ఎంజీ మెజెస్టర్ vs ఎంజీ గ్లోస్టర్ కంపారిజన్: డిజైన్, ఫీచర్స్ & ఇంజిన్ డీటెయిల్స్!

ఎంజీ మోటార్ ఇండియా దేశీయ విఫణిలో మెజెస్టర్ కారును అధికారికంగా ఆవిష్కరించింది. ఇది గ్లోస్టర్ ఆధారంగా రూపొందించంబడినప్పటికీ.. డిజైన్, ఫీచర్స్ వంటి విషయాల్లో మాత్రమే కాకుండా, ధరలో కూడా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ కథనంలో ఈ రెండు ఎస్‌యూవీల మధ్య తేడా ఏమిటి?.. ఇతరత్రా విషయాలు వివరంగా తెలుసుకుందాం.

గ్లోస్టర్ vs మెజెస్టర్ డిజైన్

కొత్త ఎంజీ మెజెస్టర్.. గ్లోస్టర్ కంటే కూడా అత్యాధునిక ఫ్రంట్ ఎండ్ పొందుతుంది. లైటింగ్ సెటప్ భిన్నంగా ఉంటుంది. గ్లోస్టర్ ముందు భాగంలో క్రోమ్ ఎలిమెంట్స్ ఎక్కువగా కనిపిస్తుంది, మెజెస్టర్ తక్కువగా పొందుతుంది. సైడ్ ప్రొఫైల్ దాదాపు గ్లోస్టర్ మాదిరిగానే ఉంటుంది. కానీ మెజెస్టర్ 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కోసం కొత్త డిజైన్, వీల్ ఆర్చెస్, సైడ్ సిల్స్‌కు బ్లాక్ ట్రీట్‌మెంట్ అందిస్తుంది.

ముందు భాగం చాలా భిన్నంగా ఉంటుంది. ఇదే విధంగా వెనుక కూడా చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఇక్కడ రీ డిజైన్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు కనెక్టెడ్ లైట్ బార్ పొందుతుంది. అయితే మెజెస్టర్‌లో బ్రాండ్ లోగో స్థానంలో మోరిస్ గ్యారేజ్ అని ఉండటం చూడవచ్చు. గ్లోస్టర్ క్వాడ్ టిప్డ్ ఎగ్జాస్ట్ పొందుతుంది. మెజెస్టర్ డ్యూయెల్ టిప్డ్ ఎగ్జాస్ట్ పొందుతుంది.

పరిమాణం (డైమెన్షన్స్)

ఎంజీ గ్లోస్టర్ కంటే.. ఎంజీ మెజెస్టర్ కొంత పెద్దదిగా ఉంటుంది. మెజెస్టర్ పొడవు 5046 మిమీ, వెడల్పు 2016 మిమీ, ఎత్తు 1876 మిమీ, వీల్‌బేస్ 2950 మిమీ వరకు ఉంటుంది. గ్లోస్టర్ విషయానికి వస్తే.. దీని పొడవు 4985 మిమీ, వెడల్పు 1926 మిమీ, ఎత్తు 1867 మిమీ, వీల్‌బేస్ 2950 మిమీ మాత్రమే.

ఇంటీరియర్ & ఫీచర్స్

మెజెస్టర్ క్యాబిన్ లేఅవుట్ గ్లోస్టర్ కంటే భిన్నంగా ఉంటుంది. గ్లోస్టర్ బ్లాక్ అండ్ బేజ్ థీమ్ పొందితే.. మెజెస్టర్ సింగిల్ టోన్ బ్లాక్ థీమ్ పొందుతుంది. ఇందులో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కనిపిస్తాయి. సెంటర్ కన్సోల్ మౌంటెడ్ గ్రాబ్ హ్యాండిల్స్ పొందుతుంది. ఇది 6 సీట్లు, 7 సీట్ల వేరియంట్లుగా అందుబాటులో ఉంటాయి.

ఎంజీ మెజెస్టర్ కొత్త ఫీచర్స్ జాబితాలో.. పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ల కోసం హీటింగ్, మసజింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి. జేబీఏ 12 స్పీకర్ ఆడియో సిస్టం, రెండు వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్‌లు ఉన్నాయి. ఆఫ్ రోడింగ్ కోసం డిఫరెన్షియల్ లాకింగ్, క్రాల్ మోడ్ వంటివి ఉన్నాయి.

గ్లోస్టర్ vs మెజెస్టర్ పవర్‌ట్రెయిన్

ఎంజీ మెజెస్టర్ కారులో.. గ్లోస్టర్ కారులోని అదే 2.0 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఇంజిన్ 215 హార్స్ పవర్ & 478 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ కారు 4×2, 4×4 డ్రైవ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. అయితే గ్లోస్టర్ కారులోని 2.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ 161 హార్స్ పవర్, 374 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ధరలు ఇలా..

ఎంజీ గ్లోస్టర్ ధరలు రూ. 38.33 లక్షల నుంచి రూ. 46.24 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. అయితే మెజెస్టర్ ధరలు అధికారికంగా వెల్లడి కాలేదు.. కానీ దీని ధరలు రూ. 40 లక్షల నుంచి రూ. 45 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది. కాగా కంపెనీ దీని కోసం రూ. 41000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు మే 2026లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.