తెలుగు సినిమా గతి మార్చిన వర్మ.. శివ రీ-రిలీజ్: కొత్తగా ఏముంటుందంటే?

కాలేజీ విద్యార్థుల మధ్య జరిగే స్టూడెంట్ రాజకీయాలు, ఎన్నికలు.. ఇందులో బయటి వ్యక్తులు చేరి స్టూడెంట్స్ మధ్యలో గొడవలు, సమస్యలు తీసుకురావడం. కాలేజీకి సంబంధం లేని రాజకీయ పార్టీల నాయకులు వారికి కొమ్ముకాసే రౌడీలు విద్యార్థులను వారి స్వప్రయోజనాలకోసం ఉపయోగించుకోవడం. వీటితో విసిగిపోయి. అలవాటు పడిన వాళ్ల మధ్యకి వచ్చి చేరిన హీరో శివ (నాగార్జున), వాటన్నిటిని ఎదిరించి, కొట్లాడి ఎలా నిలబడ్డాడు, ఆ పరిస్థితుల నుంచి విద్యార్థులను, ఆ సమాజాన్ని ఎలా బయటేయగలిగాడు అన్నదే స్టోరీ.

సినిమా పేరు: శివ.
విడుదల తేదీ: 1989 అక్టోబర్ 05.
దర్శకుడు: రామ్ గోపాల్ వర్మ
నిర్మాతలు: అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర
సంగీతం: ఇళయరాజా
కెమెరా: ఎస్. గోపాల్ రెడ్డి
అసిస్టెంట్ డైరెక్టర్స్: పూరీ జగన్నాథ్, గుణశేఖర్, తేజ, ఉత్తేజ్
రచయిత: తనికెళ్ళ భరణి
నిర్మాణ సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్
నటీనటులు: అక్కినేని నాగార్జున, అమల, రఘవరన్, కోట శ్రీనివాసు రావు, గొల్లపూడి మారుతిరావు తదితరులు

మాస్ హీరోగా నాగార్జున

అక్కినేని నాగార్జున, అమల జంటగా నటించిన చిత్రం శివ. నాగార్జునకి అప్పటిదాక తన సినిమా జీవితంలో ఎప్పుడు లేనంత మాస్ ఫాలోయింగ్, అద్భుతమైన.. అఖండమైన విజయాన్ని తీసుకొచ్చింది శివ. నాగ్ నటనా శైలిలో కొత్త మార్పులు చేర్చి డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ చేసింది. ఎంత వరకు మాట పలకాలి, ఏ విధంగా చెప్పాలి.. అభినయం ఎంతమేరకు చూపించాలి అని అన్నీ కూడా వర్మ మర్చివేశాడు. తెలుగు సినిమా కుర్రాళ్లు శివ వచ్చేవరకు ఒక టైపు సినిమాలకు అలవాటుపడ్డారు. శివ వచ్చాక సినిమాలు చూసే తీరే మారిపోయింది. నాగార్జున ఒక మాస్ కథానాయకుడిగా స్థిరపడటానికి శివ బీజం వేసింది.

సినిమా గతి మార్చిన వర్మ

1989 సంవత్సరం నాటి వరకు ఒక మూస పద్ధతిలో నడుస్తున్న భారతీయ చలన చిత్రాల గతిని మార్చి తనదైన సినిమా పరిజ్ఞానంతో ఒక సరికొత్త పంథాను అవలంభించిన రామ్ గోపాల్ వర్మ.. ఈ సినిమాకి దర్శకత్వం వహించడమే మార్పకి కారణమయింది. తను తీసుకున్న కథా వస్తువు సాధారణమైనప్పటికి.. వర్మ తనకి తగినట్టు మలుచుకోవడంలో జాగ్రత్త వహించాడు. కథనాన్ని నడిపించిన పద్ధతి, అందరూ అరితేరిన నటనాచతుర్యం కలిగినప్పటికి వారిలో వారికే తెలియని ఒక కొత్త నటనను రాబట్టుకున్న నైపుణ్యం, తాను సినిమా ప్రపంచానికి సంబంధించిన పుస్తకాలు చదివి, వీని, చూసి వాటన్నింటిని ఆర్జీవీ ధృక్ఫథంలోకి మార్చుకొని ఒక స్పష్టతతో చలన చిత్ర రంగానికి నవ అధ్యాయాన్ని లిఖించి బాటలు వేశాడు. ఎంతగా అంటే.. శివ సినిమాకు, ముందు శివ సినిమాకు తరువాత అన్న విధంగా మర్చివేసాడు.

ఆర్జివీ తన ఆలోచనలు తెరకేక్కించాలన్నా, తనకున్న సినిమా విజన్ తెరపై చూపించాలన్నా అందుకు తగిన ధనము.. తనను నమ్మి ముందడుగు వేయగలిగే అనుభవమున్న నిర్మాతలు అవసరం. ఆ విధంగా నమ్మకంతో డబ్బులు పెట్టిన వ్యక్తులే ఈ అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర. అక్కినేని వాళ్ల సొంత నిర్మాణం అయిన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ తీయడం అనేది వారికి కలిసిచ్చిన అంశం. ఆర్జీవీకి వీడియో క్యాసెట్స్ షాప్ ఉండటం వలన నిర్మాత సురేంద్ర ఎప్పుడు ఆ స్టూడియోకి వెళ్లి వస్తుండేవాడు. ఆ చనువుతో అక్కినేని వెంకట్ పరిచయమై.. అక్కినేని నాగార్జునని కలిసి కథ చెప్పే అవకాశాన్ని అందిపుచ్చుకుని అతనితో మొత్తానికి సినిమా చేయగలిగే ప్రొడ్యూసర్ దొరకడం నిజంగా అది యాదృశ్చికం అనే చెప్పాలి. ఆర్జీవీ అడిగిన టెక్నీషియన్స్, నటులను వాళ్లు ఒప్పుకుని ఖర్చు పెట్టడం వల్లే సినిమా అంత బాగా రావడానికి ఒక కారణం అని చెప్పొచ్చు.

ఇళయరాజా సంగీతం

అప్పటికే దక్షిణ భారతదేశ  సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించిన, విజయవంతమైన సంగీత దర్శకుడు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూర్చడం సినిమాకు అతి పెద్ద సక్సెస్ అని చెప్పొచ్చు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సన్నివేశాన్ని ఒక కళాఖండంగా తీర్చిదిద్దింది. పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.. ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గా నిలిచాయి. “సరసాలు చాలు శ్రీ వారు వేళ కాదు, ఆనందో బ్రహ్మ, ఎన్నియల్లో మళ్లీయల్లో ఎన్నెన్ని అందాలో” లాంటి రొమాంటిక్ సాంగ్స్ మంచి ఫీల్ క్రియేట్ చేస్తాయి. బోటనీ పాఠముంది పాట నేటికీ.. స్టూడెంట్స్ ఫేవరేట్ పాటే. అంతలా సినిమాకు మ్యూజిక్ సహాయ పడింది. రాం గోపాల్ వర్మకు.. ఇళయరాజా చాలా ఇష్టమైన సంగీత దర్శకుడు.

అనేక చిత్రాలకు సినిమాటోగ్రఫీ చేసి మంచి సాంకేతిక జ్ఞానం, అవగాహన ఉన్న ఎన్. గోపాల్ రెడ్డి కెమెరా బాధ్యత నిర్వర్తించడం సినిమాని ఒక మలుపు తిప్పింది. అప్పటి వరకు లేని డిఫరెంట్ యాంగిల్లో షాట్స్ తీయించాడు వర్మ. ఆర్జీవీ అనుభవం లేకపోయినా స్పష్టత ఉన్న దర్శకుడు కావడంతో సీనియర్ కెమెరామెన్ అయినప్పటికీ రాముకి ఏమి కావాలో అదే తను ఇచ్చాడు. తెలుగు మూవీ టెక్నిషియన్స్, సినిమా ప్రేక్షకులకు తెలియని ఒక కొత్త కెమెరా వర్కింగ్ స్టైల్‌ను వర్మ రుచిచూపించాడు. శివ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేశారు. దీనికి కూడా రామ్ గోపాల్ వర్మనే డైరెక్టర్ కావడం గమనార్హం.

అద్భుతమైన నటన.. ఎవరికివారే సాటి!

నటుల విషయానికి వస్తే అందరూ అప్పటివరకు బాగా పాపులారిటీ ఉన్న అమల, రఘవరన్, కోట శ్రీనివాస్ రావు, తనికెళ్ళ భరణి, మురళీ మోహన్, గొల్లపూడి మారుతీరావు, సాయిచంద్ ఉన్నారు. జెడీ చక్రవర్తి, చిన్న, శుభలేఖ సుధాకర్, ఉత్తేజ్, బ్రహ్మాజీ, రోహిణి, రాం జగన్ లాంటి కొంతమంది కొత్తవాళ్ళు ఈ సినిమాతో పరిచయమయ్యారు. రఘవరన్ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడి పాత్ర పోషిచ్చాడు. ఇందులో భయంకరంగా కనిపిస్తాడు. నటనలో జీవించాడు. మొదటిసారి ఈ మూవీలో రఘువరన్ ఒరిజినల్ వాయిస్‌తో డబ్బింగ్ చెప్పించారు. ఆ ఫార్ములా సక్సెస్ అయింది. భవాని అనే ఒక మాఫియా డాన్ మాదిరిగా ఇందులో అద్భుతంగా చేశాడు.

తనికెళ్ళ భరణి విలన్‌కు సహాయకుడిగా ప్రత్యేకంగా కనిపించాడు. మురళి మోహన్ హీరో అన్నగా సెంటిమెంట్ బాగా పండించాడు. స్టూడెంట్ మధ్య వైరాన్ని వాడుకునే రాజకీయ నాయకునిగా కొత్త ముఖ కవలికలతో మెప్పించాడు. హీరోగా సినిమాలు చేసిన సాయిచంద్ అప్పటికే సినిమాలు చేయడం నిలిపివేసిన కూడా వర్మ రిక్వెస్ట్‌తో పోలీస్ ఆఫీసర్‌గా శివ సినిమాలో కనిపించారు. గొల్లపూడి ఒకటి రెండు సీన్లే అయినా మెప్పించాడు. నాగార్జున పక్కన స్నేహితులుగా రాం జగన్, చిన్న, శుభలేఖ సుధాకర్ పాత్రలు సినిమా మలుపులు తిరగడానికి కీలకంగా పని చేశాయి. క్యాంటీన్‌లో టీ సర్వ్ చేసే ఉత్తేజ్ బాగా చేశాడు. ఇంకా బ్రహ్మాజీ కూడా ఒక చిన్న విలన్ పాత్రలో కనిపించి అలరిస్తాడు.

జేడి చక్రవర్తికి శివతో మంచి గుర్తింపు వచ్చింది. అప్పుడు చిన్న పిల్లవాడు అయిన రివర్స్‌లో గడ్డం ట్రిమ్ చేసి ఒక విలన్‌గా చూపించగలగటం జేడికి మంచి భవిష్యత్తుకు బాటలు వేసింది. ఒప్పొసిట్ స్టూడెంట్ యూనియన్ లీడర్‌గా మొదటి సినిమాకే మెప్పించాంగలిగాడు. ఆ తరువాత అతను ఒక హీరోగా కూడా సినిమాలు చేశాడు.

కొత్తగా ఏముంటుందంటే?

శివ సినిమా తరువాత సినిమాలు తీసే పద్ధతే మారిపోయింది. ఒక ట్రెండ్ సెట్ చేసింది ఈ చిత్రం. పూరీ జగన్నాథ్, కృష్ణవంశీ, గుణశేఖర్, తేజ ఇలాంటి వారంతా ఈ సినిమాతోనే అసిస్టెంట్ డైరెక్టర్లుగా.. చేసి తరువాత డైరెక్టర్స్ అయ్యారు. ఎంతోమంది టెక్నిషియన్స్, యాక్టర్స్ శివ పేరు చెప్పుకొని ఎంతో గొప్ప స్థాయికి ఎదిగారు, ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. దాదాపు 36 ఏళ్ళ క్రితం సినిమాకి ఇప్పుడు కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా ఎంత ఇంపాక్ట్ చూపించిందో అని. అందుకే ఇప్పుడు ఈ సినిమాను రీ రిలీజ్ చేయడానికి అక్కినేని నాగార్జున, రాం గోపాల్ వర్మ ప్లాన్ చేశారు. పూర్తిగా 4కే క్వాలిటీతో, డాల్భీ సౌండ్‌తో పాత సినిమాని.. కొత్త టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇది కాకుండా కొత్తగా ఏమీ ఉండదని తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సంధర్బంగా శివ మూవీని 2025 నవంబర్ 14న సినిమా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.