పా. రంజిత్.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఈ పేరుకి ఇండియాలో ఒక ప్రత్యకమైన గుర్తింపు ఉంది. ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అనే మాట ఈయనకు బాగా సరిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి అనుమానం అక్కరలేదు. ఇతని సినిమాలు కూడా ఈ దేశంలోని కొన్ని వర్గాల ప్రజల ఆస్థిత్వాన్ని, ఉనికిని చాటిచెప్పడానికే ప్రయత్నిస్తుంటాయి. సామాజికంగా, ఆర్థికంగా సమాజంలో వెనకబడిన, అనచివేయబడిన జనం జీవితాలను, వారి చరిత్రను తెరకెక్కించడంలో పా.రంజిత్ సిద్దహస్తుడు. ఈయన దర్శకత్వంలో వచ్చిన.. అట్టకత్తి, మద్రాస్, కబాలి, కాలా, సార్పట్ట పరంపర, తంగళాన్ సినిమాలు చూస్తే అతని ఆలోచన, తపన, ఆవేదన ఏంటి అనేది అర్థమవుతాయి. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు తాజాగా.. చేతుల్ని ముడుచుకుని మిగతా వాటితో పోరాడు అనే బలమైన క్యాప్షన్‌తో ఒక కొత్త మూవీ అప్డేట్ వీడియో రిలీజ్ చేశారు.
అట్టకత్తి దినేష్ బర్త్‌డే స్పెషల్
థియేటర్లలో ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్న తమిళ చిత్రం తండకారణ్యం. ఈ సినిమా హీరో అట్టకత్తి దినేష్ (వీఆర్ దినేష్) పుట్టిన రోజు సందర్భంగా.. పా. రంజిత్ శుభాకాంక్షలు చెబుతూ నీలం ప్రొడక్షన్స్ సోషల్ మీడియా ఖాతాలో అతని కొత్త సినిమా వీడియోను అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో గమనిస్తే.. అట్టకత్తి దినేష్ మునుపెన్నడూ కనిపించని కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. నల్లని దుస్తులు ధరించి కర్రసాము చేస్తున్న యాక్షన్ సన్నివేశాలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ రాబోయే సినిమా పట్ల ఆసక్తిని మరింత పెంచేస్తున్నాయి.
రాబోయే ఈ సినిమాను లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్స్ & నీలం ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పా. రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పా. రంజిత్8 అనే హ్యాష్‌ట్యాగ్‌తో రిలీజ్ అయిన ఈ వీడియో.. ఇప్పటివరకు విడుదలైన అన్ని సినిమాలకంటే అద్భుతంగా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. అయితే ఈ సినిమాకు ఇంకా ఖరారు చేయలేదు.
ప్రస్తుతం సినిమా.. షూటింగ్ దశలో ఉంది. పా. రంజిత్, అట్టకత్తి దినేష్ (వీఆర్ దినేష్) సినీ జీవితంలో ఈ మూవీ ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అర్థమవుతోంది. అయితే సినిమా టైటిల్ ఏమిటి?, దీనికోసం ఎంత బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు?, రిలీజ్ డేట్ వంటి చాలా విషయాలు రానున్న రోజుల్లో తెలుస్తాయి. బహుశా ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
నిర్మాతగా పా. రంజిత్ సినిమాలు
ప్రముఖ దర్శకుడుగా పేరుపొందిన పా.రంజిత్ కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు, నిర్మాత కూడా. తన సొంత నిర్మాణ సంస్థ అయిన నీలం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎన్నో చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం తమిళంలో.. తాను నిర్మించిన తండకారణ్యం సినిమా రెండో వారంలో కూడా థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది. కాగా చియాన్ విక్రమ్ కుమారుడు దృవ్ విక్రమ్ హీరోగా.. డైరెక్టర్ మారి సెల్వరాజ్ దర్శకత్వంలో బైసన్ అనే సినిమాలో నటిస్తున్నారు. దీనికి నిర్మాత పా. రంజిత్. రాబోయే దీపావళికి ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, సాంగ్స్ అన్ని కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.