సాధారణంగా పురుషులకు మాత్రమే కాకుండా.. స్త్రీలకు కూడా వాహనాలంటే (కార్లు, బైకులు) చాలా ఇష్టం. ఈ కారణంగానే తమకు నచ్చిన ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తుంటారు. ఈ కోవకు చెందినవారిలో ఒకరు నివేదా పేతురాజ్. విజయ్ యాంటోనీ రోషగాడు సినిమాలో హీరోయిన్‌గా కనిపించిన ఈమె.. అల వైకుంఠపురంలో సినిమాలో కూడా నటించారు. ఈమె సినిమాలు ఎక్కువభాగం తమిళంలోనే ఉన్నాయి. ఇక విషయానికి వస్తే.. నివేదా ఖరీదైన మరియు ప్రత్యేకమైన అమెరికన్ మజిల్ కారులో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రేసర్ కూడా..
అమెరికన్ మజిల్ కారు అనేది.. డాడ్జ్ ఛాలెంజర్ స్పోర్ట్ కారు. ఈ కారును ప్రపంచ వ్యాప్తంగా చాలా తక్కువమంది మాత్రమే కలిగి ఉన్నారు. ఈ జాబితాలో ఒకరు ఇండియన్ హీరోయిన్ నివేదా పేతురాజ్. ఈమె కేవలం నటి మాత్రమే కాకుండా రేసర్ కూడా. ఈమె రేసింగ్ చేసిన వీడియోలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.
డాడ్జ్ ఛాలెంజ్ మజిల్ కారును నివేదా పేతురాజ్ 2014లో కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే.. దుబాయ్‌లో డాడ్జ్ ఛాలెంజర్ మజిల్ కారును కలిగి ఉన్న మహిళ నివేదా కావడం గమనార్హం. ఈ విషయాన్ని ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పేర్కొన్నారు.
ఫార్ములా 1 రేసింగ్ డ్రైవర్
నివేదా పేతురాజ్.. ఒక ప్రొఫెషనల్ రేసర్ అని ప్రారంభంలో చెప్పుకున్నాము. ఈమె ఫార్ములా రేస్ కార్ శిక్షణా కార్యక్రమంలో లెవల్-1 పూర్తి చేశారు. 2021లో ఫార్ములా 1 రేసింగ్ డ్రైవర్‌గా కూడా ఈమె అర్హత సాధించింది. అంతే కాకుండా ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎమ్‌ఎస్‌సీఐ) ద్వారా సర్టిఫైడ్ లెవల్ 2 ఫార్ములా రేసర్ కూడా. బహుశా ఈ విషయం చాలామందికి తెలిసి ఉండే అవకాశం లేదు.
ఇటీవలే ఈమె కారును డ్రైవ్ చేసిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కూడా పోస్ట్ చేశారు. ఇందులో ఈమె చాలామంది ప్రొఫెషనల్ రేసర్లతో కలిసి డ్రిప్టింగ్ చేస్తున్నట్లు కనిపించింది. ఈమె పూర్తిగా కస్టమ్ బిల్ట్ డ్రిఫ్ట్ రేస్ కారును ట్రాక్‌పై స్లైడింగ్ అండ్ డ్రిప్పింగ్ చేయడం కూడా కనిపిస్తుంది. నివేదా పేతురాజ్ డ్రైవ్ చేసిన కారు ‘డాడ్జ్ ఛాలెంజర్ ఎస్/టీ’ అని తెలుస్తోంది.
డాడ్జ్ ఛాలెంజర్ ఎస్/టీ
అమెరికన్ స్పోర్ట్స్ కారు అయిన డాడ్జ్ ఛాలెంజర్ ఎస్/టీ మజిల్ 3.6 లీటర్ వీ6 ఇంజిన్ పొందుతుంది. ఇది 305 బీహెచ్‌పీ పవర్, 364 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్ డెలివరీ వెనుక చక్రాలకు సరఫరా అవుతుంది. దీంతో కారు డ్రైవ్ చేయడం కొంత కఠినంగానే ఉన్నప్పటికీ.. రేసింగ్ చేసేవారికి సరదాగా ఉంటుంది.
నివేదా పేతురాజ్ గురించి..
తెలుగు వారికి సుపరిచయమైన నివేదా పేతురాజ్.. ఒక తమిళ నటి. ఈమె 2016లో ఒరు నాల్ కూతు అనే సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అయితే మెంటల్ మదిలో అనే తెలుగు సినిమాతో.. టాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1990 నవంబర్ 30న కోవిల్‌పట్టిలో జన్మించిన ఈమె.. తన పాఠశాల విద్యను తూత్తుకుడిలో పూర్తి చేసింది. చిన్నప్పుడే తల్లిదండ్రులతో కలిసి దుబాయ్ వెళ్లి.. అక్కడే 20ఏళ్ళు ఉండిపోయింది. ఆ తరువాత ఇండియాకు తిరిగి వచ్చి.. సినిమాల్లో నటించడం ప్రారంభించింది.