పండుగ సీజన్‌లో పండుగలాంటి వార్త!.. భారీగా తగ్గిన ధరలు

Maruti Suzuki Price Cuts K10 And S-Presso: భారతదేశంలో ఎక్కువ మందికి ఇష్టమైన మారుతి సుజుకి యొక్క ‘ఆల్టో కే10’ (Alto K10) మరియు ‘ఎస్-ప్రెస్సో’ (S-Presso) కార్లను ఇప్పుడు అద్భుతమైన తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అయితే కంపెనీ ఈ తగ్గింపులను ఆల్టో కే10 యొక్క వీఎక్స్ఐ & ఎస్-ప్రెస్సో యొక్క ఎల్ఎక్స్ఐ వేరియంట్లకు మాత్రమే పరిమితం చేసింది.

తగ్గిన ధరలు

మారుతి సుజుకి ఆల్టో కే10 వీఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ కొనుగోలుపైన కస్టమర్ రూ. 6500 తగ్గింపును పొందుతాడు. అదే సమయంలో ఎస్-ప్రెస్సో యొక్క ఎల్ఎక్స్ఐ పెట్రోల్ మోడల్ కొనుగోలుపైన కేవలం రూ.2000 మాత్రమే తగ్గింపు లభిస్తుంది. ఈ డిస్కౌంట్స్ సెప్టెంబర్ 2నుంచి అమలులోకి వచ్చాయి.

కొత్త ధరలు

మారుతి సుజుకి తన ఆల్టో కే10 మరియు ఎస్-ప్రెస్సో కార్ల ధరలను తగ్గించిన తరువాత ఎక్స్ షోరూమ్ ధరలు తగ్గాయి. కాబట్టి మారుతి ఆల్టో కే10 వీఎక్స్ఐ వేరియంట్ ధర రూ. 5.06 లక్షలు (భారతదేశంలో ఆల్టో కే10 ధరలు రూ. 3.99 లక్షల నుంచి రూ. 5.96 లక్షల మధ్య ఉన్నాయి, ఎక్స్ షోరూమ్ ఇండియా).

ఎస్-ప్రెస్సో ఎల్ఎక్స్ఐ ధరలు ఇండియన్ మార్కెట్లో రూ. 4.27 లక్షల నుంచి రూ. 6.12 లక్షల మధ్య ఉన్నాయి. ధరల తగ్గింపు తరువాత ఎస్-ప్రెస్సో ఎల్ఎక్స్ఐ వేరియంట్ ధర రూ. 5.02 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఇండియా). ఈ తగ్గింపులు కంపెనీ యొక్క అమ్మకాలను పెంచే అవకాశం ఉంది.

భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. ఈ సమయంలో కొంతమంది కొత్త కార్లను కొనుగోలు చేయాలని చాలా ఆసక్తి చూపుతారు. ఈ సమయంలో కంపెనీ తన కార్లమీద తగ్గింపులు ప్రకటించడం.. కొత్త కస్టమర్లను ఆకర్శించగలదు. ఇదే జరిగితే మారుతి సుజుకి అమ్మకాలు మళ్ళీ పుంజుకుంటాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతున్న బ్రాండ్ సేల్స్ పెంచుకోవడానికి కంపెనీ ఈ తగ్గింపులు ప్రకటించిందని స్పష్టమవుతోంది.

ధరల తగ్గింపులకు కారణం

మార్కెట్లో మారుతి సుజుకి యొక్క ఎంట్రీ లెవెల్ కార్ల అమ్మకాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని నెలలుగా ఇదే వరుస జరుగుతోంది. గత నెలలో మారుతి చిన్న కార్ల విక్రయాలు 13 శాతం క్షిణించగా.. జూన్ నెలలో ఏకంగా 33 శాతం తగ్గిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే వీటి అమ్మకాలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో కొత్త సమస్యలను తీసుకు వచ్చే ప్రమాదం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి ఈ కార్ల మీద (ఆల్టో, ఎస్-ప్రెస్సో) తగ్గింపులు ప్రకటించడం జరిగింది.

తగ్గిన సేల్స్

2024 ఆగష్టు నెలలో కంపెనీ యొక్క దేశీయ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ 143075 యూనిట్లుగా నమోదయ్యాయి. 2023 ఆగష్టులో ఈ సేల్స్ 156114 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే గత నెలలో సంస్థ అమ్మకాలు 8 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంట్రీ లెవెల్ మోడల్‌లు ఆల్టో కే10 మరియు ఎస్-ప్రెస్సో సేల్స్ 10648 యూనిట్లు. 2023 ఆగష్టులో ఈ సేల్స్ 12209 యూనిట్లు. ఈ లెక్కన సేల్స్ మునుపటి ఏడాది కంటే ఈ ఏడాది 13 శాతం తగ్గినట్లు స్పష్టమవుతోంది.

మారుతి ఆల్టో కే10 యొక్క అమ్మకాలను పరిశీలిస్తే.. 2024 జనవరిలో ఈ హ్యాచ్‌బ్యాక్ సేల్స్ 12395 యూనిట్లు. ఏప్రిల్ 2024లో 9043 యూనిట్లు. జులై 2024 ఈ సంఖ్య 7354 యూనిట్లకు చేరింది. దీన్ని బట్టి చూస్తే మారుతి ఎంట్రీ లెవెల్ కార్లకున్న డిమాండ్ తగ్గుతున్నట్లు అవగతమైంది. కాబట్టి ఈ అమ్మకాలను పెంచుకోవడానికి ఉత్తమ మార్గం తగ్గింపులు ఒక్కటే అని తలచి, కంపెనీ ఇప్పుడు ధరలను తగ్గించింది.

Don’t Miss: ‘పవన్ కళ్యాణ్’ వాహన ప్రపంచం చూశారా!.. ఓ లుక్కేసుకోండి

భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూనే.. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను లేదా అప్డేటెడ్ ఉత్పత్తులను లాంచ్ చేస్తూ తన ఉనికిని చాటుకుంటోంది. రాబోయే ఈ పండుగ సీజన్లో కంపెనీ తన వాహనాల విక్రయాలను పెంచుకోవడానికి, కస్టమర్లను ఆకర్శించడానికి ఆఫర్స్ కూడా అందించే అవకాశం ఉంది. మొత్తం మీద కంపెనీ అమ్మకాలను పెంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కాబట్టి కంపెనీ ఉత్తమ అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము.

UMA SRI
UMA SRIhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.
RELATED ARTICLES

Most Popular

Recent Comments