ప్రపంచంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల జాబితాలో భారత్ కూడా ఒకటి. ప్రతి ఏటా లెక్కలేనంత మంది ప్రమాదాల్లో కన్నుమూస్తున్నారు. దీనికి కారణాలు చాలానే ఉన్నప్పటికీ.. సరైన రోడ్లు లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణం. అంటే గుంతలు లేదా గతుకుల రోడ్లు ప్రమాదాలకు హేతువులు అవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) కొత్త టెక్నాలజీతో.. ఈ సమస్యను పరిష్కరించడానికి సన్నద్ధమైంది.
సరికొత్త టెక్నాలజీ..
జాతీయ రహదారులపైనా గుంతలు, పగుళ్ళను గుర్తించడానికి ఎన్హెచ్ఏఐ.. లేటెస్ట్ 3డీ సెన్సార్ టెక్నాలజీని అవలంభించనుంది. 2025 చివరి నాటికి.. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా రోడ్లను మరమ్మత్తు చేయడం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇది వరకు గుంతలు పడిన రోడ్లను గుర్తించడానికి మాన్యువల్ చెకప్ ఉండేది. అంటే మనుషులు గుంతలను గుర్తించి మరమ్మత్తులు జరిపేవారు. ఇది అన్ని చోట్లా సాధ్యం కాదు, ఆలస్యం కూడా అవుతుంది. ఈ విధానానికి చరమగీతం పాడటానికి.. ఎన్హెచ్ఏఐ సంకల్పించింది. కాగా రోడ్డు మరమ్మత్తులకు ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించడం భారతదేశంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
లేసర్ బేస్డ్ సిస్టం..
3డీ సెన్సార్ టెక్నాలజీ విధానంలో.. ప్రత్యేకంగా వాహనాలపై అమర్చిన లేజర్ బేస్డ్ సిస్టం రోడ్డు ఉపరితలాన్ని స్కాన్ చేస్తుంది. అలా స్కాన్ చేసినప్పుడు.. రోడ్డుపై ఉండే బంప్, క్రాక్ వంటివాటిని రికార్డ్ చేస్తుంది. జీపీఎస్ డేటా ప్రతి సమస్యను ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఇలా గుర్తించినప్పుడు ఇంజినీర్లు సులభంగా వాటికి మరమ్మత్తులు జరిపి రోడ్డును బాగు చేస్తారు. మొదటి దశలో సుమారు 10,000 కిమీ హైవేలను స్కాన్ చేసి.. ఈ విధానం అమలు చేస్తారు.
ఏఐ టెక్నాలజీ సాయం..
సెన్సార్ రోడ్డును స్కాన్ చేసినప్పుడు.. రోడ్డుపై ఉన్న సమస్యను గుర్తించి నేరుగా ఎన్హెచ్ఏఐ సెంట్రల్ కమాండ్ సెంటర్‌కు సమాచారం అందిస్తుంది. దీనికోసం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీని కూడా ఉపయోగిస్తారు. ఈ విధానం సమయాన్ని ఆదా చేయడం మాత్రమే కాకుండా.. సమస్యను కూడా సులభంగా పరిష్కరిస్తుంది. భారతదేశంలో సురక్షితమైన రోడ్డు వ్యవస్థను నిర్మించాలని, ప్రమాదాల స్థాయిని తగ్గించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ విధానం అమలు చేయడానికి సంకల్పించింది.
40 శాతం వేగంగా పని పూర్తి
రోడ్డును మరమ్మత్తు చేయడానికి ఉపయోగించే.. 3డీ సెన్సార్ లేజర్ ట్రయాంగ్యులేషన్‌పై ఆధారపడతాయి. కాబట్టి చిన్న గుంతలను కూడా ఇది ఖచ్చితంగా గుర్తిస్తుంది. శాటిలైట్ డేటాతో కలిసినప్పుడు.. రీడింగ్‌లు హైవే యొక్క డిజిటల్ ట్విన్ను సృష్టిస్తాయి. ఇది రియల్ టైమ్ రోడ్డు పరిస్థితిని ప్రతిబింబిస్తాయి. ఈ డేటాబేస్ ట్రాఫిక్ పరిమాణం, వర్షపాతం, మరమ్మత్తు హిస్టరీ వంటివాటిని కూడా చూపిస్తుంది. ఇదంతా ఒక పిక్చర్ రూపంలో చూపించేస్తుంది. దీంతో సులభంగా రోడ్డును మరమ్మత్తులు చేసుకోవచ్చు. సంప్రదాయ తనిఖీలతో పోలిస్తే.. ఈ సెన్సార్ ద్వారా 40 శాతం వేగంగా పని పూర్తి చేయవచ్చు.
లక్ష్యం ఏమిటంటే?
3డీ సెన్సార్ విధానం ద్వారా.. ఒక ఏడాదిలోపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని జాతీయ రహదారులను మరమ్మత్తు చేయడమే లక్ష్యంగా ఎన్హెచ్ఏఐ ముందుకు సాగుతోంది. ముందుగా అధిక ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో రోడ్డును మరమ్మత్తు చేస్తుంది. రవాణా మౌలిక సదుపాయాలు బాగున్నప్పుడే.. ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది. ఇది తప్పకుండా వాహనదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని స్పష్టంగా అర్థమవుతోంది.