అసెంబ్లీలో బాలకృష్ణ  కామెంట్స్.. నిజాలు బయట పెట్టిన చిరంజీవి

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు చాలా రసవత్తరంగా సాగాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని.. సినీ ప్రముఖులు కలిసిన అంశాన్ని గురించి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రస్తావించారు. చిరంజీవి గట్టిగా చెప్పడం వల్లనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగొచ్చిందని అన్నారు. దీనికి సమాధానంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎవరూ గట్టిగా అడగలేదు, అదంతా అబద్దం అని అన్నారు. ఈ మాటలకు మెగాస్టార్ చిరంజీవి రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

బాలకృష్ణ వ్యాఖ్యలకు చిరంజీవి రిప్లై

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి స్పందిస్తూ.. బాలకృష్ణ నా పేరు తీసుకొచ్చారు, కాబట్టి నేను స్పందిస్తున్నాను. సినీ ఇండస్ట్రీలోని సమస్యలను గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని.. ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు నా దగ్గరకు వచ్చారు. ఆ సమయంలో బాలకృష్ణతో మాట్లాడటానికి ఫోన్ చేశాను. అందుబాటులోకి రాలేదు. జెమిని కిరణ్‌ను స్వయంగా వెళ్లి కలిసి చెప్పమని చెప్పను. ఆయన ప్రయత్నం కూడా వృధా అయింది. చేసేదేమి లేక.. నేను చొరవ తీసుకుని కొంతమందితో వెళ్లి ముఖ్యమంత్రిని కలిశాను.

ఆ తరువాతనే వీరసింహా రెడ్డి సినిమాకైనా.. నా వాళ్తేరు వీరయ్య సినిమాకైనా ఆ రోజు టికెట్ రేట్లు పెరిగాయి. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభం చేకూరింది అని అన్నారు. నేను ముఖ్యమంత్రితో అయినా.. సామాన్యుడతో అయినా నా సహజమైన ధోరణిలోనే మాట్లాడుతానని, ప్రస్తుతం ఇండియాలో లేను కాబట్టి.. ఈ విషయాన్ని పత్రికా ప్రకటనద్వారా తెలియజేస్తున్నానని చిరంజీవి వివరణ ఇచ్చారు. అయితే బాలకృష్ణ, చిరంజీవి మధ్య ఈ మాటల యుద్ధం ఇటు రాజకీయంగా.. అటు సినీ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్‌గా మారిపోయింది.

జగన్‌ను కలిసిన సినీ ప్రముఖులు ఎవరంటే?

గత ప్రభుత్వం హయాంలో.. అంటే 2022 సంవత్సరంలో వైస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, సినిమా ఇండస్ట్రీలోని కొంత మంది వ్యక్తులు సీఎంను, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని కలిశారు. ఆ సందర్భంలో ఫిలిం ఇండస్ట్రీలో వివిధ సమస్యల గురించి.. ముఖ్యంగా సినిమా టికెట్స్ రేట్లు విషయం గురించి చర్చించడం జరిగింది.

జగన్ ప్రభుత్వం సినిమా టికెట్లను ఎటువంటి పరిస్థితుల్లో పెంచే ఆలోచన లేదని, దీనికి సంబంధించిన ఒక జీవోను కూడా అప్పట్లో విడుదల చేసింది. దీనిపై మాట్లాడటానికి సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ కొరటాల శివ, పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మొదలైనవారు ఉన్నారు.

సినీ పరిశ్రమపై.. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించకపోతే.. ఫిలిం ఇండస్ట్రీ నష్టాల్లోకి వెళ్తుందని.. చిరంజీవి, ఇతర సినీ ప్రముఖులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. ఆ తరువాతనే ప్రభుత్వం సినిమా టికెట్స్ పెంచుకోవడానికి అవకాశం కల్పించింది. అయితే ఆ సమయంలో సినీ ప్రముఖుల కార్లను గేటు బయటనే ఆపి.. కొంతదూరం నడుచుకుంటూ వెళ్లారని, విమర్శలు కూడా వినిపించాయి.