పవన్ కళ్యాణ్ ఫేవరెట్ కారు.. ఇప్పుడు కొత్త రూపంలో: ధర ఎంతో తెలుసా?

మెర్సిడెస్ బెంజ్ ఇండియా.. ఒక సంవత్సరం విరామం తరువాత జీ-క్లాస్ ఆఫ్ రోడర్ డీజిల్ వెర్షన్ లాంచ్ చేసింది. దీంతో ఈ కారు దేశంలో పెట్రోల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో మాత్రమే కాకుండా.. డీజిల్ వెర్షన్‌లో కూడా లభిస్తుంది. ఈ కొత్త కారు ధర ఎంత?, ఇతర వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

ప్రైస్ వివరాలు

సరికొత్త మెర్సిడెస్ బెంజ్ జీ 450డీ ధర రూ. 2.90 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా). అయితే కంపెనీ మొదటి కేటాయింపుగా కేవలం 50 యూనిట్లను మాత్రమే విక్రయించనున్నట్లు సమాచారం. దీని ధర ఎలక్ట్రిక్ జీ 580 కంటే రూ. 20 లక్షలు తక్కువ. ఈ కొత్త డీజిల్ వెర్షన్ ఇండియన్ మార్కెట్లోని ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 డీజిల్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ధర పరంగా ల్యాండ్ రోవర్ ధర రూ. 1.6 కోట్లు తక్కువ.

ఇంజిన్ వివరాలు

కొత్త మెర్సిడెస్ బెంజ్ జీ 450 డీ డీజిల్ వెర్షన్.. 3.0 లీటర్ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 367 హార్స్ పవర్, 750 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా ఇది 48వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టం ద్వారా మరో 20 హార్స్ పవర్ అదనంగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ద్వారా.. నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ జీ 450 డీ డీజిల్ కారు.. టాప్ స్పీడ్ 210 కిమీ. ఇది 5.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు 241 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది. కాబట్టి మంచి ఆఫ్ రోడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. మొత్తం మీద ఇది అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందని తెలుస్తోంది.

బయటి డిజైన్ వివరాలు

2025 మెర్సిడెస్ బెంజ్ జీ 450 డీ డీజిల్ కారు.. కొత్త గ్రిల్, బంపర్లు, అల్లాయ్ వీల్స్ పొందుతుంది. గ్రిల్ ఇప్పుడు క్రోమ్‌తో ఫినిష్ అయి 4 సమాంతరంగా ఉండే స్లాట్స్ కలిగి ఉంది. 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, కొత్తగా అప్డేట్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లను కూడా ఇక్కడ చూడవచ్చు. డిజైన్ పరంగా చాలా ఆకర్షణీయంగా.. చూపరులను ఆకట్టుకునే విధంగా ఉంది.

ఇంటీరియర్ ఫీచర్స్

బెంజ్ జీ 450 డీ డీజిల్ కారు.. 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ వంటివి ఉన్నాయి. ఇవి కారుకు సంబంధించిన చాలా వివరాలను వెల్లడిస్తాయి. అంతే కాకుండా ఇందులో నప్పా లెదర్ అపోల్స్ట్రే, యాంబియంట్ లైటింగ్, డాల్ఫీ అట్మాస్‌తో కూడిన 18 స్పీకర్ బర్మెస్టర్ సౌండ్ సిస్టం, లెవెల్ 2 ఏడీఏఎస్ సూట్ (యాక్టివ్ బ్రేక్ అసిస్ట్, లైన్ కీపింగ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా) కూడా ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ ఫేవరెట్ కారు

ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫేవరెట్ కారు అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఈయన ఒకప్పుడు మెర్సిడెస్ బెంజ్ జీ55 కారును కలిగి ఉండేవారు. అయితే ప్రస్తుతం ఈ కారు ఉందా? లేదా? అనేదానికి సంబంధించిన వివరాలు అందుబాటులో లేదు. కానీ ఈ కారు అంటే పవన్ కళ్యాణ్కు చాలా ఇష్టమని సమాచారం. ప్రస్తుతం కంపెనీ కూడా ఈ మోడల్ కార్లను చాలా వరకు అప్డేట్ చేసింది.