ఇంత ఖరీదైన స్కూటర్లను ఎప్పుడైనా చూశారా? ధర తెలిస్తే తప్పకుండా షాకవుతారు!

Most Expensive Scooters In India: బైక్ ధర ఎక్కువా? స్కూటీ ధర ఎక్కువా? అని ఎవరినైనా అడిగితే.. అందరూ బైక్ ధరే ఎక్కువని చెబుతారు. కానీ రూ. 10 లక్షల కంటే ఖరీదైన స్కూటర్లు (స్కూటీ) కూడా భరతదేశంలో అమ్మకానికి ఉన్న విషయం బహుశా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో దేశంలోనే అత్యంత ఖరీదైన స్కూటర్లు ఏవి? వాటి ధర ఎంత అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.

వెస్పా 946 డ్రాగన్

సాధారణ వెస్పా స్కూటర్లతో పోలిస్తే.. వెస్పా 946 డ్రాగన్ ధర చాలా ఎక్కువ. అంటే దీని రేటు అక్షరాలా రూ. 14.28 లక్షలు (ఎక్స్ షోరూమ్). ప్రస్తుతం భారతదేశంలో విక్రయించబడుతున్న అత్యంత ఖరీదైన స్కూటర్. లూనార్ న్యూ ఇయర్ సందర్భంగా కంపెనీ ఈ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీ 1888 యూనిట్ల వెస్పా 946 డ్రాగన్ స్కూటర్లను మాత్రమే విక్రయిస్తుంది. అంటే దీనిని 1888 మంది మాత్రమే కొనుగోలు చేయగలరు.

వెస్పా 946 డ్రాగన్ స్కూటర్ 150 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది సాధారణ వెస్పా స్కూటర్ల కంటే కొంత భిన్నంగా ఉంటుంది. గోధుమ రంగు పెయింట్ స్కీమ్ పొందిన ఈ స్కూటర్.. డ్రాగన్ గ్రాఫిక్స్ పొందుతుంది. ఇది 12 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. ఇది స్పెషల్ ఎడిషన్ కాబట్టి ధర కూడా కొంత ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

బీఎండబ్ల్యూ సీ400 జీటీ

భారతదేశంలో అత్యంత ఖరీదైన స్కూటర్ల జాబితాలో బీఎండబ్ల్యూ సీ400 జీటీ కూడా ఒకటి. ఇదొక మ్యాక్సీ స్కూటర్. దీని ధర రూ. 11.25 లక్షలు. దీనిని కంపెనీ మొదటిసారి 2021లో సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్)గా పరిచయం చేసింది. ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న అత్యంత శక్తివంతమైన స్కూటర్లలో బీఎండబ్ల్యూ సీ400 జీటీ కూడా ఒకటి.

బీఎండబ్ల్యూ సీ400 జీటీ అనేది ఒక మ్యాక్సీ స్కూటర్ కావడం వల్ల.. ఇది సాధారణ స్కూటర్ల కంటే పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ లైన్స్ మరియు క్రీజులను పొందుతుంది, వీ-షేప్ హెడ్‌ల్యాంప్ ఇక్కడ గమనించవచ్చు. అల్లాయ్ వీల్స్, స్టెప్డ్ సీటు కూడా ఇందులో చూడవచ్చు. ఈ స్కూటర్ 350 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 33.5 Bhp పవర్ మరియు 35 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 9.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 139 కిమీ కావడం గమనార్హం.

కీవే సిక్స్టీస్ 300ఐ

వినడానికి పేరు కొత్తగా ఉన్నా.. ఇది ఓ మంచి స్టైలిష్ స్కూటర్. దీని ధర రూ. 3.30 లక్షలు (ఎక్స్ షోరూమ్). కీవే అనేది చైనీస్ మోటార్‌సైకిల్ తయారీదారు కియాన్‌జియాంగ్ మోటార్‌సైకిల్ గ్రూపులో భాగం. ఈ స్కూటర్ స్పెషల్ డిజైన్ కలిగి.. చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. కంపెనీ దీనిని 60వ దశకానికి నివాళిగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

కీవే సిక్స్టీస్ 300ఐ స్కూటర్ రిట్రో డిజైన్ ఎలిమెంట్స్ పొందుతుంది. ఇందులో రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంటుంది. కస్టమర్ ఎంచుకునే కలర్ ఆప్షన్ బట్టి మెటాలిక్ యాక్సెంట్స్ ఉంటాయి. ఇది ఒక పాత మోడల్ స్కూటర్‌ను గుర్తుకు తెస్తుంది. ఇది మ్యాట్ లైట్ బ్లూ, మ్యాట్ వైట్ మరియు మ్యాట్ గ్రే అనే మూడు రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇందులోని 278.2 సీసీ ఇంజిన్ 18.4 Bhp పవర్ మరియు 23.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

కీవే వీస్టే 300

భారతదేశంలో అమ్ముడవుతున్న మరో ఖరీదైన స్కూటర్ కీవే వీస్టే 300. ఈ స్కూటర్ ధర రూ. 3.25 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని ‘కీవే సిక్స్టీస్ 300ఐ’తో కలిపి ప్రారంభించింది. దీని డిజైన్ మ్యాక్సీ స్కూటర్ తరహాలో ఉంటుంది. ఇందులో ట్విన్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, అల్లాయ్ వీల్స్, షార్ప్ లుకింగ్ బాడీ లైన్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉంటాయి. ఈ స్కూటర్ 278.2 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 18.4 Bhp పవర్ మరియు 22.4 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

ఏథర్ 450 అపెక్స్

ఇక చివరగా మన జాబితాలో చెప్పుకోదగ్గ మరియు ఖరీదైన స్కూటర్ ఏథర్ 450 అపెక్స్. కంపెనీ దీన్ని 10వ యానివెర్సరీ సందర్భంగా లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.95 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీనిని కంపెనీ పరిమితి కాలం మాత్రమే విక్రయించే అవకాశం ఉంది. చూడటానికి స్టాండర్డ్ ఏథర్ 450 ఎక్స్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇదొక స్పెషల్ పెయింట్ స్కీమ్ పొందుతుంది.

Don’t Miss: అనంత్ అంబానీ & రాధికా మర్చంట్ ఖరీదైన కార్లు ఇవే!.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

ఏథర్ 450 అపెక్స్ 3.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. చూడటానికి ఆకర్షణీయంగా ఉండే ఈ స్కూటర్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం, టైర్ ప్రెజర్ మానిటరింగ్ వంటివి పొందుతుంది. ఈ స్కూటర్ 2.9 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. మొత్తం మీద ఇది మంచి పర్ఫామెన్స్ కూడా అందిస్తుందని తెలుస్తోంది.