రూ. 5.65 లక్షలకే.. వ్యాగన్ ఆర్ కొత్త ఎడిషన్: మంచి డిజైన్ & సరికొత్త ఫీచర్స్

Maruti Suzuki WagonR Waltz Edition Launched in India: ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’ (Maruti Suzuki) తన పాపులర్ మోడల్ ‘వ్యాగన్ ఆర్’ను కొత్త ఎడిషన్ రూపంలో లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఎడిషన్ పేరు ‘మారుతి వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ ఎడిషన్’. దేశీయ విఫణిలో ఇప్పటికే ఉత్తమ అమ్మకాలు పొందుతూ ముందుకు సాగుతున్న వ్యాగన్ ఆర్ ఇప్పుడు కొత్త ఎడిషన్ రూపంలో లాంచ్ కావడంతో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము.

ప్రారంభ ధర & వేరియంట్స్

చూడగానే సాధారణ మోడల్ మాదిరిగా అనిపించే ఈ కొత్త వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ ఎడిషన్ యొక్క ప్రారంభ ధర రూ. 5.65 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ మరియు జెడ్ఎక్స్ఐ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అయితే ధరలు ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటాయి.

ఎక్స్టీరియర్ డిజైన్

కొత్త మారుతి వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ ఎడిషన్ చూడగానే దాని సాధారణ మోడల్ గుర్తుకు వస్తుంది. కానీ ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ఎడిషన్ ఫాగ్ లాంప్, వీల్ ఆర్చ్ క్లాడింగ్, బంపర్ ప్రొటెక్టర్లు, సైడ్ స్కర్ట్స్, బాడీ సైడ్ మౌల్డింగ్, డిజైనర్ ఫ్లోర్ మ్యాట్స్, ఇంటీరియర్ స్టైలింగ్ కిట్, గ్రిల్‌పైన క్రోమ్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ వ్యాగన్ ఆర్ కొత్త ఎడిషన్ను చాలా హుందాగా కనిపించేలా చేస్తాయి.

ఇంటీరియర్ ఫీచర్స్

మారుతి వ్యాగన్ ఆర్ కొత్త ఎడిషన్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 6.2 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, అప్‌గ్రేడ్ చేయబడిన స్పీకర్లు, అప్డేటెడ్ సెక్యూరిటీ సిస్టం మరియు రివర్స్ పార్కింగ్ కెమెరా వంటివి ఉన్నాయి. వీటితో పాటు ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైనవన్నీ ఉంటాయి.ఇవన్నీ వాహన వినియోగదారులకు లేదా డ్రైవర్లకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

లిమిటెడ్ ఎడిషన్

కొత్త వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ ఎడిషన్ పరిమిత సంఖ్యలో మాత్రమే లభిస్తుంది. అయితే కంపెనీ ఎన్ని యూనిట్లను విక్రయిస్తుంది.. ఎప్పటి వరకు విక్రయిస్తుంది అనే వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అంతే కాకుండా కంపెనీ ఈ కారు యొక్క ప్రారంభ ధరలను మాత్రమే వెల్లడించింది. వేరియంట్స్ వారీగా ధరలను వెల్లడించాల్సి ఉంది.

పవర్‌ట్రెయిన్స్

మారుతి వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ ఎడిషన్ రెండు పెట్రోల్ ఇంజిన్స్ పొందుతుంది. అవి 64 హార్స్ పవర్ అండ్ 89 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.0 లీటర్ త్రీ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్. మరొకటి 113 న్యూటన్ మీటర్ టార్క్ మరియు 90 హార్స్ పవర్ అందించే 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్. ఈ రెండు ఇంజిన్స్ 5 స్పీడ్ మాన్యువల్ మరియు 5 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. ఈ కారు కేవలం 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ కలిగిన 1.0 లీటర్ CNG ఇంజిన్ ఆప్షన్ కూడా పొందుతుంది. కాబట్టి ఇది మొత్తం మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుందన్నమాట.

ప్రత్యర్థులు

మారుతి వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ ఎడిషన్ దేశీయ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న సిట్రోయెన్ సీ3, టాటా టియాగో వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ తెలుసుకోవాల్సి విషయం ఏమిటంటే.. ఈ కారు ఎన్ని యూనిట్లు అందుబాటులో ఉంటుందనే విషయం తెలియాల్సి ఉంటుంది.

వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ ఎడిషన్ డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ హోల్డ్ అసిస్ట్ మొదలైన సేఫ్టీ ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి.

Don’t Miss: ముగిసిన Mahindra Roxx వేలం: ఎంతకు కొన్నారో తెలిస్తే షాకవుతారు!

30 లక్షలు దాటిన సేల్స్

1999లో ప్రారంభమైనప్పటి నుంచి వ్యాగన్ ఆర్ భారతదేశంలో 32.5 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ అమ్ముడైంది. అమ్మకాల్లో అగ్రగామిగా ఉన్న ఈ కారు 2012లో 10 లక్షల అమ్మకాలను నమోదు చేసింది. ఆ తరువాత 2017 నాటికి మరో 10 లక్షల సేల్స్ నమోదు చేసింది. 2023నాటికి ఇంటికో 10 లక్షల సేల్స్ సాధించింది మొత్తం 30 లక్షల సేల్స్ పొందగలిగింది. ఈ విధంగా అమ్మకాల్లో దూసుకెళ్తున్న ఈ కారు ఇప్పుడు ఓ కొత్త ఎడిషన్ రూపంలో లాంచ్ అయింది. కాబట్టి మరింత గొప్ప అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.