ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ (దే కాల్ హిమ్ ఓజీ) ఈ రోజు (సెప్టెంబర్ 25) రిలీజ్ అయిపోయింది. అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అమెరికాలో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిష్టర్ ‘నారా లోకేష్‘ ఓజీకి కొత్త అర్థం చెప్పారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
”ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్. కానీ మా పవన్ అన్న మాత్రం అభిమానులకు ఒరిజినల్ గాడ్ (నిజమైన దేవుడు). పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓజీ మూవీ రిలీజ్ సందర్భంగా పవన్ అన్నకు శుభాకాంక్షలు. సినిమా సూపర్ హిట్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని నారా లోకేష్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
ఓజీ సినిమా సింపుల్ రివ్యూ
ఓజాస్ గంభీర పాత్రలో కనిపించిన పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ అభిమానులను కట్టిపడేసారు. సుజీత్ పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో.. ఆయనను గొప్పగా చూపించారు. తమన్ మ్యూజిక్ వేరే లెవెల్ అనే చెప్పాలి. హీరోయిన్ ప్రియాంక మోహన్ చాలా తక్కువ సన్నీ వేషాల్లో కనిపించినప్పటికీ.. తన అందంతో ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక విలన్ పాత్ర పోషించిన ఇమ్రాన్ హష్మి కూడా గొప్పగా.. కథానాయకునికి ధీటుగా నిలబడ్డారు. సినిమా మొదటి భాగంలో పవన్ కళ్యాణ్ డైలాగులకంటే.. యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయనిపించింది. విరామం తరువాత సినిమాలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను కొంత గందరగోళానికి గురిచేశాయి.
మొత్తం మీద ఓజీ సినిమా ఎలాగో అభిమానులకు నచ్చేస్తుంది. తెలియాల్సిందల్లా.. సాధారణ ప్రేక్షకులను మెప్పించిందా? అనే విషయమే. ఎక్కువ యాక్షన్ సీన్స్ ఉండటం వల్ల.. ఈ సినిమాపై భిన్నభిప్రాయాలు వెలువడుతున్నాయి. కొంతమంది నెటిజన్లు సినిమా అర్థం కావడం లేదని చెబుతుంటే.. ఇంకొందరు పవన్ కళ్యాణ్ కొత్తగా కనిపించారని చెబుతున్నారు. ఈ సినిమాపై వస్తున్న టాక్ కూడా మిశ్రమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
ఓజీ సినిమా బడ్జెట్ & ఫస్ట్ డే కలెక్షన్స్
దే కాల్ హిమ్ ఓజీ.. సినిమా కోసం నిర్మాతలు సుమారు రూ. 250 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈ సినిమా ఫ్రీ బుకింగ్స్ వల్ల మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 90 కోట్ల నుంచి రూ. 98 కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం. భారతదేశంలో కూడా మొదటిరోజే దాదాపు రూ. 60 కోట్ల నుంచి రూ. 65 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ పోర్టల్ సాక్నిల్క్ వెల్లడించింది. ఉత్తర అమెరికాలో మాత్రమే ప్రీమియర్ల నుంచి రూ. 22.5 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ డేటా ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. కచ్చితమైన కలెక్షన్స్ గురించి తెలుసుకోవడానికి ఇంకా కొంత సమయం వేచి చూడాల్సి ఉంది. అయితే ఈ డేటా నిజమే అయితే.. పవన్ కళ్యాణ్ ఓజీ బిగ్ ఓపెనర్‌గా నిలిచిందని స్పష్టమవుతోంది. కాగా హరిహర వీరమల్లు సినిమా మొదటి రోజు రూ. 60 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ పొందినట్లు తెలుస్తోంది.