మనిషి జీవితంలో ఇల్లు అనేది ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. మనం అవునన్నా.. కాదన్నా.. బతుకులో భాగమవుతుంది. జీవనం సాగించడానికి తప్పనిసరి సాధనంగా, సారథిగా మారుతుంది. ప్రస్తుత ఆధునిక కాలంలో కేవలం ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా సరే గృహస్థ జీవితమే మానవ మనుగడను నిర్దేశిస్తుంది. అయితే ఇంటిని చక్కదిద్దటం అనేది చాలా కష్టంతో కూడుకున్న అంశం. దానికి ఎక్కువ ఓర్పు, నేర్పు రెండు అవసరం. డబ్బు సంపాదన మాత్రమే ఇల్లుని నడిపించదు. ఇంటి పనులు స్త్రీ, పురుష బేధం లేకుండా ఎవరైనా చేయవచ్చు, కానీ ప్రపంచం అంతా ఎందుకో ఆడవాళ్లే ఈ బాధ్యత ఎక్కువగా నిర్వర్తిస్తుంటారు. కావాలని అందులోకి నెట్టివేయబడ్డారా? లేక అది స్త్రీ సహజ లక్షణమా? అనేది తెలియదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఈరోజు నేషనల్ హౌస్ వైఫ్స్ డే.
ఎక్కడ, ఎలా మొదలైంది?
హౌస్ వైఫ్స్ డే అనేది సాధారణంగా అమెరికాలో మొదలైంది. ఇది ఎప్పుడు పుట్టింది. ఎవరు దీనిని ప్రారంభించారు అనే దానికి కచ్చితమైన ఆధారాలు లేవనే తెలుస్తోంది. అయితే 1956 లేదా 60వ దశకం నుంచి ఆరంభమైనట్టుగా చెబుతారు. అయితే ప్రతి ఏటా నవంబర్ 03వ తేదీన జాతీయ గృహిణుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ విధమైన సంస్కృతి ఎక్కువగా పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి అవుతున్నప్పటికి.. ఇక్కడి వారు కూడా, వాటిని తమకు ఆపాదించుకుని సొంతం చేసుకున్న దాఖలాలు కోకొల్లలు. ఆ పరంపరలో భాగంగా ఈ హౌస్ వైఫ్స్ డేను కూడా జరుపుకుంటున్నారు.
హౌస్ వైఫ్స్ డే ఉద్దేశ్యం..
పొద్దున్నే నిద్ర లేవడం దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు.. ఒక మహిళ తన కుటుంబాన్ని సరైన పద్ధతిలో నడిపించడానికి సమయాన్ని, శ్రమని వేచ్చిస్తుంది. ఇప్పుడు ఉన్న గ్లోబలైజేషన్ కారణంగా చదువుకున్న ఆడవారు ఒక వైపు ఉద్యోగం.. మరొక వైపు ఇంటి బాధ్యతలు రెండు కూడా చూసుకోవడం అనేది అనివార్యం అయింది. ఇంకా గ్రామీణ మహిళలు, అటు పట్టణ కార్మికుల గురించి అయితే చెప్పనక్కరలేదు. వారు నిరంతరం కూలీ పనులు, వ్యవసాయ ఆధారిత, అనేక రకాలైన ఇతర శ్రమ చేసే పనులన్నీ చేస్తూ ఇంట్లో పిల్లల చదువులు, భర్త అవసరాలు చూసుకోవాల్సి ఉంటుంది.
ఇంటిని, పరిసర ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం, బట్టలు ఉతకడం, పిల్లల స్నానాలు చేయించడం, ఇంట్లో అందరికి మూడు పూటలా వంట చేసి పెట్టడం అందులో ఇంకా వారు కోరింది చేసి ఇవ్వడం, స్కూల్ సమయానికి అన్ని సిద్ధం చేసి భర్తని ఆఫీసుకు, పిల్లల్ని స్కూలుకు పంపడం, తరువాత తాను రెడీ అయ్యి వెళ్లడం అనేది నిరంతర ప్రయాసతో కూడుకున్న పని. నేడు పెరిగిన, పెరుగుతున్న వేగవంతమైన పాశ్చాత్యా సంస్కృతి వరవడిలో మగవాళ్లు కూడా ఇంటి పనులు చేస్తున్నారు. తిండి విషయంలో అడపాదడప బయట హోటళ్లపైన ఆధారపడుతున్నప్పటికి.. సమాజంలో ఉన్న పురుషాదీక్యత కారణంగా ఎక్కువ శాతం ఆడవాల్లే ఇంటి పనుల్లో నిమగ్నమవుతున్నారు.
కాబట్టి ఈ ఒక్కరోజు అయినా.. గృహినులకి విశ్రాంతి ఇవాళ్లన్నదే హౌస్ వైఫ్స్ డే ప్రధాన ఉద్దేశ్యం. అయితే కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే వారికి శుభాకాంక్షలు తెలపడం, పనుల్లో ఉపశమనం కలిగించడం అనేది సరైన పరిష్కారం కాదు. ప్రతి రోజు కూడా భార్య, భర్త ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుని ఇంటిని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. పనులని పంచుకొని చేయడం వల్ల ఒకరిపైనే భారం పడదు. అప్పుడే గృహిణి కష్టం మగవాళ్లకు తెలుస్తుంది.
శుభాకాంక్షలు వారికి గౌరవాన్ని ఇవ్వదు!
ఒకరోజు శుభాకాంక్షలు చెప్పడం వారికి గౌరవాన్ని ఇవ్వదు. అది నిరంతర ప్రక్రియ. ప్రతిరోజు పనిలో భాగస్వామ్యం అవ్వడమే వారికి దక్కే గౌరవం. వారికీ మనం ఇచ్చే విశ్రాంతి అవుతుంది. ప్రత్యేకించి ఒకరోజు శుభాకాంక్షలు తెలపడం అనేది తప్పు అయితే కాదు, ఒక మంచి పరిణామం. ఇది గృహిణుల కళ్లలో ఆనందం నింపినవాళ్లు అవుతాము. కష్టపడి వాళ్ల జీవితాలని కుటుంబాల కోసమే త్యాగం చేసిన ఆడవాళ్ళకి అందరికి మా తరపున జాతీయ గృహిణి దినోత్సవ శుభాకాంక్షలు.