New Bajaj Chetak Launched in India: ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘బజాజ్ ఆటో’ (Bajaj Auto) ఎట్టేకలకు దేశీయ మార్కెట్లో కొత్త తరం ‘చేతక్’ (Chetak) లేదా ‘చేతక్ 35 సిరీస్’ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ స్కూటర్ కొత్త ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది దాని మునుపటి మోడల్ లేదా స్టాండర్డ్ మోడల్ కంటే కూడా హుందాగా ఉంటుంది.
వేరియంట్స్ & ధరలు (Variants & Price)
కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి 3501, 3502 మరియు 3503 వేరియంట్లు. ప్రస్తుతం బేస్ వేరియంట్ మరియు మిడ్ స్పెక్ వేరియంట్ల ధరలు మాత్రమే వెల్లడయ్యాయి. టాప్ వేరియంట్ ధరలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
➤బజాజ్ చేతక్ 3501: రూ. 1.27 లక్షలు
➤బజాజ్ చేతక్ 3502: రూ. 1.20 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, బెంగళూరు).
డిజైన్ (Design)
కొత్త ‘బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్’ (Bajaj Chetak Electric Scooter) కొత్త ఫ్రేమ్, బ్యాటరీ మరియు మోటార్ వంటి వాటిని పొందుతుంది. అయితే చూడటానికి పాత మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. ఇందులో స్లీకర్ టర్న్ ఇండికేటర్స్, బ్లాక్ అవుట్ హెడ్‌లైట్ సరౌండ్, స్లిమ్మర్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్ వంటివి కూడా ఉన్నాయి.
ఫీచర్స్ (Features)
కొత్త చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యాప్‌లతో కూడిన టీఎఫ్‌టీ డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, స్క్రీన్ మిర్రరింగ్ వంటివన్నీ ఇందులో ఉన్నాయి. వీటితో పాటు డాక్యుమెంట్ స్టోరేజ్, జియో ఫెన్సింగ్, తెఫ్ట్ వార్ణింగ్, ఓవర్ స్పీడ్ కోసం కావాల్సిన అలర్ట్స్ కూడా ఇందులో ఉన్నాయి.
బ్యాటరీ & రేంజ్ (Battery & Range)
బజాజ్ చేతక్ 3.5 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఈ బ్యాటరీ ఇప్పుడు ఫ్లోర్‌బోర్డ్ కింద ఉంది. అయితే ఈ బ్యాటరీ.. మునుపటి మోడల్లోని బ్యాటరీ కంటే కూడా 3 కేజీలు తక్కువ బరువు ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జీతో 153 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ 950 వాట్ ఛార్జర్ పొందుతుంది. దీని ద్వారా 0 నుంచి 80 శాతం ఛార్జ్ చేయడానికి పట్టే సమయం మూడు గంటలు మాత్రమే.
కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4 కేడబ్ల్యు మోటారును పొందుతుంది. కాబట్టి ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 73 కిమీ. కాబట్టి ఇది రోజువారీ వినియోగానికి, నగర ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
ఫ్లోర్ మౌంటెడ్ బ్యాటరీ (Floor Mounted Battery)
బజాజ్ కొత్త తరం చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లో చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇందులో ఫ్లోర్ మౌంటెడ్ బ్యాటరీ ఉంది. ఈ కారణంగా ఇందులో బూట్ స్పేస్ ఎక్కువగా లభిస్తుంది. ఇప్పుడు బూట్ స్పేస్ 35 లీటర్ల వరకు ఉంటుంది. వీల్‌బేస్ కూడా పెరిగింది. సీటు 80 మిమీ పొడవు ఉంటుంది. కాబట్టి ఇది రైడర్ మరియు పిలియన్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Also Read: ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న కియా కొత్త కారు: మార్కెట్లో మోత మోగిస్తున్న సిరోస్
కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కంపెనీ 3 సంవత్సరాలు లేదా 50000 కిమీ వారంటీ అందిస్తుంది. ప్రస్తుతం కంపెనీ రెండు వేరియంట్ల ధరలను మాత్రమే వెల్లడించింది. త్వరలో 3503 వేరియంట్ ధరను వెల్లడించనుంది. ఇది మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్ట, యంపియర్ నెక్సస్ మరియు ఓలా ఎస్1 రేంజ్ స్కూటర్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
చేతక్ స్కూటర్‌పై మా అభిప్రాయం
ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. ఇప్పటికే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు లాంచ్ చేసిన చేతక్ ఏలక్ట్రిక్ స్కూటర్.. దాని మునుపటి మోడల్ కంటే కూడా కొంత అప్డేట్ అయింది. కాబట్టి ఇది తప్పకుండా చేతక్ ప్రియులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాము.