ఢిల్లీలో భారీగా పెరిగిపోతున్న కాలుష్యం: అసలైన కారణాలివే!

ప్రకృతి వైపరీత్యాలు వస్తే ప్రమాదాలను ఊహించలేము. కానీ ప్రకృతికి ఇబ్బంది కలిగిస్తే.. వచ్చే ప్రమాదాన్ని ఆపడం బ్రహ్మ తరం కూడా కాదు. ఇది అక్షర సత్యం. ఒకప్పుడు ప్రపంచం ఆహ్లాదంగా ఉండేది. జంతు, పశుపక్ష్యాదులు తిరుగాడుతూ ఉండేవి. ఆ సమయంలో మనుషులు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా సంతోషంగా కాలం గడిపేవాళ్లు. అయితే టెక్నాలజీ పేరుతో.. మనిషి సృష్టిస్తున్న అద్భుతాలు, అవాంతరాలను తెస్తున్నాయి. అవే మానవ మనుగడకు హాని చేస్తున్నాయి. దీనికి ఓ స్పష్టమైన ఉదాహరణ వాయు కాలుష్యం. ఎయిర్ పొల్యూషన్ అంటే ముందుగా గుర్తచ్చేది ఢిల్లీ నగరమే. ఇంతకీ ఇక్కడ గాలి కాలుష్యం ఎందుకు గణనీయంగా పెరుగుతోంది?, నివారణ మార్గాలు ఏమిటనేది చూసేద్దాం.

వాయు కాలుష్యానికి కారణాలు

  • పెరిగిన వాహనాలు: అభివృద్ధి చెందిన ఢిల్లీ నగరంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. వాహనాల సంఖ్య పెరగడంతో.. వాటి నుంచి వెలువడే వాయువులు వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి.
  • పారిశ్రామిక రంగం: అభివృద్ధి చెందిన నగరం అంటే.. పరిశ్రమలు ఉంటాయి. నగరం లోపల కాకుండా.. బయట ఉన్నప్పటికీ కాలుష్య కారకాలు గాలిలోకి విడుదలవుతాయి. తద్వారా కాలుష్యం ఏర్పడుతోంది.
  • పంట అవశేషాలు: నగరం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో రైతులు పంట పండించిన తరువాత, పంట పూర్తిగా చేతికి వచ్చిన తరువాత వాటిని కాల్చేస్తారు. దాని నుంచి వచ్చే పొగ కూడా గాలిని కాలుష్యం చేస్తుంది.
  • ప్రస్తుత వాతావరణ పరిస్థితి: ప్రస్తుతం శీతాకాలం కావడంతో.. వాతావరణంలో మార్పు జరిగాయి. టెంపరేచర్ ఇన్వర్టర్ వల్ల గాలి స్థిరంగా ఉంది. ఈ కారణంగా గాలి ఒక నిర్దిష్ట స్థాయికంటే పైకి వెళ్లలేకపోతోంది. దీంతో కాలుష్య కణాలు కూడా అక్కడే ఆగిపోయాయి.
  • దీపావళి: గడిచిన దీపావళి సమయంలో నగరంలో కాల్చిన టపాసులు.. పెద్ద ఎత్తున కాలుష్యాన్ని కలిగించాయి. కాలుష్యం గురించి ప్రజలకు ఎంత హెచ్చరించినా.. మాట వినకపోవడంతో, ఇప్పుడు ఢిల్లిలో కాలుష్యం తారాస్థాయికి చేరింది.

కాలుష్యం తగ్గించే మార్గాలు

ఒక సమస్య వచ్చినప్పుడు దానిని వెంటనే పూర్తిగా నిర్మూలించడం అనేది అసాధ్యం. దశలవారీగా కొన్ని పద్దతులను అలవాటు చేసుకోవడం, పద్ధతులు మార్చుకోవడం చేయడం వల్ల కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఇందులో కొన్ని..

  • పాత వాహనాలను తొలగించడం: ఢిల్లీ వంటి నగరాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించాలంటే పాత వాహనాలు లేదా బీఎస్3, బీఎస్4 వాహనాల వినియోగాన్ని తగ్గించాలి. ఈ వాహనాలు బీఎస్6 వాహనాలతో పోలిస్తే.. ఎక్కువ కాలుష్య కారకాలను విడుదల చేస్తాయి. ప్రస్తుతం ఈ విధానం ఢిల్లీలో అమలులో ఉంది.
  • పచ్చదనం పెంచడం: పచ్చదనం పెంచాలని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. దాని విలువ బహుశా ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది. లేకుంటే.. వాయు కాలుష్యం పెను విషాదం మిగులుస్తుంది.
  • పరిశ్రమల కాలుష్య నియంత్రణ: పరిశ్రమలను నియంత్రించడం కష్టం, కానీ పరిశ్రమల నుంచి ఉత్పత్తి అయ్యే కాలుష్య కారకాలను తగ్గించడానికి కొన్ని టెక్నాలజీలను ఉపయోగించడం మంచిది. లేకుంటే పరిస్థితి తీవ్రతరం అవుతుంది.
  • పంటలు కాల్చే విధానం: రైతు పంట పండించిన తరువాత చివరగా.. గడ్డి మొదలైన వ్యర్దాలను కాల్చకుండా దానిని క్రషింగ్ చేసి భూమిలోకి కలిపేయడం, తక్కువ మోతాదులో ఉంటే కంపోస్ట్ ఎరువుగా మార్చుకోవడం వంటివి చేయాలి.

వాయు కాలుష్య తీవ్రత & వచ్చే సమస్యలు

దేశ రాజధానిలో వాయు కాలుష్యం 300 కంటే ఎక్కువ ఉంది. ఇది చాలా ప్రమాదం. వాయు కాలుష్యాన్ని తగ్గించకపోతే చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రధానంగా శ్వాస సంబంధిత వ్యాధులు, తలనొప్పి, వికారం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది చిన్న పిల్లలు, వృద్దులపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది.