2025లో ఎక్కువమంది ఉపయోగించిన పాస్‌వర్డ్స్ ఇవే!

ఏదైనా అకౌంట్ క్రియేట్ చేస్తే దానికి ఒక పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలని సూచిస్తూ ఉంటారు. అయితే చాలామంది క్లిష్టమైన, తమకు మాత్రమే తెలిసేటువంటి పాస్‌వర్డ్స్ కాకూండా.. సింపుల్ పాస్‌వర్డ్స్ సెట్ చేసుకున్నట్లు రీసర్చ్ కంపారిటెక్ తన నివేదికలో వెల్లడించింది. ఈ డేటా 2025లో ఎక్కువమంది ఉపయోగించిన పాస్‌వర్డ్స్ ఏవనేది కూడా స్పష్టం చేసింది. ఇక విషయంలోకి వెళ్తే..

నివేదిక ఏం చెబుతుందంటే?

రీసర్చ్ కంపారిటెక్ సుమారు 20 లక్షల ఖాతాలను చెక్ చేసి నివేదికను విడుదల చేసింది. ఇందులో ఎక్కువమంది ఉపయోగించిన పాస్‌వర్డ్‌లు Aa123456, admin, 1234567890 వంటి వాటితో పాటు password అని వెల్లడించింది. ఇంకొందరు India@123 అనే పాస్‌వర్డ్ ఉపయోగించారు.

123456 అనే పాస్‌వర్డ్‌ను సుమారు 76 లక్షల మంది ఉపయోగించగా, admin అనే పాస్‌వర్డ్‌ను 19 లక్షల కంటే ఎక్కువమంది ఉపయోగించినట్లు తెలిసింది. 100 అత్యంత సాధారణ పాస్‌వర్డ్‌ల జాబితాలో India@123 అనే పాస్‌వర్డ్ 53వ స్థానంలో ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు.

ఎక్కువమంది ఉపయోగించిన 10 పాస్‌వర్డ్‌లు

  • 123456
  • 12345678
  • 123456789
  • admin
  • 1234
  • Aa123456
  • 12345
  • password
  • 123
  • 1234567890

నిజానికి ఎక్కువమంది ఈ పాస్‌వర్డ్‌లను ఉపయోగించుకోవడానికి ప్రధాన కారణం సులభంగా గుర్తు పెట్టుకోవడానికే. స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేస్తే కొన్ని సందర్భాల్లో మరచిపోయే అవకాశం ఉంది. కాబట్టి సింపుల్ పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసుకుంటే.. సులభంగా గుర్తుంచుకోవడమే కాకుండా.. పనికూడా వేగంగా జరిగిపోతుందని చెబుతున్నాయి. అయితే సులభమైన పాస్‌వర్డ్‌లు కొన్ని అనర్థాలను కూడా తెస్తాయనే విషయాన్ని ఎప్పటికీ మరచిపోకూడదు.

స్ట్రాంగ్ పాస్‌వర్డ్ అంటే..

మీ ఆన్‌లైన్ అకౌంట్ సురక్షితంగా ఉండాలంటే.. స్ట్రాంగ్ పాస్‌వర్డ్ చాలా అవసరం. మైక్రోసాఫ్ట్ ప్రకారం స్ట్రాంగ్ పాస్‌వర్డ్ అంటే.. కనీసం 12 అక్షరాలు ఉండాలి. ఇందులో పెద్ద ఇంగ్లీష్ లెటర్స్, చిన్న ఇంగ్లీష్ లెటర్స్ మాత్రమే కాకుండా నంబర్స్, చిహ్నాలు ఉండాలి. అప్పుడే అది స్ట్రాంగ్ పాస్‌వర్డ్ అవుతుంది. మీ కుటుంబ సభ్యులు పేర్లను పాస్‌వర్డ్‌లుగా ఉపయోగించుకోకపోవడం ఉత్తమం.

సులభమైన పాస్‌వర్డ్‌ల వల్ల జరిగే నష్టాలు

ఈరోజుల్లో టెక్నాలజీ ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు. కాబట్టి కొంతమంది సైబర్ నేరగాళ్లు మీ అకౌంట్స్ హ్యాక్ చేసి.. మీ సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంది. ఇంకొన్ని సందర్భాల్లో మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ కూడా అవ్వొచ్చు. కాబట్టి స్ట్రాంగ్ పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవడం చాలా అవసరం.

సులభమైన పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసుకున్న వ్యక్తుల ఇప్పటికైనా మేల్కోవాలి. పాస్‌వర్డ్‌లను మరింత కఠినంగా క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే మీ అకౌంట్స్ సురక్షితంగా ఉంటాయి. ఆఖరికి సోషల్ మీడియా అకౌంట్స్ పాస్‌వర్డ్‌లు కూడా కఠినంగా ఉండేలా చూసుకోవాలి. లేకుంటే.. మీ అకౌంట్స్ హ్యాక్ అవుతాయి. అందులో మీకు సంబంధం లేని విషయాలను పోస్ట్ చేస్తారు. అది మీపై తప్పకుండా ఒకింత ప్రభావం చూపుతుంది. ఇది మాత్రమే కాకుండా అధికారులు కూడా భద్రతను దృష్టిలో ఉంచుకుని స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసుకోవాలి. లేకుంటే సంస్థ నష్టాల్లోకి వెళ్లొచ్చు లేదా ఇంకేమైనా కూడా జరగవచ్చు. ఇలాంటివన్నీ దృష్టిలో ఉంచుకుని పాస్‌వర్డ్‌లను సృష్టించుకోవాలి. ఫ్రెండ్స్ అని, బంధువులని ఎవరికిపడితే వారికి పాస్‌వర్డ్‌లను చెప్పకూడదు.