రెండు వారాల్లో 25000 బుకింగ్స్: పండుగలో ఈ కారుకు ఫుల్ డిమాండ్!

మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లో గొప్ప ఆదరణ పొందుతూ.. ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త విక్టోరిస్ అద్భుతమైన అమ్మకాలను పొందగలిగింది. దీంతో వెయిటింగ్ పీరియడ్ అమాంతం పెరిగిపోయింది.

25000 కంటే ఎక్కువ బుకింగ్స్

సెప్టెంబర్ 15న మారుతి సుజుకి తన విక్టోరిస్ కారును లాంచ్ చేసింది. అయితే మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు కేవలం రెండు వారాల వ్యవధిలోనే 25000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొంది.. అమ్మకాల్లో ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కంపెనీ ఈ విషయాన్ని తాజాగా విడుదల చేసింది. దీంతో ఈ కారు కోసం వెయిటింగ్ పీరియడ్ ఎంపిక చేసిన వేరియంట్‌లకు సుమారు 10 వారాలు ఉన్నట్లు తెలిసింది. అయితే ఏ వేరియంట్ కోసం ఎన్ని వారాలు వెయిట్ చేయాలనే విషయాన్ని సంస్థ అధికారికంగా వెల్లడించలేదు.

ఈ ఏడాది నవరాత్రి సీజన్ మారుతి సుజుకి కంపెనీకి బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఈ సమయంలో విక్టోరిస్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కంపెనీ 2025 జనవరి నుంచి ఆగస్టు వరకు సుమారు 1.50 లక్షల కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు వెల్లడించింది. కాగా ఇప్పటికి (9 నెలల కాలంలో) దాదాపు 1.65 లక్షల వాహనాలను విక్రయించినట్లు తెలిపింది. అంతే కాకుండా సంస్థ దసరా నాటికి 2 లక్షల కార్లను విక్రయించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. బహుశా ఈ లక్ష్యాన్ని చేరుకొని ఉంటుందనే భావిస్తున్నాము.

మారుతి సుజుకి విక్టోరిస్

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త మారుతి సుజుకి విక్టోరిస్ కారు యాంత్రికంగా గ్రాండ్ విటారా మాదిరిగా ఉంది. అయితే కంపెనీ ఈ కారును నెక్సా అవుట్‌లెట్‌ల ద్వారా కాకుండా.. అరీనా అమ్మకాల నెట్‌వర్క్ ద్వారా విక్రయించనుంది. కాగా విక్టోరిస్ భారతీయ విఫణిలో ఇప్పటికే అమ్మకానికి ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

మారుతి విక్టోరిస్ కారు ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ (ఓ), జెడ్ఎక్స్ఐ ప్లస్ (ఓ) అనే ఆరు వేరియంట్లలో.. మూడు ఇంజిన్ (పెట్రోల్, సీఎన్‌జీ, స్ట్రాంగ్ హైబ్రిడ్) ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. ఈ కారులోని 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్.. 101.6 బీహెచ్‌పీ పవర్, 139 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కాన్వర్టర్ ఆటోమాటిక్ ఎంపికలను పొందుతాయి. సీఎన్‌జీ వేరియంట్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ మాత్రమే పొందుతుంది.

స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఆన్‌బోర్డ్ బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ మోటారుతో జతచేస్తుంది. పెట్రోల్ మిల్ సుమారు 91.7 బీహెచ్‌పీ పవర్, 122 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఎలక్ట్రిక్ మోటారు 79 బీహెచ్‌పీ పవర్, 141 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. తద్వారా మంచి పనితీరును అందిస్తుంది.

మారుతి విక్టోరిస్ సేఫ్టీ రేటింగ్

మంచి డిజైన్, ఫీచర్స్ కలిగిన మారుతి విక్టోరిస్ అత్యుత్తమ పనితీరును అందించడం మాత్రమే కాకుండా.. అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. దీంతో ఇది సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగులు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ వంటి ఫీచర్లతో లెవల్ 2 ఏడీఏఎస్ సిస్టం వంటి వాటితో.. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ కూడా ఉన్నాయి.