ఇండియన్ మార్కెట్లో రూ. లక్ష నుంచి రూ. కోటి కంటే ఎక్కువ ఖరీదైన బైకులు అందుబాటులో ఉన్నాయి. ఎన్ని బైకులు దేశీయ విఫణిలో అమ్మకానికి ఉన్నా.. తక్కువ ధరలో లభించే బైకులకు లేదా స్కూటర్లకు డిమాండ్ ఎక్కువ. అందులోనూ లక్ష రూపాయల కంటే.. తక్కువ ధరలో లభించే వాటికి కొంత ఆదరణ ఎక్కువగానే ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని న్యూమెరోస్ మోటార్స్ ఒక సరసమైన ఎలక్ట్రిక్ టూ వీలర్ లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
బెంగళూరుకు చెందిన.. ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే స్టార్టప్ కంపెనీ న్యూమెరోస్ మోటార్స్ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. దీని పేరు ఎన్ ఫస్ట్. దీని ప్రారంభ పరిచయ ధర రూ. 64999 (ఎక్స్ షోరూమ్). ఈ ధర మొదటి 1000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తరువాత ధర పెరుగుతుంది. అయితే ఎంత పెరుగుతుందనే విషయాన్ని కంపెనీ ప్రస్తుతానికి వెల్లడించలేదు.
రోజువారీ వినియోగానికి
యువతను దృష్టిలో ఉంచుకుని.. అందులోనూ ముఖ్యంగా మహిళలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడం జరిగింది. తక్కువ బరువున్న ఈ స్కూటర్.. మంచి పనితీరును అందిస్తూ.. రోజువారీ వినియోగానికి ఉపయోగకరంగా ఉంటుందని సంస్థ వెల్లడించింది. నగర ప్రయాణానికి కూడా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. కంపెనీ ఈ స్కూటరును ఇటాలియన్ డిజైన్ స్టూడియో వీలాబ్ సహకారంతో రూపొందించింది.
ఎన్ ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. అందులో కొన్ని ఈవీ యాప్ ద్వారా కనెక్టెడ్ ఫీచర్స్, డేటా లీడ్ రైడ్ గణాంకాలతో పాటు.. దొంగతనం, టో హెచ్చరికలు, జియో ఫెన్సింగ్, రిమోట్ లాకింగ్, లైవ్ లొకేషన్ ట్రాకింగ్ వంటివి ఉన్నాయి. ఆధునిక కాలంలో ఇలాంటి ఫీచర్స్ చాలా అవసరమవుతాయి. ఈ స్కూటర్ ట్రాఫిక్ రెడ్, ప్యూర్ వైట్ అనే రెండు రంగుల్లో లభిస్తుంది.
సింగిల్ ఛార్జ్.. 109 కిమీ రేంజ్!
సుమారు ఐదు వేరియంట్లలో లభించే న్యూమెరోస్ ఎన్ ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. టాప్ వేరియంట్ ఐ-మ్యాక్స్ ప్లస్ వేరియంట్ 3 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది 109 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా ఇందులోని 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 91 కిమీ రేంజ్ అందిస్తుంది. అన్ని వేరియంట్లు.. చైన్ డ్రైవ్‌తో మిడ్ మౌంటెడ్ పీఎంఎస్ఎమ్ మోటారును పొందుతాయి. ఇది ఓవర్ ది ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లకు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడానికి 5 గంటల నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఇందులోని బ్యాటరీ వేడి, చల్లదనాన్ని తట్టుకునేలా ఉంటుంది.
బుకింగ్స్
న్యూమెరోస్ మోటార్స్ కంపెనీ.. తన ఉనికిని దేశంలోని విస్తరిస్తూ ఉంది. ఇందులో భాగంగానే.. సంస్థ బెంగళూరు, చెన్నై, కొచ్చి, త్రిస్సూర్ వంటి ప్రాంతాల్లో.. డీలర్‌షిప్ నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని నగరాలకు విస్తరిస్తుంది. 2020లో ప్రారంభమైన ఈ కంపెనీ బెంగళూరు సమీపంలో 70,000 యూనిట్ల వార్షిక సామర్థ్యం కలిగిన తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. కాగా కంపెనీ ఇప్పుడు లాంచ్ చేసిన ఎన్ ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.