ఇప్పటివరకు చాలామంది రూ. 10 లక్షల కంటే తక్కువ విలువైన కార్లను గురించి విని ఉంటారు. పది కోట్ల రూపాయల కారు గురించి కూడా వినే ఉంటారు. ఎప్పుడైనా సుమారు రూ. 250 కోట్ల కారు గురించి విన్నారా?, ఇది వినగానే ఇంత ఖరీదైన కారు కూడా ఒకటి ఉంటుందా.. అనే అనుమానం కొందరికి వచ్చి ఉంటుంది. కాబట్టి ఈ కారు గురించి ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..
మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్న కారు.. రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ”లా రోజ్ నోయిర్ డ్రాప్ టెయిల్”. దీని ధర అక్షరాలా రూ. 249.48 కోట్లు అని తెలుస్తోంది. సంస్థ దీనిని నాలుగు యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. ఈ కారు ఇప్పటి వరకు అమ్మకానికి ఉన్న ఇతర రోల్స్ రాయిస్ కార్ల కంటే కూడా చాలా భిన్నంగా ఉంది. కేవలం రెండు సీట్లు మాత్రమే కలిగి ఉన్న ఈ కారును కంపెనీ నాలుగేళ్లు కష్టపడి రూపొందించింది.
డిజైన్
రోల్స్ రాయిస్ డ్రాప్ టెయిల్ కారు కన్వర్టిబుల్ కారు. దీనిని ఉక్కు, అల్యూమినియం, కార్బన్ ఫైబర్ వంటి వాటితో నిర్మించారు. 5.3 మీటర్ల పొడవు, 2.0 మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ కారు.. బ్రాండ్ యొక్క స్పెక్టర్ ఎలక్ట్రిక్ కంటే చిన్నది. డిజైన్ మాత్రం అద్భుతంగా ఉంది. లైటింగ్ సెటప్ అంతకు మించి ఉందనే చెప్పాలి. రూఫ్ ప్యానెల్ కార్బన్ ఫైబర్‌తో నిర్మితమై ఉంది. దీనిని ఆపరేట్ చేయడం కూడా చాలా సులభం. ముందు భాగం ఆకట్టుకునేలా ఉంది. గ్రిల్ బార్లు సాదరంగా నిటారుగా ఉన్నాయి.
ఫీచర్స్
ఇంటీరియర్ విషయానికి వస్తే.. విలాసవంతమైన క్యాబిన్ లభిస్తుంది. ఇన్ఫోటైన్‌మెంట్ కంట్రోల్ డయల్, పవర్డ్ సెంటర్ కన్సోల్ వంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. విశాలంగా ఉండే చెక్క ప్యానెల్ సీట్లను కలుపుతుంది. దీనిని మాజీ రోల్స్ రాయిస్ అప్రెంటిస్ తొమ్మిది నెలలు కస్టపడి నిర్మించినట్లు సమాచారం. ట్రూ లవ్ రెడ్ పెయింట్ ఇందులో గమనించవచ్చు. ఈ రంగు కారు మొత్తం విస్తరించి ఉన్నప్పటికీ.. అక్కడక్కడ బ్లాక్ కలర్ చూడవచ్చు. మొత్తం మీద ఇది ఇప్పుడు మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని కార్ల కంటే కూడా భిన్నంగా, ప్రత్యేకంగా ఉందని స్పష్టంగా తెలుస్తోంది.
పవర్‌ట్రెయిన్
రోల్స్ రాయిస్ లా రోజ్ నోయిర్ డ్రాప్ టెయిల్ ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 6.75 లీటర్ వీ12 ట్విన్ టర్బోఛార్జ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 601 హార్స్ పవర్, 840 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5.0 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుందని, టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ అని కంపెనీ వెల్లడించింది.
ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారుగా రికార్డ్ క్రియేట్ చేసిన ‘రోల్స్ రాయిస్ లా రోజ్ నోయిర్ డ్రాప్ టెయిల్’ను ఎవరు కొనుగోలు చేశారనే విషయాన్ని కంపెనీ ఇప్పటివరకు గోప్యంగానే ఉంచింది. అయితే ఈ కారును సొంతం చేసుకోవాలంటే మాత్రం భారీగా వెచ్చించాల్సిందే అని స్పష్టంగా అర్థమవుతోంది. ధర ఎక్కువైనా.. ఇది మాత్రం ఒక్క చూపుతోనే వాహన ప్రేమికులను ఆకట్టుకుంటోందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.