్తుంది. ఇండియన్ మార్కెట్లో మొట్ట మొదటి ఏడీఏఎస్ (అడ్వాన్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం) ఈ కారులోని ప్రారంభమైంది. ఈ ఘనత కేవలం మహీంద్రా కంపెనీకే చెందుతుంది. అయితే ఈ ఫీచర్ ఇప్పుడు మార్కెట్లో లాంచ్ అవుతున్న దాదాపు చాలా కార్లలో అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తుంది.