నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ).. కొత్త ఏడాది ప్రారంభంలోనే వాహనదారులకు శుభవార్త చెప్పింది. 2026 ఫిబ్రవరి 1 నుంచి కార్లు, జీపులు, వ్యాన్లతో సహా.. ప్యాసింజర్ వాహనాల కోసం ఫాస్ట్‌ట్యాగ్‌లను కొనుగోలు చేసేటప్పుడు కేవైవీ (నో యువర్ వెహికల్) పూర్తి చేయాల్సిన అవసరం లేదని ప్రకటించింది.
వన్ వెహికల్.. వన్ ఫాస్ట్‌ట్యాగ్
హైవేలలో ప్రయాణించే అందరికీ తప్పకుండా.. ఫాస్ట్‌ట్యాగ్ ఉండాల్సిందే. టోల్ గేట్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి కేంద్రం ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. అయితే 2024 చివర్లో.. ‘వన్ వెహికల్, వన్ ఫాస్ట్‌ట్యాగ్’ విధానానికి శ్రీకారం చుట్టింది. టోల్ వసూళ్లలో జరిగే దుర్వినియోగాన్ని ఆరికట్టానికి ఈ విధానం అమలు చేశారు. అయితే కేవైవీ చేయాల్సి వచ్చినప్పుడు.. యాప్ క్రాష్, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడంలో సమస్యలు తలెత్తేవి. ఓటీపీ వంటి వాటిలో కొన్ని టెక్నికల్ సమస్యలు కూడా నమోదయ్యాయి. ఇప్పుడు వీటన్నింటికి చెక్ పెట్టడానికి.. కేవైవీ విధానం అవసరం లేదని ప్రకటించింది.
కేవైవీ అవసరం లేదు!
సాధారణంగా అన్ని డాక్యుమెంట్స్ సమర్పించిన తరువాత.. ఫాస్ట్‌ట్యాగ్ యాక్టివేట్ అవుతుంది. కానీ కొత్త ఫ్రేమ్‌వర్క్ కింద ఫాస్ట్‌ట్యాగ్ యాక్టివేట్ సులభమైపోయింది. ఇప్పటికే ఉన్న ఫాస్ట్‌ట్యాగ్స్ కోసం కేవైవీ అవసరం లేదు. అయితే.. తప్పుడు జారీ, దుర్వినియోగం వంటి ఫిర్యాదులు ఎదురైతే మాత్రం.. కేవైవీ అవసరం అవుతుంది.
ఫాస్ట్‌ట్యాగ్ జారీ చేసే ముందు.. బ్యాంకులు వాహన్ డేటాబేస్‌లో వెహికల్ వివరాలను వెరిఫై చేసిన తరువాతనే యాక్టివేట్ చేస్తాయి. అయితే వాహనానికి సంబంధించిన వివరాలు తెలియనప్పుడు.. మాత్రమే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) ఆధారంగా వివరాలను ధృవీకరిస్తారు. ఆన్లైన్లో ఫాస్ట్‌ట్యాగ్ కొనుగోలు చేసినప్పటికీ.. ఇదే ప్రాసెస్ ఉంటుంది.
యాక్టివేషన్ సులభం!
గతంలో కేవైవీ ప్రక్రియ కోసం మీ వాహనం ముందు, వెనుక, సైడ్ వ్యూ ఫోటోలను మాత్రమే కాకుండా.. ఆర్సీ, వాహనం విండ్షీల్డ్పై అంటించిన ఫాస్ట్‌ట్యాగ్ స్టిక్కర్ ఫోటోలను కూడా అప్లోడ్ చేయాల్సి ఉండేది. కానీ ఇప్పుడు అవేవీ అవసరం లేదని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఫాస్ట్‌ట్యాగ్ యాక్టివేషన్ మరింత సులభమైపోయింది.
ఫాస్ట్‌ట్యాగ్ ఎప్పుడు.. ఎలా మొదలైంది?
భారతదేశంలో 2019లో ఫాస్ట్‌ట్యాగ్ విధానాన్ని.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది. అయితే 2021 నుంచి వాహనాలకు తప్పనిసరి అని వెల్లడించింది. ఆ తరువాత అన్ని వాహనాలు ఈ ఫాస్ట్‌ట్యాగ్స్ ఉపయోగించడం ప్రారంభించాయి.
జాతీయ రహదారులపై రద్దీని నియంత్రించడానికి.. టోల్ గేట్స్ వద్ద ఎక్కువసేపు వాహనదారులు వేచి ఉండకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఫాస్ట్‌ట్యాగ్ విధానం అమలు చేసింది. ఈ విధానం అమలైన తరువాత.. ట్రాఫిక్ చాలావరకు తగ్గింది. ఇప్పుడు ఇందులో కూడా వార్షిక టూల్ పాస్ (యాన్యువల్ టోల్ పాస్) విధానం తీసుకొచ్చింది. దీనిద్వారా ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే మళ్లీ మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదు.
శాటిలైట్ టోల్ కలెక్షన్
టోల్ కలెక్షన్ విధానాన్ని మరింత సులభం చేయడానికి.. కేంద్ర ప్రభుత్వం శాటిలైట్ టోల్ కలెక్షన్ విధానం తీసుకురావడానికి సన్నద్దమైంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు. అయితే ఈ విధానం ఎప్పుడు అమలులోకి వస్తుందనే విషయాన్నీ మాత్రమే అధికారికంగా వెల్లడించలేదు. కాబట్టి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.